
మిగతా మూడు డీఏల సంగతేంటి?
ఐఆర్, పీఆర్సీ, సీపీఎస్ హామీలన్నీ బుట్టదాఖలు
పెండింగ్ బకాయిలు రూ.34,125 కోట్ల ఊసే లేదు
చంద్రబాబు వంచనపై ఉద్యోగుల ఆవేదన
వెట్టిచాకిరీ చేయించుకుంటూనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వ్యతిరేకత
ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనన్న అభిప్రాయం
ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసి దీపావళి కానుక అంటూ ఒక్క డీఏ ఇచ్చి సరిపెట్టడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు రావాల్సిన నాలుగు డీఏల్లో ఒక దాన్ని.. అది కూడా 16 నెలల తర్వాత ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. వాట్సప్ గ్రూపుల్లో చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే 10 రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు 27% ఐఆర్ ఇస్తే, చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో పెద్దఎత్తున జరుగుతోంది.
ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన జగన్
ఏ ప్రభుత్వం ఉన్నా ఏడాదికి రెండుసార్లు డీఏ ఇస్తుంది. కానీ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటే చంద్రబాబు ఇప్పుడు ఒకటి ఇవ్వడానికే పెద్ద హడావుడి చేయడం ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత సీఎం చంద్రబాబు వారితో సమావేశమవడం వంటి పరిణామాలను చూసి, ఐఆర్, పీఆర్సీసహా తమ డిమాండ్ల పరిష్కారం దిశలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారు.
కానీ అంత కసరత్తు తర్వాత డీఏ తప్ప ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనా లేకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు హతాశులయ్యారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం పోరాటం తప్పని పరిస్థితి నెలకొందనేది ఉద్యోగ సంఘాల ఆవేదనగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలుగా ఐఆర్ విషయాన్ని పట్టించుకోకపోవడంపై నిరాశ చెందుతున్నారు.
పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే లేదా?
వెసులుబాటు ఉన్నప్పుడు పీఆర్సీ ఇస్తామనడం, దాని గురించి అడగవద్దనడం ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ రెండు, మూడేళ్ల తర్వాతైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషన్‌ను నియమించేవారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోటరీ ఒత్తిడితో పీఆర్సీ కమిషనర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంద్రబాబు మరొకరిని నియమించలేదు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషనర్‌ను నియమించడానికి అంగీకరించేవారు.
కమిషన్ ఏర్పాటైతే పరిశీలన, అధ్యయనం తర్వాత ఏడాదికో, రెండేళ్లకో నివేదిక ఇచ్చేది. ఆ తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం సమాలోచనలు జరిపి ఒక ఏడాది తర్వాతైనా ఆ నివేదికనో, అందులోని కొన్ని అంశాలనో ఆమోదించి, పీఆర్సీ ఇవ్వడానికి వీలవుతుంది. అయితే పరిస్థితి చూస్తుంటే, 2029 ఎన్నికల్లోపు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

బకాయిలపైనా మోసమే
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.34,125 కోట్లు ఎప్పుడు ఎంత ఇస్తారో కూడా చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఆ విషయంలోనూ మోసపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ బకాయిల్లో పోలీసులకు సంబంధించి ఇవ్వాల్సిన రెండు ఎర్న్‌డ్ లీవుల్లో ఒకటి ఇవ్వడానికి అంగీకరించారు. దాని విలువ రూ.210 కోట్లు. ఆ మొత్తాన్ని రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్‌లో ఇస్తామని చెప్పారు. అంటే రూ.34 వేల కోట్లకుపైగా బకాయిల్లో రూ.210 కోట్ల బకాయిలను జనవరికి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు.
మిగిలిన రూ.33,915 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో ఆ దేవుడేకి తెలియాలనేలా పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. పోలీసులకు ఇస్తామన్న ఎర్న్‌డ్ లీవులపైనా చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రెండు ఎర్న్‌డ్ లీవ్‌లు ఇవ్వడానికి గతంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నారు. గత సంక్రాంతికే వాటిని ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్న రెండింటిలో ఒక దానికి ఎగనామం పెట్టి ఒకటి ఇవ్వడానికి తలూపడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు.
సీపీఎస్‌పైనా కప్పదాటు వైఖరి
కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. మరోవైపు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై మళ్లీ పాత విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్‌ను ఎత్తివేయడానికి సిద్ధమవుతుండడంతో వారు లబోదిబో
మంటున్నారు.
సచివాలయాల ఉద్యోగుల ఆవేదన
సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను వాలంటీర్లుగా మార్చి పింఛన్లు, సర్వేలు వంటి పనులు చేయించుకుంటూనే, ఆ వ్యవస్థ పట్ల సీఎం చంద్రబాబు తక్కువగా మాట్లాడటం వారిని బాధిస్తోంది. పరిపాలనా వ్యవస్థను గడపగడపకూ తీసుకెళ్లేందుకు గత జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా 1.26 లక్షల మందిని నియమించి చక్కటి ఫలితాలు సాధించగా, ప్రస్తుతం తమకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడమే కాకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం
ఆందోళనకు దారితీస్తోంది.
ఉద్యోగులంటే చంద్రబాబుకు అలుసా..!
ఉద్యోగులపై పెడుతున్న వ్యయాన్ని వైఎస్ జగన్ అనవసరంగా పెంచేశారన్న బాధ ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మనసులో వారి పట్ల వ్యతిరేకతను నింపుకునే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారని, ఇప్పుడు మాత్రం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
అనుద్పాతక వ్యయం పెరిగిపోతుందని చెబుతున్న ఆయన, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారని, తద్వారా వారిని ఎందుకు మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమకు చంద్రబాబు చేసిన ద్రోహం తీరనిదని, నమ్మించి గొంతు కోయడంలో ఆయన దిట్టన్న విషయం మరోసారి రుజువైందని ఉద్యోగులు వాపోతున్నారు.