TG REAT సభ్యులుగా వేముల శ్రీకర్ | Vemula Srikar Takes Charge as TG REAT Member | Sakshi
Sakshi News home page

తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ సభ్యులుగా వేముల శ్రీకర్

Jun 27 2026 7:20 PM | Updated on Jun 27 2026 7:52 PM

Vemula Srikar Takes Charge as TG REAT Member

తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ (TG-REAT) సాంకేతిక, పరిపాలనా సభ్యుడిగా IRS మాజీ అధికారి వేముల శ్రీకర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం-2016 నిబంధనల మేరకు చేపట్టిన ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జారీ చేసింది.

1995 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్రీకర్‌ సుమారు 26 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఇంజినీరింగ్‌ డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంఏతో పాటు న్యాయశాస్త్రంలో (ఎల్‌ఎల్‌బీ) ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ట్రిబ్యునల్ కార్యకలాపాల్లో చట్టపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉండటంతో ఆయన న్యాయ విద్య, అప్పిలేట్‌ వ్యవహారాల్లోని అనుభవం ఉపయోగపడనుంది.

పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన శ్రీకర్‌ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదాయ సమీకరణ, దర్యాప్తు రంగాల్లో విశిష్ట సేవలకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి రెండు ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన పర్యవేక్షించిన కీలక దర్యాప్తు కేసులు ఆదాయపు పన్ను శాఖ ప్రచురించిన ‘లెట్‌ అస్‌ షేర్‌’ ఉత్తమ విధానాల సంకలనంలో చోటు దక్కించుకున్నాయి.

హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ టవర్స్‌ నిర్మాణం, బంజారాహిల్స్‌లో ఆదాయపు పన్ను శాఖ నివాస సముదాయాల అభివృద్ధి, తిరుపతిలో అతిథి గృహం ఏర్పాటు, నాగ్‌పూర్‌లో సిబ్బంది నివాస గృహాల నిర్మాణం వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. శాఖ ఆధునీకరణ, డిజిటల్‌ వ్యవస్థల అమలు, కంప్యూటరీకరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

ముంబయిలో ఆదాయపు పన్ను కమిషనర్‌గా పనిచేసిన ఆయన 2021లో పదవీ విరమణ పొందారు. అనంతరం సామాజిక సేవ, సాహిత్య రంగాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు దశాబ్దాలుగా కృషి చేసిన ప్రముఖ సాహితీవేత్త వేముల పెరుమాళ్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం ‘తెలంగాణ జాతీయాలు’ ప్రచురణలో శ్రీకర్‌ విశేష సహకారం అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement