breaking news
Champat Rai
-
విరాళాల చోరీపై మోదీ మౌనమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంలో ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కుంభకోణంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధంగానే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ వ్యవహారాన్ని నడిపించాయన్నారు. ప్రతి చిన్న అంశానికీ అది తమ గొప్పతనమేనంటూ చెప్పుకునే ప్రధాని మోదీ, నిధుల గోల్‌మాల్‌పై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రోజుకు లక్షలాది రూపాయల విరాళాలు మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలోనే స్పష్టమైందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నప్పటికీ, భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయనే వాస్తవాన్ని సిట్ అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. దేవుడి సొమ్ము లూటీ వ్యవహారం కేవలం కొద్దిమంది కిందిస్థాయి ఉద్యోగులకే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఆరోపించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు ఇతర కీలక ట్రస్టీలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లోతైన రహస్యాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు అధికారికంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సిట్ విచారణలు, కొందరి రాజీనామాలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలేనని స్పష్టం చేశారు. చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని, పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్‌చేశారు.ఆప్ సంతకాల ఉద్యమం న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయంలో విరాళాల చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దేశవ్యాప్త సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న జపనీస్ పార్క్‌లో సుందరకాండ పారాయణ కార్యక్రమం చేపట్టారు. హనుమాన్ ఆశీస్సులతో ప్రారంభించిన ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, చందాల చోరీకి బాధ్యులైన వారిని శిక్షించాలంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలపై సంతకాలు చేయాలని ప్రజలను కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇతరులు సైతం ఇలాంటి లేఖలనే ప్రధాని మోదీకి రాసేలా ప్రోత్సహించాలన్నారు. రామాలయంలో చోరీకి బాధ్యులపై చర్యలను కోరుతూ తమ నివాసాలతోపాటు తమ ప్రాంతంలోని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠించాలని, హనుమాన్ హారతి నిర్వహించాలని సూచించారు. కేవలం ఆప్ కార్యకర్తలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరగాలన్నారు. -
అయోధ్య కుంభకోణం.. వీహెచ్‌పీ కీలక వ్యాఖ్యలు
అయోధ్య రామ మందిరంలో వెలుగుచూసిన విరాళాల కుంభకోణం.. మరిన్ని చీకటి విషయాలను వెలుగులోకి తెస్తోంది. భక్తులు సమర్పించే కానుకలు సైతం మాయం చేశారని.. అలాగే గోల్మాల్ జరిగిందన్న విషయం ట్రస్ట్ పెద్దలకు ముందే తెలుసని సిట్ దర్యాప్తు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) స్పందించింది.అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన డొనేషన్ల దుర్వినియోగం ఆరోపణలతో.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరు మసకబారిపోయింది. భక్తులు సమర్పించిన విరాళాలు ఒక ప్లాన్ ప్రకారం దారి మళ్లించబడ్డాయని వచ్చిన ఆరోపణలతో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో ట్రస్ట్‌లో కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.రామ్ జన్మభూమి ఉద్యమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లాయి. అక్కడితోనే మా పాత్ర ముగిసింది. మందిర నిర్మాణం వరకే మా పాత్ర పరిమితమైంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు ట్రస్ట్ బాధ్యతేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే.. చంపత్ రాయ్ వ్యవహారాన్ని వీహెచ్‌పీతో అంటగట్టవద్దని ఆలక్ పరోక్షంగా సూచించారు. ట్రస్ట్‌లో జరిగే నిర్ణయాలకు సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేస్తూ, వ్యక్తిగతంగా ఎవరు చేసిన చర్యలకైనా ట్రస్ట్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.చంపత్ రాయ్ గతంలో విశ్వ హిందూ పరిషత్‌లో సుదీర్ఘంగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే అనుభవంతో తరువాత శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. చంపత్తో పాటు మరికొందరు వీహెచ్‌పీ అనుబంధ నేతలు కూడా ట్రస్ట్ సభ్యులుగా పని చేశారు. అయితే విరాళాల గోల్మాల్ వ్యహారం బయటకు రావడం.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి, సిట్ ప్రాథమిక నివేదిక నేపథ్యంలో చంపత్‌రాయ్ జూన్ 27న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆలయ సిబ్బంది సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఆధారాల ప్రకారం సుమారు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల దుర్వినియోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరెవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.అయితే ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత అది స్వతంత్ర సంస్థగా పనిచేస్తుందని వీహెచ్‌పీ ఇలా ప్రకటించడం కొత్తేం కాదు. తాజాగా వచ్చిన వివాదాల నేపథ్యంలో అదే స్టాండ్‌ను మరోసారి బలంగా పునరుద్ఘాటించింది.రామ్ మందిర ఉద్యమం, జనజాగరణ, భూమి పోరాటం వంటి దశల్లో వీహెచ్‌పీ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లాయి. అందుకే ప్రస్తుతం ఆలయ ఆర్థిక వ్యవహారాలు, విరాళాలు, నిర్వహణలో తమకేం ప్రత్యక్ష పాత్ర లేదని సంస్థ స్పష్టం చేస్తోంది.ఇక ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగిస్తోంది. డొనేషన్ నిధుల వినియోగం, బ్యాంక్ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్, నగదు ప్రవాహం అన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల నమ్మకంతో నిర్మితమైన రామ్ మందిరం చుట్టూ వచ్చిన ఈ వివాదం ఇప్పుడు వీహెచ్‌పీ స్టేట్మెంట్ తర్వాత.. సంస్థాగత బాధ్యతలపైనా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. చంపత్‌రాయ్‌పై ప్రశ్నల వర్షం.. రామ్ మందిరం డొనేషన్ కుంభకోణం దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మాజీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ను రెండు గంటలకు పైగా విచారించింది. భక్తుల విరాళాల సేకరణ, నగదు లెక్కింపు, విలువైన కానుకల భద్రపరిచడం, వాటిని బ్యాంకుల్లో జమ చేసే విధానం వరకు ప్రతి అంశంపై అధికారులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. అయితే డొనేషన్ దుర్వినియోగంలో తనకు ఎలాంటి పాత్ర లేదని చంపత్‌రాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారని, విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడం తన బాధ్యతేనని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. -
ఆలయ ట్రస్ట్‌కు ముందే తెలుసా?
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల అక్రమాలపై మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఈ వివాదం వెలుగులోకి రాకమునుపే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నిధుల్లో అవకతవకలు జరిగిన విషయం ట్రస్ట్వర్గాలకు తెలుసు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు పోలీసులను నిందితుడు అవినాశ్ ఇంటికి పంపించి నగదు బ్యాగును తెప్పించినట్లు తాజా వీడియోతో బహిర్గతమైంది. ఈ నగదు స్వాధీనంనాటికి ఇంకా పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా నమోదుకాలేదు. జూన్ 5న అవినాశ్ నివాసంలో సోదాలు అనధికారికంగా చేపట్టినట్లు తెలుస్తోంది. విరాళాలు పక్కదారి పట్టిన అంశం జూన్ 7వ తేదీన మాత్రమే బహిర్గతమైంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రామ మందిరానికి అందిన కోట్లాది విరాళాలు పక్కదారి పట్టాయని సంచలన ప్రకటన చేయడం తెల్సిందే. అంతకుముందే, పోలీసులు శుక్లాను కస్టడీలోకి తీసుకోవడంతోపాటు అతడు నోట్ల కట్టలున్న ఓ పెద్ద బ్యాగును మోసుకెళ్తున్నట్లుగా ఉన్న 24 సెకన్ల వీడియో ఒకటి తాజాగా బహిర్గతమైంది. సోదాలు జరిపిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపైనా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ నిఘా, విరాళాలను స్వీకరించే ఉద్యోగుల ఎంపిక, నగదు నిల్వ విధానాల్లో తీవ్ర లోపాలున్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిందని, అందులోని సిబ్బంది అంతా ట్రస్ట్ ఉద్యోగులకు సంబంధించిన వారేనని చెబుతు న్నారు. ఆలయ ట్రస్ట్ జరిపిన భూమి కొనుగోళ్లు, ఆలయ నిర్మాణ టెండర్ల ఖరారు పైనా సిట్ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు దర్యాప్తు నివేదికలను సీఎం యోగికి అందజేస్తోంది.నిందితుల ఇళ్లపై దాడులువిరాళాలను చోరీ చేసిన ఆరోపణలపై అరెస్టయిన 8 మంది నిందితుల నివాసాలపై అయోధ్య పోలీసు బృందాలు ఆదివారం ఏకకాలంలో దాడులు చేపట్టాయి. అయోధ్య కోర్టు నిందితులందరినీ సోమవారం వరకు రిమాండ్‌కు పంపించడం తెల్సిందే. ఆదివారం తనిఖీల సందర్భంగా నిందితుడు మనీశ్ యాదవ్ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో, అధికారులు కుటుంబసభ్యులతో తాళం తీయించి, సోదాలు చేపట్టారు. రామశంకర్ అలియాస్ టిన్ను యాదవ్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. అతడి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. చుట్టుపక్కల వారి నుంచి అతడి ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 79.85 లక్షల నగదు దొరికినట్లు అధికారులు చెప్పారు.స్కార్పియో, ఫామ్‌హౌస్..అయోధ్య విరాళాల చోరీ కేసులో అరెస్టయి న వారిలో అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవ్‌కుశ్ మిశ్రా కీలకంగా ఉన్నారు. మూడేళ్ల క్రితం బ్యాంక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన అనుకల్ప్ మిశ్రా దాతల విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే బృందంలో చేరాడు. ఆ తర్వాత అధికారుల సాయంతో తన బావ లవ్కుశ్ను అదే పనిలో చేర్పించాడు. ఇద్దరూ కలిసి సొత్తును దారి మళ్లించే పనిలో బిజీ అయి పోయారు. అయోధ్యలోని అనుకల్ప్ సొంత గ్రామానికి వెళ్లిన సిట్ట అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలిశా యి. అనుకల్ప్ కొత్తగా పేద్ద ఇల్లు, భూమి, ఖరీదైన వాహనం, ఫామ్‌హౌస్ కొనుగోలు చేసినట్లు తేలింది. లవ్‌కుశ్ మిశ్రా ఖరీదైన బైక్ కొన్నాడు. అనుకల్ప్ మిశ్రా గ్రామంలో ఇటీవల వారం పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించాడు. అందులో భా గంగా మతపెద్దలను రప్పించి, ఉపన్యా సాలు ఇప్పించాడు. కార్యక్రమానికి అయో ధ్య ఆలయ ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా?
న్యూఢిల్లీ: అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్‌తోపాటు మరో సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం రాజీనామా చేసినట్లు తెలిసింది. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వెల్లడించింది. రాజీనామాపై సంప్రదించడానికి ప్రయత్నించగా, వారిద్దరూ అందుబాటులోకి రాలేదు. నిందితుల్లో ఒకడైన రామ్‌శంకర్ యాదవ్ గతంలో చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని అధికారులు చెప్పారు. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదును ఆలయ ఖజానాకు చేర్చకుండా మాయం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదుతో పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. నిందితులు రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, సుభాష్‌చంద్ర శ్రీవాస్తవ, రామశంకర్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్‌ను ‘సిట్’అధికారులు అరెస్టు చేశారు. ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్‌కి అత్యంత సన్నిహితుడైన ఆయన డ్రైవర్ రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. నిందితులపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), అవినీతి నిరోధక చట్టం నిబంధనల ప్రకారం... దొంగతనం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, చోరీసొత్తు దాచడం, నేరపూరిత కుట్ర, ఉమ్మడి ఉద్దేశంతో నేరాలకు పాల్పడడం వంటి అభియోగాలు నమోదు చేశారు. విరాళాలుగా వచ్చిన నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో వీరు పాల్గొనేవారని తెలిపారు. వీరిలో సుభాష్ చంద్ర శ్రీవాస్తవ మిగిలిన వారికి ఇన్చార్జ్గా వ్యవహరించేవారని చెప్పారు. పోలీసు కస్టడీకి నిందితులు 8 మంది నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 29 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా రూ.79.85 లక్షలు స్వా«దీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కె.సి.వర్మ చెప్పారు. అరెస్టయిన వారిలో ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగులని, ఆలయంలో స్వీకరించిన నగదు విరాళాలను లెక్కించే పని కోసం వారిని నియమించారని, వారు బ్యాంకు నుంచి జీతాలు పొందుతున్నారని తెలిపారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దు: యోగి సనాతన విలువలకు, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం హెచ్చరించారు. అయోధ్య ఆలయ గౌరవాన్ని కాపాడటమే తమ కర్తవ్యమని చెప్పారు. ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు పని గట్టుకుని రామభక్తులే లక్ష్యంగా, అయోధ్య ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై సిట్ నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభించామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని అన్నారు. రామజన్మభూమి ఉద్యమానికి, రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు నేడు భక్తుల విశ్వాసాలపై నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. రామాలయంపై దిష్టి పెట్టొద్దని, రాముడి మర్యాదను కాపాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. రూ. కోటికి రసీదు అందలేదు: రౌత్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు శివసేన(ఉద్ధవ్) తరఫున ఇచ్చిన రూ.కోటి విరాళానికి ఇప్పటివరకూ రసీదు అందలేదని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శుక్రవారం ఆరోపించారు. పార్టీ ఇచ్చిన వెండి ఇటుకకు కూడా రసీదు అందలేదన్నారు. విరాళాల చోరీ సొమ్ముతోనే ఎంపీలు, ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. పెద్దలను కాపాడుతున్నారు: కేజ్రీవాల్ రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో పెద్దవాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విరాళాల చోరీతో మహా పాపానికి ఒడిగట్టిన వారికి భగవంతుడు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని వేడుకున్నట్లు తెలిపారు. అయోధ్య పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఒక బూటకమని మండిపడ్డారు. ఇదీ నేపథ్యం అయోధ్య రామాలయానికి అందుతున్న విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఈ నెల 7న మొట్టమొదటిసారి బయటకు వచ్చింది. శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వినతి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 13న ‘సిట్’ ఏర్పాటు చేసింది. ‘సిట్’ 23న ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 25న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ‘సిట్’సిఫారసుల మేరకు పోలీసులు నిందితులను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. తాము అయోధ్య రామాలయ నిర్మాణానికి 200 వెండి ఇటుకలు సమర్పించామని, అందుకు తగిన రసీదులు అందలేదని, ఈ వెండిని ఏ అవసరం కోసం వినియోగించారో తెలపాలని సింధీ సామాజిక వర్గానికి చెందిన సంస్థ ప్రశ్నించింది. -
రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం
అయోధ్య: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు, ఈ నెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షతల ప్యాకెట్‌పై రామాలయం చిత్రంతోపాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షతలు అందుతాయని చెప్పారు. -
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్ గాజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు. -
రామాలయం 40 శాతం పూర్తి
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు 40 శాతం దాకా పూర్తయ్యాయి. వాటికి రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తెలిసిందే. 2023 డిసెంబర్‌కల్లా పనులన్నీ పూర్తయి భక్తుల దర్శనానికి మందిరం సిద్ధమవుతుందని రామజన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఆదివారం తెలిపారు. మందిరం కనీసం వెయ్యేళ్లదాకా చెక్కుచెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా, భారీగా నిర్మిస్తున్నారు. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్ అడుగుల మక్రానా మార్బుల్ రాళ్లు వాడుతున్నారు. ప్రధానాలయ నిర్మాణంలో గులాబీ, గర్భాలయానికి, ఫ్లోరింగ్‌కు తెల్ల రాయి వాడుతున్నారు. మందిరానికి దారితీసే మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. -
రామ మందిరం ట్రస్టు అధ్యక్షుడిగా నృత్యగోపాల్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్టుకి అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్ దాస్ ఎన్నికయ్యారు. చంపాత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ రామ మందిర ట్రస్టు బుధవారం లాయర్ కె.పరాశరన్ నివాసంలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రాను మందిర నిర్మాణ కమిటీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం చంపాత్ రాయ్ మాట్లాడుతూ.. మందిర నిర్మాణానికి భక్తులు ఇచ్చే విరాళాల కోసం అయోధ్య ఎస్బీఐలో ఖాతా తెరుస్తామన్నారు. పుణెకి చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరిని కోశాధికారిగా నియమించినట్టు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా హోంశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ ప్రతినిధిగా అవినాశ్ అవస్తి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ జస్టిస్ అనూజ్‌కుమార్ ఝా హాజరయ్యారు. -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్‌తో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్‌ను నేను కోరుతున్నా’ అని గోపాల్‌దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్‌పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్‌గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్‌దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్‌పీ కార్యకర్తలు -
మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం
న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. గుర్గావ్ లోని మెదాంత మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ సింఘాల్‌ను ఈ రోజు ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాలిని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గత రాత్రి అశోక్ సింఘాల్ శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన్ని మెదాంత ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. గతనెల్లో నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరంలో హువాన్ పూజ జరుపుతున్న సయమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఏయిర్ అంబులెన్‌లో గుర్గావ్లోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.


