
ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్‌లో 10 శాతం ఐసోబుటనాల్‌ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.
ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్‌లో పదో వంతు ఇథనాల్‌ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్‌తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.
ఈ20 పెట్రోల్‌పై తప్పుడు ప్రచారం..
ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు.