
దేశ రాజధాని ఢిల్లీ.. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిట. దేశ ప్రగతిలో కీలకంగా మారాయట. ఈ వ్యాఖ్యలు ఎవరో ఆషామాషీ వ్యక్తులు చేసింది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నవి. మరీ ఇంత అతిశయోక్తా? ఢిల్లీ ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతమన్నది అందరికీ తెలుసు. కానీ అమరావతి? అమరావతి అభివృద్ది చెందుతుందని, దానికి తమ సహకారం ఉంటుందని చెబితే ఫర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇదే నిజమైతే ముంబై, బెంగుళూరు, చెన్నై హైదరాబాద్, పూణేల మాటేమిటి? అవి కదా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నవి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీయే పాలనలో వేగవంతమైన అభివృద్ది జరుగుతోందని ప్రధాని అన్నారు. అదేంటో కాస్తా వివరించి ఉంటే బాగుండేది.
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటకు అప్పనంగా అప్పగించేయడమేనా ముఖచిత్ర మార్పు అంటే? లేక... ఏడాదిన్నర కాలంలో రూ.2.10 లక్షల కోట్లు అప్పులు చేయడమా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మరచిపోయారు. మొన్నటికి మొన్న ఎన్డీయేను వీడిన చంద్రబాబును మోడీ, అమిత్ షాలు అనని మాటలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకున్నారని విమర్శించడం మాత్రమే కాదు.. తనకన్నా సీనియర్ అని చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లోకేశ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగానూ తెగనాడిన ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన్నో యువనేతగా అభివర్ణిస్తున్నారు. మనోడైతే వారసత్వ రాజకీయాలు చేసినా ఓకే అన్నమాట.
జీఎస్టీ రేట్లలో తగ్గింపులను ఉత్సవాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ, చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడరు. వాస్తవానికి పెట్రోలు, డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రూకలు మిగులుతాయి. సూపర్ గిఫ్ట్ అవుతుంది. విశాఖలో రానున్న అదానీ, గూగుల్‌ల డేటా సెంటర్‌ను ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.22 వేల కోట్ల రాయితీల్లో కొంత కేంద్రమూ భరిస్తుందని చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గిఉండేది.
ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమన్న ప్రధాని ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా, టమోటా, ఉల్లి, మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చేసిన వాళ్లు అయ్యేవారు. అదేదీ చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో. మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి. బహుశా ఇది టీడీపీ, జనసేనలకు నిరాశ కలిగించి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని రాష్ట్రనికి ఇచ్చిందేమీ లేదని, పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు వృథా చేస్తోందని అవుతోందన్న విమర్శలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తే.. మోడీ కూడా బాబు, పవన్‌లను కీర్తించి వెళ్లారు. ఎందరో ప్రధానులతో పనిచేసిన తనకు మోడీ లాంటి నేత అస్సలు కనపడనే లేదని, విలక్షణ నాయకుడని, జాతికి ఎనలేని సేవలందిస్తున్నారని చంద్రబాబు కీర్తిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు. కూటమి ఏపీలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. మోడీ దార్శనికతతో, చంద్రబాబు స్పూర్తితో సమష్టిగా ముందుకు వెళతామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపులనే డబుల్ బెనిఫిట్లు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అప్పు చేయకుండా వారం గడవని పరిస్థితుల్లో, ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న చంద్రబాబు ఈ మాటలనడం ఆత్మవంచనే అవుతుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందన్న భయమున్నా అది సూపర్ అని ప్రచారం చేయక తప్పడం లేదు. జీఎస్టీ తగ్గింపువల్ల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై కూడా ప్రయోజనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన ప్రతిభే అని అన్నిచోట్ల చెప్పుకునే చంద్రబాబు ఈసారి మాత్రం అన్నీ మోడీ చలవేనని చెప్పుకున్నారు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైన కొన్ని డిమాండ్లను సీఎం హోదాలో జగన్ ప్రస్తావించే వారు. వినతిపత్రం లాంటివి ఇచ్చేవారు. చంద్రబాబు ఈ పని మాత్రం చేయలేకపోయారు.
కారణమేమిటో మరి?
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ తనకు ఇచ్చిన శాఖలను సమర్థం నిర్వహిస్తున్నారని పవన్ పొగడడం గమనించాల్సిన అంశమే. లోకేశ్ నాయకత్వానికి పరోక్షంగా ఆమోదం చెప్పినట్లు అనుకోవాలి. లోకేశ్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. మోడీ లోకేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. రాజకీయ వారసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభ ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్దిస్తుందన్నదే డౌటు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.