
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నెలకు రూ.200కోట్ల ఆదాయం వస్తుంది. ఎవర్ని మోసం చేసి సంపాదించాల్సి ఖర్మ పట్టలేదంటూ నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గింపుతో పాటు ఇతర ఉపయోగాల్ని దృష్టిలో ఉంచుకుని 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలు జరపాలంటూ కేంద్రం నిర్ణయించింది. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల అంశంలో తన కుటుంబం ఆర్థికంగా లబ్ది పొందుతోందంటూ వచ్చిన ఆరోపణల్ని గడ్కరీ ఖండించారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ‘ఈ సందర్భంగా నా బ్రెయిల్ విలువ రూ.200కోట్లు.. నేను మోసంతో కాదు, నిజాయితీతో సంపాదిస్తున్నాను. నా కుమారులు వ్యాపారంలో ఉన్నారు. నేను వారికి సలహాలు ఇస్తాను. కానీ మోసం చేయను. ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల యాపిల్స్‌ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు’అని చెప్పారు.
నాకు డబ్బుకు కొదవలేదు. షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిల్లరీ, పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయన్న గడ్కరీ.. ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్నానని స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ సందర్భంలో ఈ20 ఇంధనంపై వస్తున్న విమర్శలపై గడ్కరీ స్పందించారు. ‘తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, అందుకు పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం జరగుతోందని ఆరోపించారు.
సుప్రీంకోర్టు కూడా ఈ20 ఇంధనంపై దాఖలైన పిల్ ను తిరస్కరించిందని గడ్కరీ గుర్తు చేశారు. ఈ విమర్శలన్నీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పెట్రోల్ లాబీలు చేస్తున్న ప్రయత్నాలని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రైతులకు మంచి జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు.
ఈ ఇంధనం సురక్షితమైనదే. ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, ఖర్చు తగ్గించే, కాలుష్యాన్ని తగ్గించే, రైతులకు మేలు చేసే విధంగా రూపొందించామన్నారు. అంతేకాక, వాహనాల స్క్రాప్ విధానాన్ని ప్రోత్సహించేందుకు జీఎస్టీ రాయితీ ఇవ్వాలని ఆర్థిక మంత్రికి సూచించానని కూడా గడ్కరీ వెల్లడించారు.