
సాక్షి, కర్నూలు జిల్లా: ఎల్లో మీడియాకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పర్యటనలో వైఎస్సార్‌సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు.. ఎల్లో మీడియా ఫేక్ అంటూ విరూపాక్షి మండిపడ్డారు. మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే ఈటీవీ, ఏబీఎన్ మూసేస్తారా? అంటూ విరూపాక్షి ఛాలెంజ్ విసిరారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే దాన్ని పచ్చ మీడియా తప్పుదోవ పట్టిస్తుందంటూ విరూపాక్షి దుయ్యబట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి వినతి పత్రం ఇస్తే జీర్ణించుకోలేక పోయారంటూ ఎల్లో మీడియాపై ఆయన మండిపడ్డారు.
కాగా, మెడికల్ కళాశాలలను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం(అక్టోబర్ 16, గురువారం) కర్నూలుకు వచ్చిన మోదీని ఓర్వకల్లు విమానాశ్రయంలో జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్‌రెడ్డితో కలిసి వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను మీడియాకు వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 5 మెడికల్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

ఈ కళాశాలల నిర్వహణను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ తరహాలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు అధిక నిధులు విడుదల చేసేలా నీతి ఆయోగ్‌కు సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిరి్మంచనున్న 167కే జాతీయ రహదారి మధ్యలో కొల్హాపూర్ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిపై వైర్ కమ్ రోడ్ వంతెనగా మార్చాలని కోరామన్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరామన్నారు.