అందరు లక్షల్లో ఆదాయం వస్తే ఎంత బాగుండును అనుకుంటుంటారు. అందుకోసం చిన్న పార్ట్‌టైం ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇంకొందరు ఏకంగా నెలకు లక్షల్లో సంపాదన ఉంటుంది. అయినా ఇంకా ఏదో వెలితి. సంపాదించింది ఏ మాత్రం అక్కరకు రాదు. అలాంటి బాధనే సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకున్నాడు ఓ చార్టడ్ అకౌంటెంట్.
చార్టడ్ అకౌంటెట్ నితిని కౌశిక్ సోషల్ మీడియా ఎక్స్ పోస్టులో.. ఆకర్షణీయమైన ఆదాయం ఉంది. కానీ ఆర్థిక స్వేచ్చ లేదంటూ తన గోడుని వెల్లబోసుకున్నారు. మెట్రో నగరాల్లో జీవించేవాళ్లు నెలకు రెండు లక్షలు సంపాదించినా..సరిపోవడం లేదని వాపోయాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాం అని చెప్పాడు. పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడం కూడా భారంగా ఉందని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు కూడా ఆందోళనకరంగా పెరిగాయని అన్నారు.
ఇక వైద్యం దగ్గరకు వచ్చేటప్పటికీ..ఆరోగ్య సంరక్షణ తీవ్రమైన ఆర్థిక ప్రమాదంగా ఉందని బాధగా చెప్పుకొచ్చారు. మనమంతా ట్రెడ్‌మిల్‌పై పరుగులంఖించుకుంటున్నామే తప్ప సంపదను సృష్టించుకోలేకపోతున్నాం అని వేదనగా చెప్పాడు. నిరంతరం ఈఎంఐలు చెల్లిస్తూ..రుణ చెల్లింపు యంత్రాలుగా మారిపోతున్నాం అంటూ బాధగా తన ఆవేదనను వివరించారు సీఏ కౌశిక్. అయితే ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు మండిపడ్డారు. ఇది ముమ్మాటిక ఆర్థిక నిర్వహణ వైఫల్యమని తేల్చి చెప్పారు.
సంపాదన తోపాటు ఖర్చులను బ్యాలెన్స్ చేసే నేర్పరితనం లేనప్పుడూ..ఎంత సంపాదించినా వృధానే అన్నారు. చాలీచాలని జీతంతో బతుకుతూ..తమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నావారు కూడా ఉన్నారని గుర్తుచేశారు. సంపాదనకు తగ్గ ఖర్చు, పొదుపు చేయగలిగే సమర్థత ఉంటే..ఏదైనా సాధ్యం చేసుకోగలమంటూ ఎన్నో ఆర్థిక పాఠాలు, చిట్కాలు షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు.
అంతేకాదండోయ్ అధిక ఆదాయం ఉంటే హ్యాపీ కాదు..సంతృప్తిగా బతకడం తెలియాలి. అసలు ఎంత సంపాదించాం అనేది కాదు..దాన్ని ఏవిధంగా ఖర్చుచేస్తూ..పొదుపు చేయగలం అనేది అత్యంత ముఖ్యం సుమీ.


