బోల్సోనారో గృహ నిర్బంధం పొడిగింపు | Brazilian court upholds house arrest for former president Bolsonaro | Sakshi
Sakshi News home page

బోల్సోనారో గృహ నిర్బంధం పొడిగింపు

Jul 4 2026 7:45 AM | Updated on Jul 4 2026 8:52 AM

Brazilian court upholds house arrest for former president Bolsonaro

బ్రాసిలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (71) గృహ నిర్బంధాన్ని పొడిగిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గత 2022 అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అధికారంలోనే కొనసాగేందుకు తిరుగుబాటు (కూప్) కుట్రకు పాల్పడినందుకు బోల్సోనారోకు గత సెప్టెంబర్‌లో 27 ఏళ్ల జైలు శిక్ష పడింది.

అయితే బ్రోంకోన్యుమోనియా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఆయనను, మానవతా దృక్పథంతో ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా 90 రోజుల పాటు జైలు నుండి గృహ నిర్బంధానికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగైనప్పటికీ, వయసు, ఇతర ఆరోగ్య సమస్యల (కోమోర్బిడిటీస్) రీత్యా ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు గృహ వాతావరణమే అత్యంత అనువైనదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  గృహ నిర్బంధాన్ని కొనసాగించడం సమంజసమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని సమీక్షించడానికి ఎలాంటి కొత్త గడువును కోర్టు విధించలేదు.

మరోవైపు, గత నెలలో జరిగిన సాధారణ వాహన తనిఖీల్లో బోల్సోనారో భద్రతా సిబ్బంది ఒకరి వద్ద మాజీ అధ్యక్షుడి పేరిట నమోదైన పిస్టల్ లభ్యమైంది. దీనిపై న్యాయమూర్తి మోరెస్ స్పందిస్తూ.. బోల్సోనారోపై ఇకపై ఇంట్లో ఎలాంటి ఆయుధాలను ఉంచుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఆయన పేరిట ఉన్న ఆయుధాలను తక్షణమే జప్తు చేయాలని ఆదేశించారు. అధికారిక రికార్డుల ప్రకారం బోల్సోనారో పేరిట పిస్టళ్లు, రైఫిళ్లు, షాట్‌గన్‌లతో కలిపి మొత్తం 10 ఆయుధాలు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లూలా నాలుగోసారి (వరుసగా కాకుండా) పదవి కోసం పోటీ పడుతుండగా, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా బోల్సోనారో పెద్ద కుమారుడు, సెనేటర్ అయిన ఫ్లావియో బోల్సోనారో బరిలో నిలిచారు.

ఇది కూడా చదవండి: ‘రిట్జర్’ కాస్తా ‘పుట్జర్’.. ‘నెట్’ పేపర్‌పై ఫైర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement