breaking news
family business
-
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్‌తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్‌ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
ఇథనాల్ పెట్రోల్.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు రాజకీయంగానూ కొంతకాలంగా.. కొన్ని రకాల ప్రచారాలు, ఊహాగానాలు, ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ పెట్రోల్‌తో గడ్కరీ కుటుంబం విపరీతంగా లాభపడుతోందని.. ఆ ఉద్దేశంతో ఆయన ఈ విధానాన్ని ప్రొత్సహిస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. అయితే ఇథనాల్ విధానాన్ని తానే రూపొందించి.. వ్యక్తిగతంగా లాభపడుతున్నానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అంతేకాదు ఈ20 పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటున్నాయనే ఘటనకు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తాజాగా ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. దాని వెనుక నేను మాత్రమే ఉన్నానన్నది ఆరోపణలే. శాస్త్రీయ పరిశోధనలు, పెట్రోలియం శాఖ, కేంద్ర మంత్రివర్గం సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీల్లో తన కుటుంబానికి(కుమారులకు) సంబంధాలున్నాయనే విమర్శలపై స్పందించిన గడ్కరీ.. తమ కుటుంబం చెరుకు పరిశ్రమలో చాలాకాలం కిందటే ఉందని గుర్తుచేశారు. అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో సుమారు 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. అందులో తన వాటా చాలా కొద్దిమాత్రమేనని చెప్పారు. "నా వాటా 0.07 శాతం మాత్రమే. అంత చిన్న వాటాతో దేశ ఇథనాల్ విధానాన్ని నా ప్రయోజనం కోసం ప్రభావితం చేయడం అసాధ్యం. ఈ విధానం వల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభం లేదు. పైసా రాదు" అని గడ్కరీ స్పష్టం చేశారు.ఆధారాలు చూపండి.. ఈ20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలపై కూడా గడ్కరీ తీవ్రంగా స్పందించారు. "ఈ20 వల్ల ఎవరి వాహనం దెబ్బతిన్నా డీలర్‌కు, మా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయండి. మేం విచారణ చేసి న్యాయం చేస్తాం. మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి వాహనాలైనా ఈ20 కారణంగా దెబ్బతిన్నాయని చెప్పగలరా?" అంటూ ప్రశ్నించారు.ప్రముఖ కంపెనీల నుంచి ఫిర్యాదుల్లేవుదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటర్స్, మహీంద్రా&మహీంద్రా నుంచి ఈ20 ఇంధనం కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయని ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల టయోటా కారుకు సంబంధించిన ఓ ఘటనలో కూడా ఇథనాల్ కారణం కాదని.. ఇంధనంలో నీరు కలవడమే సమస్యకు కారణమని విచారణలో తేలిందని చెప్పారు.నాలుగేళ్ల పరీక్షల తర్వాతే అనుమతిఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని హడావుడిగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదని గడ్కరీ వివరించారు. వాహనాలను నాలుగేళ్లపాటు పరీక్షించి, లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాతే అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇది ప్రయోగాత్మక విధానం కాదని, శాస్త్రీయంగా నిర్ధారించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.రైతులకు లాభం.. దిగుమతులు తగ్గుతాయితాను ఇథనాల్‌ను మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ ఇంధనాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నానని గడ్కరీ తెలిపారు. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. దేశ ఇంధన భద్రతకు కూడా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.నాపై దుష్ప్రచారం చేస్తోంది.. ఇథనాల్ విధానంపై వస్తున్న వివాదం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని గడ్కరీ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఇథనాల్ కార్యక్రమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.ప్రపంచమంతా ఇదే దారిఇథనాల్ వినియోగంలో భారత్ కొత్త ప్రయోగం చేయడం లేదని గడ్కరీ గుర్తు చేశారు. అమెరికా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, థాయ్‌లాండ్, స్వీడన్ ఇలా.. అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ ఇంధనం విజయవంతంగా వినియోగిస్తున్నారని చెప్పారు.అసలు ఈ20 వివాదం ఏంటి?ఈ20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం. కాలుష్యం తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యాలు. అయితే పాత మోడల్ వాహనాల్లో దీర్ఘకాలంలో ఇంజిన్, మైలేజ్‌పై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతోంది. -
టాప్ 10లో వీరే.. ఇండియాలో అత్యంత ధనిక కుటుంబాలు
హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేసింది. ఇందులో అంబానీ ఫ్యామిలీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కుటుంబ వ్యాపార విలువ రూ. 28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండవ వంతు. ఆ తరువాత జాబితాలో కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఉంది. వీరి ఫ్యామిలీ బిజినెస్ వాల్యూ రూ. 1.1 లక్షల కోట్లు పెరిగి రూ. 6.5 లక్షల కోట్ల విలువకు చేరుకుంది. మూడో స్థానంలో జిందాల్ కుటుంబం (రూ. 5.7 లక్షల కోట్లు) ఉంది.భారతదేశంలో అత్యంత విలువైన కుటుంబాల జాబితాలో నిలిచిన మొదటి మూడు ఫ్యామిలీల విలువ రూ. 40.4 లక్షల కోట్లు. ఇది ఫిలిప్పీన్స్ జీడీపీకి సమానం అని తెలుస్తోంది.భారతదేశంలోని టాప్ 10 ధనిక కుటుంబాలు➤అంబానీ కుటుంబం: రూ. 28,23,100 కోట్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)➤కుమార్ మంగళం బిర్లా కుటుంబం: రూ. 6,47,700 కోట్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)➤జిందాల్ కుటుంబం: రూ. 5,70,900 కోట్లు (జె.ఎస్.డబ్ల్యు స్టీల్)➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 5,64,200 కోట్లు (బజాజ్ గ్రూప్)➤మహీంద్రా కుటుంబం: రూ. 5,43,800 కోట్లు (మహీంద్రా & మహీంద్రా)➤నాడార్ కుటుంబం: రూ. 4,68,900 కోట్లు (హెచ్‌సిఎల్ టెక్నాలజీస్)➤మురుగప్ప కుటుంబం: రూ. 2,92,400 కోట్లు (చోళమండలం ఇన్వెస్ట్మెంట్ & ఫైనాన్స్ కంపెనీ)➤ప్రేమ్‌జీ కుటుంబం: రూ. 2,78,600 కోట్లు (విప్రో)➤అనిల్ అగర్వాల్ కుటుంబం: రూ. 2,55,000 కోట్లు (హిందూస్తాన్ జింక్)➤డాని, చోక్సీ & వకీల్ కుటుంబాలు: రూ. 2,20,900 కోట్లు (ఏషియన్ పెయింట్స్)The 2025 Barclays Private Clients Hurun India Most Valuable Family Businesses List ranks India’s top family-run enterprises. Ambani Family leads, followed by Kumar Mangalam Birla & Jindal families. Reliance Industries remains India’s most valuable family business. pic.twitter.com/I57WJFy5JC— HURUN INDIA (@HurunReportInd) August 12, 2025 -
కుటుంబ వ్యాపారం.. నా దారి నేను చూసుకుంటా..
సాక్షి, స్పెషల్ డెస్క్: తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్‌లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట.హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు.హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ప్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్‌లో ఆన్లైన్లో నిర్వహించారు.మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్‌లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్‌కాంగ్‌లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్‌వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు.వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం.ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘హురున్’ గణాంకాల ప్రకారం 2024 నాటికి దేశంలో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. అంత క్రితం ఏడాదిలో ఈ సంఖ్య 259. పదేళ్ల క్రితం 109 మాత్రమే. వీరిలో 70% మంది రూ.1,28,25,000 కోట్ల సంపదను వారసత్వంగా అందుకోనున్నారు. -
‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథం
భారతదేశంలో తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారాల దృక్పథంలో మార్పులు వస్తున్నాయి. భారతీయ పారిశ్రామికవేత్తలు 79% మంది తమ వ్యాపారాలను వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ అది వెంటనే జరిగిపోవాలని అనుకోవడం లేదని హెచ్ఎస్బీసీ సర్వే తెలిపింది. అయితే అలా యోచిస్తున్న మొత్తం పారిశ్రామికవేత్తల్లో 45% మంది ప్రస్తుతం సమర్థంగా కొనసాగుతున్నవారు ఉన్నారు. 55% మంది మొదటితరం వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరిలో 35% మంది విభిన్న తరాలకు చెందినవారు ఇకపై వారి పిల్లలు తమ సంస్థలను నడపబోరేమోనని చెబుతున్నారు. వారసత్వ బాధ్యతల కంటే వారి పిల్లలు వ్యక్తిగత ఆకాంక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.మొత్తంగా కేవలం 7 శాతం మంది భారతీయ వారసులు మాత్రమే కుటుంబ వ్యాపారాన్ని బాధ్యతగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇది చైనాలో 60%గా ఉంది. భారతీయ యువత తమ ముందున్న వ్యాపార వారసత్వాలకు కట్టుబడి ఉండటం కంటే వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే కెరియర్లను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలియజేస్తుంది. దేశంలో మొత్తంగా పారిశ్రామికవేత్తలు తమ వారసత్వానికి వ్యాపార బాధ్యతలు కట్టబెడితే సుమారు 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సంపద బదిలీ జరుగుతుందని సర్వే తెలిపింది. ఇది దేశ జీడీపీలో 1/3వ వంతు ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్గ్లోబలైజేషన్, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన కెరియర్ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నందున చాలా మంది యువ కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది వారి సొంత స్టార్టప్‌లను ప్రారంభించేందుకు దోహదం చేస్తుంది. వృత్తిపరమైన కెరియర్లను కొనసాగించడం లేదా పూర్తిగా భిన్నమైన పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుందని కొందరు భావిస్తున్నారు. -
బార్ల్కేస్ హురున్ లిస్ట్.. బిజినెస్‌లో ఈ ఫ్యామిలీలదే హవా
దేశంలోని వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ హవా చాటింది. 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల జాబితా ప్రారంభ ఎడిషన్‌లో అగ్రస్థానాన్ని పొందింది. అంబానీ కుటుంబం విలువ 309 బిలియన్ డాలర్లు (రూ.25.75 లక్షల కోట్లు). ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్, హురున్ ఇండియా 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేశాయి. ఈ లిస్ట్ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవస్థాపక కుటుంబం నుంచి తదుపరి తరం సభ్యులు వ్యాపార నిర్వహణలో లేదా దాని బోర్డులో ఉంటున్న కుటుంబ వ్యాపారాలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. 2024 మార్చి 20 నాటికి ఈ విలువలను లెక్కించారు.ఈ జాబితాలో బజాజ్ కుటుంబం మొత్తం రూ.7.13 లక్షల కోట్ల వ్యాపార విలువతో రెండో స్థానాంలో ఉండగా బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొదటి తరం వ్యవస్థాపక కుటుంబాల ప్రత్యేక కేటగిరీలో అదానీ కుటుంబం రూ.15.45 లక్షల కోట్ల విలువతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.2.37 లక్షల కోట్ల విలువతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహణలో పేరుగాంచిన పూనావాలా కుటుంబం ఉంది.2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల ఉమ్మడి విలువ రూ.130 లక్షల కోట్లు. ఇది స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాల జీడీపీ కంటే అధికం. ఈ లిస్ట్‌లో మొదటి మూడు కుటుంబ వ్యాపారాల విలువ మాత్రమే రూ.46 లక్షల కోట్లు. ఇది సింగపూర్ జీడీపీకి సమానం. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
షేర్లు ఓకే.. బిట్‌కాయిన్‌కు నో..
సాక్షి, ముంబై : దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ తన సంపదను నిర్వహించేందుకు ఏకంగా కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా షేర్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్టు ఫ్యామిలీ ఆఫీస్‌ను పర్యవేక్షిస్తున్న వెంకట్ సుబ్రమణియన్ చెప్పుకొచ్చారు. ఇక బ్యాంకు వ్యాపారానికి పోటీగా పరిణమించే రుణ వితరణకు దిగబోమని చెప్పారు. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల్లో రిస్క్ అధికంగా ఉండే క్రమంలో వాటికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కొటక్ మహీంద్ర బ్యాంకుల్లో 30 శాతం వాటా కలిగి ఉన్న ఉదయ్ కొటక్‌కు ప్రస్తుత ధరల ప్రకారం రూ 54,000 కోట్ల పైగా సంపద ఉంది. మరోవైపు ఉదయ్ కొటక్ వద్ద పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ప్రస్తుతం రూ. 6000 కోట్ల నగదు ఇతర ఆస్తులు అందుబాటులో ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది. ఈ నిధులన్నీ ఇటీవల బ్యాంకులో తన వాటాను కొంతమేర విక్రయించడం ద్వారా సమకూరాయని తెలిపింది. -
విలువలతోనే కుటుంబ వ్యాపారాల మనుగడ
తొలితరం తరవాత 70% విచ్ఛిన్నం మూడోతరం తరవాత మిగులుతున్నవి 5 శాతమే ‘సాక్షి’తో గోద్రెజ్ గ్రూపు ఛైర్మన్ ఆది గోద్రెజ్ వ్యాఖ్యలు ఐఎస్బీలో ఫ్యామిలీ బిజినెస్ సెంటర్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో కుటుంబాలు నడిపే వ్యాపార సామ్రాజ్యాలు తొలి తరం తప్పుకున్న వెంటనే 70 శాతానికి పైగా విచ్ఛిన్నమవుతున్నాయని గోద్రెజ్ గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ‘‘డబ్బు, పరపతి ఉన్నంత మాత్రాన కుటుంబ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించగలరని అనుకోవద్దు. వ్యక్తిగత బాధ్యత, సమగ్రత, నిరంతర అధ్యయనం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్... ఈ నాలుగూ ఉంటేనే ఏ రంగంలోనైనా ఫ్యామిలీ బిజినెస్‌లు సక్సెస్ అవుతాయి. సరైన భాగస్వామిని ఎంచుకోవటం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం, వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించుకోవటం, నాణ్యమైన సేవలు అందించటం కూడా కీలకం. ఫ్యామిలీ బిజినెస్‌లలో అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు విజయవంతమైనట్టు ఇండియా, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా వంటివి కావట్లేదు. పెద్ద వాళ్లు వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్నాక చిన్న వారిలో వ్యాపారంపై సమగ్ర అవగాహన ఉండట్లేదు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచుల్లో తేడాలుంటున్నాయి. అదే ప్రధాన కారణం’’ అని వివరించారు. శనివారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ‘5వ ఏషియన్ ఫ్యామిలీ బిజినెస్ సదస్సు’కు హాజరైన సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండో తరం తరవాత కూడా విచ్ఛిన్నం కాకుండా కొనసాగుతున్న ఫ్యామిలీ బిజినెస్‌లు కేవలం 15 శాతమేనన్నారు. సంపదపై ఏకాభిప్రాయం లేకే... అంతకు ముందు సదస్సులో మాట్లాడిన గోద్రెజ్... వ్యాపార వారసత్వానికి సంబంధించిన అంశాలు, సంపద నిర్వహణ, వ్యాపార విస్తరణపై ఏకాభిప్రాయం లేకే ఎక్కువ చిన్న, మధ్య తరహా కుటుంబ వ్యాపారాలు విచ్ఛిన్నమవుతున్నాయని తెలియజేశారు. స్పష్టమైన విధానాలు, పారదర్శకత ఉంటే చిన్న, మధ్య తరహా కుటుంబ వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతాయన్నారు. ‘‘ఫ్యామిలీ బిజినెస్ సక్సెస్ అనేది ఉద్యోగుల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయా కంపెనీల్లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని రివార్డులు, బహుమతులతో ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి’’ అని ఐఎస్బీ బోర్డు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న గోద్రెజ్ తెలియజేశారు. స్టార్టప్స్‌కు సంధానకర్తగా ఉండాలి... మారుతున్న ధోరణులు, టెక్నాలజీ తీరుతెన్నులకు అనుగుణంగా ఫ్యామిలీ బిజినెస్‌లూ మారాలని స్పెక్ట్రం వాల్యూ మేనేజ్మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ ష్మిథేనీ సూచించారు. ఇందుకోసం స్థానిక విశ్వ విద్యాలయాల్లో స్టార్టప్స్ ఫోరంలను ఏర్పాటు చేయాలని, ఇవి యువ పారిశ్రామిక వేత్తలకు, నైపుణ్యం ఉన్న యువతకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాలని చెప్పారు. అకాడెమీ దశలోనే సాయం చేయటంపై, కుటంబ వ్యాపారాలపై అవగాహన కల్పించాలన్నారు.


