తోటి విద్యార్థుల వేధింపుల మధ్య ఓ చిన్నారి చేసిన పోరాటం.. చివరకు విషాదంగా ముగిసిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం.. తన బాధను ఎవరికైనా చెప్పుకోవాలన్న ఆరాటం.. టీచర్లు సైతం పట్టించుకోలేదనే చిట్టితల్లి అసహనం.. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలతో మరోసారి తెరపైకి వచ్చాయి. చిన్నారి అమైరా చివరి క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో గత ఏడాది సంచలనం సృష్టించిన తొమ్మిదేళ్ల అమైరా మీనా మృతి కేసు తాజాగా విడుదలైన తరగతి గది సీసీటీవీ వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు విడుదల చేసిన ఈ దృశ్యాల్లో.. అమైరా ఆందోళనకు గురైనట్లు, పలుమార్లు క్లాస్ టీచర్‌ను ఆశ్రయించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించింది.
వీడియోలో కనిపించిన ఆ రోజు దృశ్యాలు
2025 నవంబర్ 1న జైపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న అమైరా పాఠశాల నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచే అమైరా తల్లిదండ్రులు.. తమ కుమార్తె వేధింపులకు గురైందని, పాఠశాల నుంచి తగిన స్పందన లభించలేదని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు.
సీసీటీవీలో కనిపించిన ఆ క్షణాలు
తాజాగా బయటకు వచ్చిన వీడియోలో అమైరా మొదట సాధారణంగానే తరగతి గదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. సహ విద్యార్థులతో మాట్లాడుతున్న చిన్నారి.. కొంతసేపటి తర్వాత అసౌకర్యంగా, ఆందోళనగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆమెకు ఓ డిజిటల్ స్లేట్ చూపించిన తర్వాత అమైరా ప్రవర్తనలో మార్పు కనిపించిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆమె క్లాస్ టీచర్ వద్దకు వెళ్లి తన సమస్యను వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
చేతులు జోడించడం, ఆందోళనగా కనిపించడం, ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయని, అవి ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని తెలియజేస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
On Nov 1, 2025, Amaira, a Class 4 student, died by suicide after jumping from the fourth floor of the Neerja Modi School in Jaipur.
She had been bullied for 18 months, with classmates targeting her using "bad words," many of which carried sexual undertones. However, her class… pic.twitter.com/iiS4J6UFwm— THE SKIN DOCTOR (@theskindoctor13) July 9, 2026
సహాయం కోరింది.. స్పందన రాలేదా?
అమైరా తల్లి శివానీ మీనా మాట్లాడుతూ.. తమ కుమార్తె పలుమార్లు సహాయం కోసం ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. “ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు అండగా ఎవరూ నిలబడలేదు. తరగతి గది నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లేంతవరకు ఎవరూ గమనించకపోవడం ఎలా?” అని ఆమె ప్రశ్నించారు. పాఠశాలలో భద్రతా లోపాలు ఉన్నాయని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబం ఆరోపిస్తోంది.
మరీ ఇంత నిర్లక్ష్యమా?
ఈ ఘటనపై నిర్వహించిన తనిఖీల్లో పాఠశాలలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్లు సమాచారం. సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా కమిటీ ఏర్పాటు, పై అంతస్తుల్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అమైరా చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ.. వాటిపై తగిన స్పందన లేదన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.
కన్నీటి ప్రశ్న
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో అమైరా కేసులో న్యాయం కోసం కుటుంబం చేస్తున్న పోరాటం మరింత బలపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమైరా ఘటన మరోసారి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, బుల్లీయింగ్ నియంత్రణ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమైరా ఎదుర్కొన్న బాధను సకాలంలో ఎవరైనా గుర్తించి ఉంటే.. ఈ విషాదం జరిగేదా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


