
విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21 వ తేదీ) జరిగిన ఏపీ క్యాబినెట భేటీలో ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్‌సీలపై కనీసం చర్చించకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న(బుధవారం) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వినయానంద్ నిర్వహఙంచినా, నేటి చంద్రబాబు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల బెనిఫిట్స్‌పై చర్చిస్తారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొచ్చాయి.
అయితే అది జరగలేదు. కనీసం ఉద్యోగుల డీఏపై కూడా చర్చింంచకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? అని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.
‘ ఈరోజు చర్చిస్తామని నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చెప్పారు. కానీ కనీసం ఒక డిఏకి కూడా ఈరోజు ఆమోదించలేదు. 15 నెలలుగా కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఇక ఐఆర్ లేదు.. పీఆర్‌సీ కమిషన్ వేయలేదు. ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తోంది. ఉద్యోగులపై పనిభారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే.. కెజిబివి ప్రిన్సిపాల్‌ని వేధిస్తే చర్యలు లేవు. ఇక ఉద్యోగులు ఎలా పని చేయాలి’ అని మండిపడ్డారు.
