బాబు మమ్మల్ని చంపేస్తున్నారు! | The coalition for the release of water blocked the representatives and protested | Sakshi
Sakshi News home page

బాబు మమ్మల్ని చంపేస్తున్నారు!

Jul 10 2026 5:33 AM | Updated on Jul 10 2026 5:33 AM

The coalition for the release of water blocked the representatives and protested

జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ, వెంకట­రమణ చౌదరి, నవీన్‌లను అడ్డుకుంటున్న భూములు కోల్పోయిన బాధిత రైతులు

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతుల ఆగ్రహం

మేమంతా టీడీపీనే.. సొంత పార్టీనే రోడ్డున పడేసింది

పట్టా పుస్తకాలపై జగన్‌ ఫొటో వేస్తున్నాడని విమర్శించారు.. 

మరి మా భూములు తీసుకున్న చంద్రబాబు పరిహారం ఎందుకివ్వరు?

నీటి విడుదల కోసం వచ్చిన కూటమి ప్రజాప్రతినిధులను అడ్డుకుని నిరసన

సీతానగరం: దౌర్జన్యంగా భూములు లాక్కు­న్న చంద్రబాబు సర్కారు నిర్వాసితు­లకు కనీసం పరిహారం కూడా చెల్లించకపోవటా­న్ని నిరసిస్తూ రైతులు, మహిళా రైతులు తమ కుటుంబాలతో కలసి ఆందోళనకు దిగి కూట­మి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెల­కొంది. ఎత్తిపోతల పథకం నుంచి సాగునీ­టిని విడుదల చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకట రమణ చౌదరి, కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల నవీన్‌లను బాధిత రైతులు అడ్డుకున్నారు. 

తామందరం టీడీపీకి చెందినవారమని... పాము తమ పిల్లలను ఎలా చంపుతుందో చంద్రబాబు త­మ­ను అలా చంపుతున్నారని నిర్వాసిత రైతు­లు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం వడ్డీ­తో సహా చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇదే పథకం వద్ద చంద్రబాబు హామీ ఇచ్చా­ర­ని, దానిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీయే తమను రోడ్డున పడేసిందన్నారు. పిల్లలకు వివాహాలు చేసినా వారి కాపురాల్లో కలహా­లు వస్తున్నాయని మహిళా రైతులు కంటతడి పెట్టారు.

భూముల పట్టా పుస్తకాలపై జగన్‌ ఫొటో వేస్తున్నాడని విమర్శించారని.. మరి తమ భూములు తీసుకుని చంద్రబాబు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీ­శారు. పురుషోత్తప­ట్నం, రామచంద్రపురం ప్రాంతానికి చెందిన బాధిత రైతులను బుజ్జ­గించేందుకు పోలీ­సులు చేసిన యత్నా­లు విఫల­మ­య్యాయి. భూములిచ్చి ఏళ్లు గడు­స్తు­న్నా తమకు న్యాయం జరగలేదని బా­ధిత రైతులు కలగర బాలకృష్ణ, పెండ్యా­ల పుల్లా­రావు, కోడేబత్తుల ప్రసాదరావు, దుద్దిపూడి శ్రీను, కొండిపాటి కోటేశ్వరరావు, కూచి­పూడి సుబ్రహ్మణ్యం, కలగర సుబ్బారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నమ్మబలికి అన్యాయం చేశారు..
ఎత్తిపోతల పథకం కోసం 2017లో దౌర్జ­న్యంగా భూములు తీసుకున్నారని, రూ.24 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు పరిహారం అందిస్తామని అప్పట్లో నమ్మబలికారని బాధి­త రైతులు పేర్కొన్నారు. 2013 భూసే­కరణ చట్టం ప్రకారం పరిహారం అందించా­ల­ని కోరగా రూ.17 లక్షలు రివార్డు ప్రకటించి తమకు అన్యాయం చేశారని నిర్వాసి­తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 ఎకరాలకు సంబంధించి సుమారు వందమంది రైతులు హైకోర్టును ఆశ్రయించగా ఆరు శాతం వడ్డీ­తో పరిహారం చెల్లించాలని కొద్ది నెలల క్రి­తం తీర్పు ఇచ్చినా తమకు అందించాల్సిన రూ.­30 కోట్లు ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.

45 రోజుల్లో అందిస్తామని హామీ
నిర్వాసిత రైతుల నిరసనతో కంగుతిన్న టీడీపీ ప్రజాప్రతినిధులు ఫోన్‌లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. 45 రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. లేదంటే తాము కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పా­రు. దీంతో బాధిత రైతులు నిరసన విరమించారు. అనంతరం ప్రజాప్రతి­నిధులు మాట్లాడుతూ పుష్కర ఎత్తిపో­తల పథకం నుంచి సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనలు గుప్పించారు. ఎన్జీటి నుంచి ఎటువంటి అనుమతులు లేని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేయడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement