
రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం
నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరగవచ్చని తెలిపారు. 20న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడొచ్చు.
21న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది. 22న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు.
23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం, అన్నమయ్య జిల్లా గాలివీడు, విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.