
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్‌లో చేసిన ప్రసంగాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవేనా? నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి నారాయణ తదితరులు ఆరు రోజుల సింగపూర్ పర్యటన పెట్టుకోవడమే ఆశ్చర్యం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం వరకూ ఓకే కానీ.. ఆ సింగపూరే సర్వస్వం అన్నట్లు మాట్లాడటం వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని, దాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమనడం మరీ అతిగా అనిపించింది. సింగపూర్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారట. తాను జైలులో ఉన్నప్పుడు డెబ్బై, ఎనభై, తొంభై దేశాలలో తెలుగు వారు తమ పనులు మానుకుని నిరసనలు తెలిపారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన ఏ కేసులో అరెస్టు అయింది మాత్రం వివరించలేదు. సింగపూర్ అత్యంత నీతివంతమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆ దేశ మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన ఈశ్వరన్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లిన విషయాన్ని విస్మరిస్తే సరిపోతుందా!.
సింగపూర్ అవినీతి బాగా తక్కువ ఉన్న దేశం కావచ్చు. కానీ, ఇతర దేశాల అవినీతి డబ్బుకు కేంద్రం అన్న పేరు కూడా ఉంది. సింగపూర్ కంపెనీలు అమరావతికి ఎంతవరకు వస్తాయో డౌటే అంటూనే.. సంప్రదింపులతో పాత ఒప్పందాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని చంద్రబాబు ఈ టూర్‌కు ముందు చెప్పారు. అంటే మళ్లీ సింగపూర్ కంపెనీలకు 1700 ఎకరాలు కట్టబెట్టి, ఆ భూమి అభివృద్ది కోసం ప్రభుత్వమే రూ.5500 కోట్లు వెచ్చించి, ఆ ప్లాట్ల అమ్మకానికి వారికి అప్పగిస్తారా? తద్వారా వచ్చే ఆదాయంలో 58 శాతం వారికే ఇస్తారా?. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం సింగపూర్ కంపెనీలతో పనేముంది?. ఏపీకి సంబంధించిన పలు సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి కదా!. ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు దేశీ సంస్థలకే ఇచ్చారు కదా!. అందులో తెలుగువారి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. వారు చేయలేని పని ఏదో సింగపూర్ కంపెనీలు చేస్తాయన్నట్లు చంద్రబాబు వంటి సీనియర్ నేత మాట్లాడడమే ఏపీకి పరువు తక్కువ. ఆ దేశ మంత్రితో చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. అమరావతి కోసం కన్సార్షియం ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు కూడా. సాంకేతిక సాయం అందిస్తామని మాట వరసకు అన్నట్లు అనిపిస్తుంది.
సింగపూర్ అయినా, మరో దేశం అయినా ఇక్కడ జరిగే నిర్మాణాలలో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటే గౌరవం కాని, మనం వెళ్లి పిలిస్తే లోకువ అవడం లేదా!. దీనిని పక్కనబెడితే సింగపూర్ వెళ్లి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటి?. అది ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీయడం కాదా!. నిజానికి ఏపీలో ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర పరువును దెబ్బతీశాయి. ప్రతి నిత్యం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ టూర్‌కు వెళ్లినా ఆంక్షలు పెట్టడం, రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా!. ఈ తరహా నియంతృత్వం ఏపీకి పేరు తెస్తుందా?. అపకీర్తి తెస్తుందా?. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న దందాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న స్కాంలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న తీరు.. ఇవి కదా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేది?. వాటిపై వివరణ ఇవ్వకుండా, జగన్‌పై ఆరోపణలు చేస్తే ఏమి లాభం?.
జగన్ టైమ్‌లో విధ్వంసం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు కదా!. ఈ 14 నెలల కాలంలో అది ఏంటో ఎన్నడైనా చెప్పారా?. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఆధారాలు చూపారా?. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి రావడం అప్రతిష్ట కాదా!. అప్పులు పుట్టడం లేదంటూనే సుమారు రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది. ఆ విషయం సింగపూర్ లేదా ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారికి తెలియదన్న నమ్మకంతో మాట్లాడుతున్నారా?. జగన్ తీసుకు వచ్చిన ఓడరేవులు, వైద్య కళాశాలలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా తదితర సంస్థల భవనాల నిర్మాణం వంటివి ఏపీకి ఉపయోగమా? కాదా?. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓడరేవులు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?. ఏపీకి వచ్చిన వైద్య కళాశాలల సీట్లను కూటమి ప్రభుత్వం ఎందుకు వదలుకుంది?.
జగన్ టైమ్‌లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నోరు వెళ్లబెట్టడం, లేదా అన్నీ చేసేశాం కదా అని దబాయించడం ఏపీకి వన్నె తెచ్చిందా?. ప్రతి ప్రభుత్వం కొన్ని విధానాలు నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం ముందుకు వెళుతుంది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు తన మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఇన్ని హామీలను ఇలా అమలు చేసి ప్రజల ముందు గర్వంగా నిలబడ్డామని చెప్పుకునే పరిస్థితి ఉందా?. అసలు పెన్షన్ రూ.1000 పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన వాగ్ధానాలన్నిటిని ఏడాది ఎగవేసిన విషయం వాస్తవం కాదా?. అది చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చిందా? తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వారిపైనే నిందారోపణలు చేయడం ఎంతవరకు పద్దతి అన్నది ఆలోచించుకోవాలి.
సింగపూర్ అయినా మరోచోటికి వెళ్లినా, ఏపీకి ఉన్న సానుకూల అంశాలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా లభించే సహకారం మొదలైన అంశాలు తక్కువ మాట్లాడి, ఎక్కువ భాగం జగన్ దూషణకు కేటాయిస్తే ఎల్లో మీడియాలో బ్యానర్లుగా పనికి రావచ్చేమో కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఉపయోగపడవు. సింగపూర్‌లో తెలుగు వారు తన వల్లే ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం, అంతకన్నా మించి ఆయన తనయుడు లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే అది చంద్రబాబు ఘనతేనని పొగుడుకోవడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడు కోవడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టవచ్చేమో కానీ, ఆ తర్వాత ఇలా వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారేంటి అన్న ఆలోచన వచ్చి అవహేళనకు గురవుతారని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇలాంటివి అనుభవమైనా ఈ ధోరణి మారడం లేదు. తల్లికి వందనం స్కీంను లోకేశ్ కనిపెట్టారని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. దానికి కారణం జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు ఇది కాపీ కావడమే.
ఇటీవల ఆయా మీటింగ్‌లో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు, లోకేశ్‌లు ప్రకటించగా ఎలా నవ్వులపాలైంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చెబుతున్నాయి. కర్ణాటక మంత్రి బోసు రాజు ఒక ట్వీట్ చేస్తూ ఇప్పటికే కర్ణాటకలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైందని, ఏపీలో తలపెట్టిన దానికన్నా మూడు రెట్లు శక్తిమంతమైందని, ప్రచారం చేసుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ వల్ల చంద్రబాబుకు అపఖ్యాతి వచ్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అబద్దమైనా, నిజమైనా తన గొప్ప తానే ఒకటికి వందసార్లు చెప్పుకుంటే జనం నమ్ముతారన్నది బాబు నమ్మిక. దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.