బాబు సర్కార్ మొద్దునిద్ర.. పాతాళంలో ప్రభుత్వ పాఠశాలలు
స్కూళ్లు తెరిచి నెలవుతున్నా వెక్కిరిస్తున్న సమస్యలు
విద్యామిత్ర కిట్లు లేవు.. బూట్లూ, బెల్టులు లేవు
పాఠ్యపుస్తకాల్లేవ్.. నోటు పుస్తకాలూ కొనుక్కోవలసిందే
తరగతి గదులు వెలిసి పోయినా పట్టించుకునేవారు లేరు
మరుగుదొడ్లదీ అదే పరిస్థితి.. ఆర్వోప్లాంట్లులేవు.. తాగునీటికీ తిప్పలే
నాసిరకంగా మధ్యాహ్న భోజనం..
ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న పిల్లలు
2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే
‘సాక్షి పరిశీలన‘లో విస్తుపోయే వాస్తవాలు
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ పాఠశాల. గత విద్యా సంవత్సరంలో ఈ స్కూల్లో 723 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 606కు తగ్గిపోయింది. మరో 40 మంది విద్యార్థులు టీసీలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, టీచర్లు బలవంతంగా ఆపారు. విద్యార్థుల్లో సగానికిపైగా పుస్తకాలు అందలేదు. బ్యాగులు, బూట్లు లేవు. కొద్ది మందికే ఇటీవల యూనిఫాం ఇచ్చారు. తాగునీటి కోసం ఇచ్చిన ఆర్వో ప్లాంట్ బిగించలేదు. దాంతో పిల్లలు చేతిపంపు నీళ్లు తాగుతున్నారు.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా తయారయ్యాయి. బడులు తెరిచి నెలరోజులవుతున్నా విద్యార్థులను ఇంకా సమస్యలు వెక్కిరిస్తున్నాయి విద్యార్థి మిత్ర కిట్లకు మంగళం పాడేశారు. పాఠ్య పుస్తకాలు చాలా చోట్ల అందలేదు. నోటు పుస్తకాలు కొనుక్కోమంటున్నారు. బూట్లు లేవు. బెల్టులు గత ఏడాది ఎక్కడన్నా మిగిలితే టీచర్లు సర్దుబాటు చేస్తున్నారు. తాగునీటి కోసం గత ప్రభుత్వ హయాంలో అందించిన యంత్రాలను బిగించకుండా మూలన పడేశారు. బిగించిన చోట్ల మరమ్మతులుంటే చేయించడం లేదు. విద్యార్థులు చేతిపంపు నీళ్లే తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పచ్చడి మెతుకులైనా పర్లేదనుకుంటూ పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. రెండేళ్లక్రితం వరకు నిగనిగలాడిన నాడు–నేడు గదులు ఇపుడు రంగులు వెలిసిపోయాయి. పట్టించుకునే నాథుడు లేడు. ఇన్ని సమస్యల మధ్య సర్కారీ బడుల్లో చదువులు అథ:పాతాళానికి చేరుకున్నాయి. 2024లో 43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య గతేడాది 32 లక్షలకు పడిపోయింది. ఈ ఏడాది 30 లక్షల మందికి తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ‘సాక్షి’ బృందం పరిశీలించగా విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అరకు... విద్యార్థిమిత్ర కిట్లు లేవు..
అరకులోయ మండల కేంద్రంలోని కంఠ»ౌంషుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 417 మంది విద్యార్థులుండగా ఒక్కరికీ విద్యార్థి మిత్ర కిట్ ఇవ్వలేదు. పాఠశాల ప్రారంభం నుంచి చిక్కీల పంపిణీ లేదు. బూట్ల ఊసేలేదు. జీవీఎంసీ 39వ వార్డులోని ఎంవీడీఎం, క్వీన్‌మేరి పాఠశాలల్లో 1100 మంది విద్యార్థులున్నారు. ఒక్కరికీ విద్యార్ది మిత్ర కిట్ రాలేదు. పుస్తకాలు కూడా అరకొరగా ఇచ్చారు. ఎంవీడీఎం పాఠశాలలో మరుగుదొడ్లు సమస్య ఉండడంతో విద్యారి్ధనులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం తర్వాత చేతులు కడుక్కునే వసతి కూడా లేదు. 
అవనిగడ్డ.. ఇంటి నుంచే భోజనం..
అవనిగడ్డలోని ఏడో వార్డులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల చాలా ముఖ్యమైనది. ఇది క్లస్టర్ పాఠశాల, అలాగే, హైసూ్కల్ ప్లస్ కూడా ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి వరకు 186 మంది విద్యార్థులున్నారు. ఇందులో సగం మంది మధ్యాహ్న భోజనం ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. ఇక్కడా పుస్తకాల కొరత ఉంది. కిట్లు ఇవ్వనేలేదు. నాడు–నేడు పనులు పూర్తయినా రంగులు వేయించకపోవడంతో సిమెంటు మచ్చలు వెక్కిరిస్తున్నాయి. ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు టీసీలు తీసుకోకుండా ఉండేందుకు ప్రతినెలా రూ.8 వేలు సొంత డబ్బులు ఖర్చుచేసి పిల్లల తరలింపునకు టీచర్లే ఆటో నడుపుతున్నారు. ఇక్కడి ఆర్వో ప్లాంట్ పాడైపోయి రెండేళ్లవుతున్నా రిపేరు చేయించలేదు. 
కడప... భోజనం బాగోదు
కడప నగరంలోని గాందీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 770 మంది విద్యార్థులుండగా, 8వ తరగతిలో 15 మందికి యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, లైన్ నోట్ బుక్స్‌ను అందలేదు. 10వ తరగతిలో 25 మందికి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోగా, మరికొందరు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకున్నారు. ప్రభుత్వం పెట్టే భోజనం బాగోవడం లేదని చెప్పారు.
కడపలో మధ్యాహ్న భోజనం బాగోకపోవడంతో ఇంటి నుంచి తెచ్చిన భోజనం చేస్తున్న విద్యార్థులు
పాడేరు... పాత బ్యాగులు.. యూనిఫాంలు..
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 330 మంది విద్యార్థులున్నారు. గతేడాది మిగిలిన స్టాక్‌లో సాక్సులు, బూట్లు ఇచ్చారు. యూనిఫాం క్లాత్, పుస్తకాల బ్యాగులు, బెల్టు ఇవ్వలేదు. 6,7 తరగతుల విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు గతంలో ఇచ్చిన బెంచీలు పాడైపోతే బాగుచేయించలేదు. పిల్లలంతా చెక్క ముక్కలపై కూర్చుంటున్నారు. చాలీచాలని మరుగుదొడ్లతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌ఎం కార్యాలయం భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి. 
చిరిగిపోయిన బ్యాగును చూపిస్తున్న పాడేరు పాఠశాల విద్యార్థి
భీమిలి.. అసంపూర్తిగా గదులు..
భీమిలి మండలం తాటితూరు జడ్పీ హైసూ్కల్లో 218 మంది విద్యార్థులుండగా, పుస్తకాలు, గత ఏడాది మిగిలిన యూనిఫాం క్లాత్, బెల్టులు విద్యార్థులకు సర్దుబాటు చేశారు. బూట్లు, బ్యాగులు ఒక్కరికీ ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రారంభించిన మన బడి– మన భవిష్యత్తుతో చేపట్టిన అదనపు తరగతి గదులు, వంటగదుల నిర్మాణం నిలిచిపోయింది. స్కూల్లోని 10 యూనిట్ల టాయిలెట్లు వినియోగంలో లేకుండా పోయాయి.
భీమిలి పాఠశాలలో అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణం
తెనాలి.. ఇంకా పుస్తకాలు రాలేదు..
తెనాలి పట్టణం, రూరల్ మండల పరిధిలో 77 ఎలిమెంటరీ, రెండు ప్రాథమికోన్నత, 18 ఉన్నత పాఠశాలల్లో 8,890 మంది విద్యార్థులున్నారు. వీరిలో 1200 మందికి పాఠ్య, నోటు పుస్తకాలు ఇవ్వలేదు. బూట్లు, బెల్టులు గతేడాది మిగిలిన స్టాక్‌లో కొందరు విద్యార్థులకు సర్దుబాటు చేశారు. వాటర్ ప్లాంట్ పాడై ఏడాది అవుతున్నా బాగు చేయలేదు. దీంతో చేతి పంపు నీటినే పిల్లలు తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం లోప భూయిష్టంగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకుని తింటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులు తమ వేతనం నుంచి డబ్బు ఖర్చుచేసి వారానికి ఒకసారి బయట వ్యక్తులతో శుభ్రం చేయిస్తున్నారు.
డబ్బులివ్వరు.. కిట్లు రావు...
2024–25 విద్యా సంవత్సరంలో 36 లక్షల మంది విద్యార్థులకు రూ.911 కోట్లతో గత ప్రభుత్వమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో∙2024 జూన్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి 35 లక్షల కిట్లు సరఫరా కోసం రూ.910 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2024–25 బిల్లులు చెల్లించలేదని, అది చెల్లిస్తేనే వస్తువులు సరఫరా చేస్తామని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో సమగ్ర శిక్షలోని కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.352 కోట్లు చెల్లించి, మిగిలిన మొత్తం చెల్లించేందుకు గడువు తీసుకోగా వస్తువులు సరఫరా చేశాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ముగిసేనాటికి ఇంకా 20 శాతానికి పైగా విద్యార్థులు కిట్లు లేకుండానే చదువులు పూర్తిచేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి కూడా 35 లక్షల మంది విద్యార్థులకు రూ.910 కోట్లతో కిట్లు కొనుగోలుకు టెండర్లు పిలవగా, రెండేళ్ల బాకీ రూ.1,372 కోట్లు ఇస్తేనే బిడ్డింగ్‌లో పాల్గొంటామని ఆయా కంపెనీలు చెప్పాయి. దీంతో నిధుల విడుదలకు ప్రభుత్వం జీవోలు ఇచ్చినా, డబ్బులు ఇవ్వలేదు. దీంతో కిట్లు సరఫరా కాలేదని తెలిసింది.
నాడు బడి తెరిచిన రోజే కిట్లు పంపిణీ...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా బడులు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు ఇవ్వాలి. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీల నుంచి బిడ్లు ఆహా్వనించి టెండర్లు అప్పగిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందే కిట్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యేది. కంపెనీలకు నిధుల చెల్లింపు సకాలంలో జరిగేది.. కిట్లు సకాలంలో పంపిణీ అయ్యేవి. సర్కారు బడిలో 1–10 తరగతులు చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు రూపాయి ఆరి్థక భారం ఉండకూడదని ‘జగనన్న విద్యా కానుక’ను 2020–21 విద్యా సంవత్సరం నుంచి అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే రూ. 2900 విలువైన కిట్లు పంపిణీ చేశారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ(హైస్కూల్), మూడు జతల యూనిఫాం క్లాత్, బెల్టు, టై అందించారు. వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్ధతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. నాలుగు విద్యా సంవత్సరాలు రూ.3366.53 కోట్లతో జగనన్న విద్యా కానుకలను అందించారు.


