సాక్షి, పాడేరు: గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ బియ్యం, ఇతర నిత్యావసరాలు అందుకున్న గిరిజన కుటుంబాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో సుమారు 3,200 గిరిజన గ్రామాలు ఉండగా, పౌరసరఫరాల శాఖ పరిధిలో కేవలం 430 డిపోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి చూస్తే, కొత్త డిపోల ఏర్పాటు అనేది గిరిజనులకు ఒక కలగానే మిగిలిపోయింది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా సుమారు 1,800 గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇంటికే సరకులు సకాలంలో అందేవి. మారుమూల ప్రాంతాల్లో కూడా సమీప గ్రామాలకు సరకులను చేరవేసి గిరిజనులకు ఎంతో మేలు జరిగేది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేయడంతో, గత ఏడాది జూన్ నుండి గిరిజనులు నిత్యావసరాల కోసం నరకయాతన అనుభవిస్తున్నారు.
డిపోల చుట్టూ కాళ్లరిగేలా..
ప్రస్తుతం గిరిజనులు రేషన్ సరుకులు పొందేందుకు పాత పద్ధతిలో కాళ్లు అరిగేలా డిపోల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి డిపో పరిధిలో రెండు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గిరిజన గ్రామాలు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలతో పాటు గిరిశిఖర గ్రామాలకు చెందిన రేషన్ కార్డుదారులు గంటల తరబడి నడిచి డిపోలకు చేరుకుంటున్నారు. అక్కడ గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి చూసి, అష్టకష్టాలు పడి సరుకులను మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మనిషికీ, లగేజీకీ కలిపి రూ. 50 నుంచి రూ. 100 వరకు అదనపు భారాన్ని మోస్తున్నారు.
కొత్త డిపోల ఊసే లేని కూటమి ప్రభుత్వం
జిల్లాలోని 11 మండలాల పరిధిలో 244 పంచాయతీలకుగాను 470 రేషన్ డిపోలు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రతి డిపో పరిధిలో 20 నుంచి 30 గ్రామాలు ఉండటం, అందులోనూ చాలా వరకు మారుమూల గ్రామాలే కావడంతో గిరిజనులు నడక కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొత్త రేషన్ డిపోల ఏర్పాటుపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు.
కలెక్టర్‌కు విన్నవించినా స్పందన శూన్యం
15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలమామిడి డిపో నుంచి బియ్యాన్ని గుర్రాల సాయంతో తరలిస్తున్నామని, తమకు దగ్గరలో డిపో ఏర్పాటు చేయాలని అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మాడ్రేబు గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ రేషన్ కార్డులను దగ్గరలోని దాయర్తి డిపోకు మ్యాపింగ్ చేస్తే 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, గత నెలలో కలెక్టర్ నిశాంతికి వినతిపత్రం అందజేశారు. అయినా, ఇప్పటివరకు తమ సమస్య పరిష్కారం కాలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు అండగా నిలిచిన రేషన్ పంపిణీ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం గిరిజన గ్రామాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. వాహనాల వ్యవస్థను రద్దు చేయడంతో, కిలోమీటర్ల మేర నడక, గుర్రాలపై సరకుల తరలింపుతో గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు.
రేషన్ సరకులు పొందేందుకు నరకం
బియ్యం కోసం గంటల తరబడి శ్రమ
గిరిశిఖర గ్రామాల్లో పడరాని పాట్లు
ఎండీయూ వాహనాల రద్దుతోకొనసాగుతున్న కష్టాలు
కిలోమీటర్ల కొద్దీ మోత
కామయ్యపేట గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరలోవ గ్రామానికి బియ్యాన్ని మోసుకువెళ్లేందుకు నరకం చూస్తున్నాం.కొత్త డిపో ఏర్పాటు చేసి న్యాయం చేయాలి.ని పక్షంలో వాహనాల ద్వారా గ్రామానికే నిత్యావసరాలను చేర్చేలా చర్యలు చేపట్టాలి.
– కిల్లో ఆనంద్, గిరిజన రైతు, కిన్నెరలోవ, హుకుంపేట మండలం
డీఆర్ డిపో ఏర్పాటు చేయాలి
ప్రతి నెలా15కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలమామిడి డిపో నుంచి బియ్యాన్ని గుర్రాలపై మాడ్రేబు గ్రామానికి తరలించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా తమకు డీఆర్ డిపోను అందుబాటులో తేవాలి. కనీసం దాయర్తి డిపోలో అయిన రేషన్‌కార్డులు విలీనం చేయాలి
– కొండతాంబలి నరసింగరావు,
మాడ్రేబు, అనంతగిరి మండలం


