
కేబినెట్‌లో ఒక డీఏ, ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఎదురుచూశారు
కానీ, కూటమి సర్కారు మళ్లీ నిరాశకు గురిచేసింది
ఎన్నికల ముందు ఆశలు కల్పించి 15 నెలలైనా పట్టించకోవడంలేదు
పెండింగ్ బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయి
ఆ వివరాలూ ప్రభుత్వం చెప్పడంలేదు
దసరాలోపు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పోరాటమే
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి హెచ్చరిక
సాక్షి, అమరావతి: దసరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండిచెయ్యి చూపిందని.. శుక్రవారం జరిగిన కేబినెట్‌లో ఒక డీఏ, ఐఆర్ ఇస్తారని ఉద్యోగులందరూ ఎదురుచూసినా ఫలితం దక్కలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతోందని శనివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ, ఐఆర్ వంటి వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు.
ఆయన ఇంకా ఏం తెలిపారంటే.. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి ఆశలు కలి్పంచింది. కానీ, అధికారం చేపట్టాక వారిని పూర్తిగా మర్చిపోయింది. పైగా.. రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వడంలేదు. అలాగే, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి అస్సలు మాట్లాడటంలేదు. ప్రతీ పండక్కి ఉద్యోగులు ఎదురుచూడటం.. తర్వాత నిరాశ చెందటం పరిపాటిగా మారింది. నిజానికి.. 2019లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచి్చన 27 శాతం మధ్యంతర భృతిని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి 2019 జులై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ ఇచి్చంది.
రూ.22 వేల కోట్ల బకాయిల ఊసేలేదు..
అలాగే, గత జులైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.22 వేల కోట్లు. అయితే, ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు అడిగినా ప్రభుత్వం పెండింగ్ బకాయిల వివరాలు వెల్లడించలేదు. ఇప్పుడా బకాయిలు రూ.30 వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. పాత బకాయిల్లో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు. ఇక ప్రభుత్వం మారగానే పీఆర్‌సీ కమిషనర్ రాజీనామా చేశారు. ఇప్పటివరకు కొత్త కమిషనర్‌ను నియమించలేదంటే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్నచూపో అర్ధమవుతోంది. కేవలం 12వ పీఆర్‌సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయడానికే ప్రభుత్వం నియమించడంలేదు.
ఉద్యోగులంతా పోరాటానికి సిద్ధం కావాలి..
అన్ని ఉద్యోగ సంఘాలు 15 నెలలుగా వివిధ రూపాలలో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పదు. సమస్యలపై పోరాటానికి సిద్ధంకావాలి. దసరాలోపు డీఏ, ఐఆర్, బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపొతే పండగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతాం.