
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్ టారిఫ్‌ల మధ్య పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ సామాన్యులకు అందని విధంగా బంగారం విలువ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా చేసిన ఓ ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం విలువ పెరుగుతున్న తీరుపై ఇది చర్చకు తెరలేపింది.
బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి గోయెంకా ఒక కిలో బంగారం విలువను దశాబ్దాల కాలంలో విలాసవంతమైన కార్ల ధరలతో పోల్చి చూపారు. ఈ పోలిక బంగారం పెట్టుబడిదారులకు గొప్ప ఆశాజనక సందేశాన్ని ఇస్తుండగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై దాని ప్రభావాన్ని సూచిస్తోంది.
హర్ష్ గోయెంకా ట్వీట్ చేసిన పసిడి-కారు పోలికలు ఇవే:
కింద తెలిపిన విధంగా కేజీ బంగారం విలువ ఆయా సంవత్సరాల్లో సదరు కార్ల ధరలకు సమానం ఉంది(అంచనా మాత్రమే).
1990లో 1 కేజీ బంగారం=మారుతి 800
2000లో 1 కేజీ బంగారం=ఈస్టీమ్
2005లో 1 కేజీ బంగారం=ఇన్నోవా
2010లో 1 కేజీ బంగారం=ఫార్చ్యూనర్
2019లో 1 కేజీ బంగారం=బీఎమ్‌డబ్ల్యూ
2025లో 1 కేజీ బంగారం=ల్యాండ్ రోవర్
పెట్టుబడికి పసిడి స్వర్ణయుగం!
ఈ పోస్ట్‌లో గోయెంకా మరింత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పెరుగుతున్న ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం విలువ మరింత ఆశాజనకంగా మారుతుందని అంచనా వేశారు.
2030లో 1 కిలో బంగారం = రోల్స్ రాయిస్ కారు ధరకు సమానం అవుతుంది.
2040లో 1 కిలో బంగారం = ఒక ప్రైవేట్ జెట్ ధరలకు సమానంగా మారుతుంది అన్నారు.
1990: 1kg gold = Maruti 800
2000: 1kg gold = Esteem
2005: 1kg gold = Innova
2010: 1kg gold = Fortuner
2019: 1kg gold = BMW
2025: 1kg gold = Land Rover
Lesson: Keep the 1kg gold- in 2030 it may equal a Rolls Royce car and in 2040 a private jet🛩️! 😀— Harsh Goenka (@hvgoenka) October 12, 2025
బంగారం విలువ ఎందుకు పెరుగుతోంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారానికి పెట్టుబడి సురక్షిత సాధనంగా డిమాండ్‌ను పెంచుతున్నాయి. అదనంగా అమెరికన్ డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. చాలా మంది పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో దాని విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా
హర్ష్ గోయెంకా ట్వీట్ ద్వారా స్పష్టమవుతున్నట్టుగా కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే ఒక కిలో బంగారం విలువ సాధారణ కారు స్థాయి నుంచి అత్యంత విలాసవంతమైన ‘ల్యాండ్ రోవర్’ స్థాయికి చేరింది. భవిష్యత్తులో అది ‘రోల్స్ రాయిస్’ లేదా ‘ప్రైవేట్ జెట్’ ధరల స్థాయికి చేరుతుందని అంచనా వేయడం పసిడిలో పెట్టుబడికి ఉన్న దీర్ఘకాలిక విలువను నొక్కి చెబుతోంది. భారతదేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, తరతరాలకు సంపదను అందించే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం అని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.