పాముకాటుకు గురైన యువతి మృతి | Young woman dies after being bitten by a snake | Sakshi
Sakshi News home page

పాముకాటుకు గురైన యువతి మృతి

Jul 10 2026 5:47 AM | Updated on Jul 10 2026 5:47 AM

Young woman dies after being bitten by a snake

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం శూన్యం

ఇది అధికారుల నిర్లక్ష్యమేనని సీపీఎం మండిపాటు

కూనవరం/చింతూరు : పాముకాటుకు గురైన కుమార్తె సమ్మక్కను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు అష్టకష్టాలుపడి డోలీలో తరలించినా ఫలితం లేకపోయింది. ఎన్ని ఆస్పత్రులకు తరలించినా ఆమె పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. తమ బిడ్డను బతికించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆమె తల్లిదండ్రులు సూట్రు లక్ష్మారెడ్డి దంపతులు బోరున విలపించారు. 

పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌ కూనవరం మండలం కూటూరు గట్టు (ఎత్తయిన కొండలు) పరిధిలోని కార్మానుకొండ గ్రామంలో కొండరెడ్డి తెగకు చెందిన సూట్రు లక్ష్మారెడ్డి దంపతుల నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె సమ్మక్క ప్రియ (18). ఇంటర్‌ వరకు చదివింది. ఈనెల 6న సమ్మక్క ప్రియ పాము కాటుకు గురైన విషయం తెలిసిందే.

నాలుగు కొండల నడుమ ఉన్న ఆ గ్రామం నుంచి డోలీ కట్టి కొండలు ఎక్కుతూ దిగుతూ ఏడు కిలోమీటర్ల మేర కాలిబాటన కూటూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్సు ప్రాథమిక చికిత్స చేసి చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించమన్నారు. అక్కడ నుంచి భద్రాచలానికి.. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్‌కి తరలించగా అక్కడ తన కుమార్తె మరణించినట్లు లక్ష్మారెడ్డి చెప్పాడు. తన కుటుంబాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆదుకోవాలని లక్ష్మారెడ్డి వేడుకున్నాడు.

అధికారుల నిర్లక్ష్యంవల్లే.. 
అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమ్మక్క ప్రియ మృతిచెందిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు లోతా రామారావు చింతూరులో ఆరోపించారు. పాముకాటుకు గురైన బాలికకు సకాలంలో వైద్యం అందక మృతిచెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల తీరు కారణంగానే నిండు ప్రాణం బలైందని.. గిరిజనుల ప్రాణాలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణని ఆయన చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే, ఏజెన్సీలోని అన్ని పీహెచ్‌సీల్లో 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement