
భారతదేశ విద్యారంగం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాఠశాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే భవిష్యత్తు కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం, చిన్న వయసు నుంచే డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ చర్య జాతీయ విద్యా విధానం (NEP)-2020కి అనుగుణంగా ఉంది. ఇది సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.
ముఖ్య ఉద్దేశాలు.. సన్నద్ధత
విద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రేడ్ స్థాయిల్లో సమర్థవంతమైన ఏఐ విద్యను అందించడానికి ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఏఐ భావనలను సమర్థవంతంగా బోధించడానికి దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడం ఈ ప్రణాళిక అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పేర్కొంది.
విద్యార్థులపై ఏఐ ప్రభావం
🚨 India will introduce Artificial Intelligence (AI) in the school curriculum from Class 3 onwards starting 2026-27.
- Ministry of Education. pic.twitter.com/IACvizFCCv— Indian Tech & Infra (@IndianTechGuide) October 11, 2025
ప్రస్తుతం జనరేటివ్ ఏఐ వేగంగా పురోగమిస్తోంది. చాట్‌జీపీటీ, జెమినీ, గ్రోక్‌ఏఐ.. వంటి సాధనాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విద్యా పద్ధతులను మారుస్తున్నాయి. పాఠశాలల్లో ఏఐ పరిచయం విద్యార్థులకు క్లిష్టమైన ఆలోచన, సమస్య పరిష్కారం, వినూత్న నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. చిన్నప్పటి నుంచే ఏఐ సాధనాలను ఉపయోగించడం, వాటిని నేర్చుకోవడం వల్ల సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి, పరిష్కరించగల సృజనాత్మక పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుంది. ఏఐ ఆధారిత నైపుణ్యాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్లో పోటీపడే అవకాశం ఉంటుంది.
గ్రామీణ విద్యార్థుల అవసరాలు.. మౌలిక సదుపాయాలు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడం ఏఐ బోధనను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో అతిపెద్ద సవాలుగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందించాలి. ఏఐ బోధన క్రమంలో పాఠశాలల్లో తప్పనిసరిగా మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. ఇందులో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రతీ విద్యార్థికి లేదా కనీసం ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్/ టాబ్లెట్ అందుబాటులో ఉండాలి. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తపడాలి.
మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో పాఠశాల సమయం తర్వాత కూడా విద్యార్థులు ఏఐ, కంప్యూటర్లను ఉపయోగించడానికి వీలుగా ‘కమ్యూనిటీ లెర్నింగ్ కేంద్రాలు’ లేదా ‘డిజిటల్ ల్యాబ్‌లు’ ఏర్పాటు చేయడం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ బోధన, అభ్యాస సామగ్రిని స్థానిక భాషల్లో అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఏఐ భావనలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు
ఈ నూతన ఆవిష్కరణను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఉన్న అధిక ఫీజులను మరింత పెంచే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ఫీజు నియంత్రణ మండలిని బలోపేతం చేసి ఏఐ విద్య పేరుతో విధించే అదనపు ఫీజులపై పారదర్శకతను, నియంత్రణ తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన మౌలిక సదుపాయాలను అత్యంత ఉన్నత ప్రమాణాలకు మెరుగుపరచడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలి. ఇది ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజులను అనవసరంగా పెంచకుండా నిరోధించడానికి పరోక్షంగా ఒత్తిడిని సృష్టిస్తుంది. ఏఐ బోధనను పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల అయ్యే వాస్తవ ఖర్చుల ఆధారంగా మాత్రమే ఫీజులను పెంచడానికి అనుమతించే కఠినమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయాలి.
ఇదీ చదవండి: బంగారంతో ప్రైవేట్ జెట్ కొనొచ్చు! ఎప్పుడంటే..