పొల్లాచ్చిలో ‘వుయ్ ద లీడర్’ ఫౌండేషన్ తొలి మహానాడులో అన్నామలై సంచలన వ్యాఖ్య
సాక్షి చెన్నై: ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వుయ్ ది లీడర్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.అన్నామలై చెప్పారు. ఆదివారం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఫౌండేషన్ మొదటి మహానాడులో ఆయన ప్రసంగించారు. ‘‘నేను హిందువును, కానీ బయటకు వెళ్లేటప్పుడు నా కులం, మతాలను ఇంట్లోనే ఉంచి తాళం వేస్తాను. ప్రతిసారీ మతాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు.
నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడు. అందరూ ఒకే సరళరేఖలో కలిసి సాగాలని భావిస్తాడు. అదే నా హిందూ తత్వం’’అని తేల్చిచెప్పారు. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్నామలై స్పందించారు. 39 ఏళ్లలోపు వయసున్నవారే అధికార మార్పునకు కారణమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో 2031లో మరోసారి కచ్చితంగా అధికార మారి్పడి జరుగుతుందని స్పష్టంచేశారు.
2031లో తమ పార్టీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో యువత మరోసారి కచ్చితంగా మార్పును తీసుకొస్తుందని వెల్లడించారు. 2031 నాటికి తమ ఉద్యమం పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు. తాము ఆరోగ్యకరమైన రాజకీయాల కోసమే కృషి చేస్తాం తప్ప క్షుద్ర రాజకీయాల కోసం కాదన్నారు. ‘వుయ్ ది లీడర్స్’ఉద్యమంలో 19 లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు.
వీరిలో 54 శాతం మంది 39 ఏళ్ల లోపు యువతే కావడం గమనార్హం. ప్రస్తుత సభ్యుల్లో 83 శాతం మంది పురుషులు, 17 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళా భాగస్వామ్యాన్ని త్వరలోనే 50 శాతానికి పెంచడమే లక్ష్యమని అన్నామలై ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం జూలై నెలను మాదకద్రవ్యాల వ్యతిరేక మాసంగా పాటించాలని, డ్రగ్స్ రహిత తమిళనాడును నిర్మించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి విజయ్ పాలనపై అన్నామలై సానుకూలంగా స్పందించారు. కోటి 68 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. ఆ ప్రజా తీర్పును మనం గౌరవించాలన్నారు. మంత్రులు చాలామంది కొత్తవారే కాబట్టి ప్రారంభంలో వారు కొంత తడబడటం సహజమని చెప్పారు. టీవీకే ప్రభుత్వంపై ఒక సంవత్సరం ఎలాంటి విమర్శలు చేయబోమని అన్నారు. తాము అధికారం కోసం ప్రజాక్షేత్రంలోకి రాలేదని, ఒక మంచి సమాజాన్ని నిర్మించడమే ఏకైక లక్ష్యమని వివరించారు.


