
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన ఆచరణాత్మక, సరళమైన ఆర్థిక సలహాలకు ప్రసిద్ధి చెందారు. సామాన్యులు బిలియనీర్‌గా ఎదగాలంటే ఏం చేయాలో బఫెట్ చెప్పిన ఆర్థిక సూత్రాల్లో కొన్ని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న బఫెట్ సూత్రాల ప్రకారం..‘మధ్యతరగతివారు తరచుగా ఎలా బిలియనీర్‌గా మారాలని భావిస్తుంటారు. సాధారణంగా అన్నింటికంటే ముందు పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలనే సూత్రాలు ఉన్నాయి. వీటితో దీర్ఘకాలంలో డబ్బు పోగు చేయవచ్చు. అయితే మధ్యతరగతి ప్రజలు మరింత పొదుపు చేసేందుకు మాత్రం ముందుగా తాము చేస్తున్న పనిలో నైపుణ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించవచ్చు. ఆర్థికంగా పుంజుకునేందుకు వీలవుతుంది. ఇలా వచ్చిన డబ్బును పెట్టుబడులకు మరింతగా మళ్లించి దీర్ఘకాలంలో బిలియనీర్‌గా మారవచ్చు’ అన్నారు.
‘సాధారణంగా మధ్యతరగతివారు నెలవారీ వచ్చిన ఆదాయాన్ని వివిధ అవసరాలకు ఖర్చు చేసిన తర్వాత మిగిలినదాన్ని ఆదా చేయాలనే ధోరణితో ఉంటారు. కానీ పొదుపు చేసిన తర్వాతే మిగిలినదాన్ని ఖర్చు చేయాలని గుర్తించుకోవాలి. జీతం రాగానే మొదట కొంత మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడుల కోసం కేటాయించి, మిగిలిన డబ్బుతో మాత్రమే ఖర్చులను నిర్వహించాలి. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి’ అని బఫెట్ చెప్పారు.
ఇదీ చదవండి: చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు..