వియత్నాం బోటు ప్రమాదం.. 15 మృతదేహాల రాకకు ఏర్పాట్లు
ప్రమాదం నుంచి బయట పడిన 16 మంది భారత్‌కు
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు నేడు (సోమవారం) భారత్‌కు రానున్నాయి. అనంతరం ఆయా మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం హోచిమిన్ సిటీలో అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే వాటిని భారత్‌కు పంపించనున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఒక కంపెనీకి చెందిన భారతీయ డీలర్లు శనివారం క్వోక్ ద్వీపానికి విహార యాత్రకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో 32 మంది నలుగురు స్థానిక సిబ్బందితో కలిసి బోట్‌లో ప్రయాణిస్తుండగా, అది బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలు చెన్నై, కొచి్చన్, విజయవాడ ఎయిర్ పోర్టులకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతులకు సంబంధించి.. సంబంధిత జిల్లా కలెక్టర్లు మృతదేహాలను స్వీకరించే కుటుంబ సభ్యుల వివరాలను కేంద్రానికి అందజేశారు.
నల్లపేట ఆదిశేషయ్య రవి తేజ మృతదేహాన్ని బెంగళూరుకు, గెల్లి జయలక్ష్మి మృతదేహాన్ని విజయవాడకు, ముడియం శ్రీధర్ మృతదేహాన్ని చెన్నైకి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాదం నుంచి బయట పడిన 17 మంది భారతీయుల్లో 16 మంది చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి స్వదేశానికి బయలుదేరారు.
గుండెపోటుకు గురైన గెల్లి కిషోర్
బోటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిసింది. ఆయనకు మెదడులో రక్తం గడ్డ (బ్లడ్ క్లాట్) ఉన్నట్లు గుర్తించారు. భార్య మరణ వార్త వినగానే ఆయన గుండె పోటుకు గురైనట్లు సమాచారం. కాగా, భారీ అలతో ఒక్కసారిగా బోటు తిరగబడటం వల్లే ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రమాదాన్ని గమనించిన రక్షణ బృందాలు వెంటనే స్పందించడంతో 21 మందిని రక్షించగలిగాయి. మిగతా 15 మంది ఊపిరాడక నీళ్లు మింగడం వల్లే మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.


