రేవంత్‌కు ఆశ లావు.. పీక సన్నమైంది! | KSR Comments On Revanth Reddy And Future City, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు ఆశ లావు.. పీక సన్నమైంది!

Oct 2 2025 12:55 PM | Updated on Oct 2 2025 1:10 PM

KSR Comments On Revanth Reddy And Future City

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్‌ సిటీ’, హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్‌ అండ్‌ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్‌ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.

ఫ్యూచర్‌ సిటీ విషయంలో రేవంత్‌ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.

అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో  పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు  గుర్తుకు వస్తాయి. హుసేన్‌ సాగర్‌ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్‌ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్‌గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్‌గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.

ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్‌ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్‌ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక  పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.

అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన  మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది.  

హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్‌ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన  భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.

మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్‌ అండ్‌ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్‌కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్‌ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్‌ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్‌ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.

ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.

మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement