సాక్షి,విజయవాడ: ఏపీలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పెంచిన నేపథ్యంలో.. నెలాఖరులో మూడు రోజుల్లోనే (డిసెంబర్ 29, 30, 31) రూ.543 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం.
గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 8 శాతం పెరిగాయి. మొత్తం డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల విలువ రూ.2,767 కోట్లుగా నమోదైంది. ఈ పెరుగుదలతో రాష్ట్రంలో మద్యం వినియోగం మరింతగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.
అధికారికంగా అనుమతించిన దుకాణాలతో పాటు, బెల్టు షాపులు కూడా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల వినియోగం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మద్యం నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం వినియోగం పెరగడం వల్ల కుటుంబాల ఆర్థిక స్థితి దెబ్బతింటుందని, సామాజిక సమస్యలు మరింతగా ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


