ఇంటి నిర్మాణానికి ఇదో కొత్త ఐడియా! | Green Construction India Rice husk Sugarcane ash Homes Cement alternative | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్మాణానికి ఇదో కొత్త ఐడియా!

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:46 AM

Green Construction India Rice husk Sugarcane ash Homes Cement alternative

భవన నిర్మాణాలకు వరి పొట్టు, చెరకు పిప్పి వాడకం

భారత శాస్త్రవేత్తల ‘గ్రీన్‌’ ఐడియా

సాక్షి స్పెషల్‌ డెస్క్‌: వ్యవసాయ వ్యర్థాలతో ఇళ్లను పటిష్టంగా నిర్మించవచ్చని భారతీయ శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. పొలాల్లో మిగిలి పోయే వరి పొట్టు, చెరకు పిప్పిని కాల్చి తీసిన బూడిదతో సిమెంట్‌ వాడకాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతూ దృఢమైన ఇళ్లను నిర్మించవచ్చని తాజా పరిశోధనలో తేల్చారు.

పొట్టులో సిలికా పవర్‌... సిమెంట్‌కు ప్రత్యామ్నాయం!
వరి పొట్టు, చెరకు వ్యర్థాలను ఒక ప్రత్యేక థర్మో–కెమికల్‌ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. ఇలా చేసినప్పుడు వచ్చే బూడిదలో సిలికా అనే కెమికల్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ సిలికాకు సిమెంట్‌లా గట్టిపడే లక్షణం ఉంది. దీన్ని కాంక్రీట్‌లో కలపడం వల్ల సిమెంట్‌ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా అటు నిర్మాణ ఖర్చు, ఇటు పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వచ్చే వాయు కాలుష్యం రెండూ ఉండవు.

సిమెంట్‌లో ‘బూడిద’ మిక్సింగ్‌ 
కాంక్రీట్‌ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు 100 శాతం సిమెంట్‌ను వాడాల్సిన అవసరం లేదు. అందులో 10 నుంచి 20 శాతం వరకు సిమెంట్‌ను తగ్గించి ఆ స్థానంలో వ్యవసాయ బూడిదను కలుపుతారు. దీనివల్ల సిమెంట్‌ తగ్గినా కాంక్రీట్‌ బలానికి ఎలాంటి ఢోకా ఉండదు. పైగా ఇది భవనాలను మరింత మన్నికైనవిగా, గట్టిగా మారుస్తుంది.

గ్లోబల్‌ వార్మింగ్‌కు చెక్‌
సాధారణంగా ఒక టన్ను సిమెంట్‌ తయారీకి దాదాపు ఒక టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణమవుతోంది. కానీ సరికొత్త ‘గ్రీన్‌ కాంక్రీట్‌’ టెక్నాలజీ వల్ల సిమెంట్‌ ఉత్పత్తి అవసరం తగ్గుతుంది. ఫలితంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement