అయోధ్య రామ మందిరంలో వెలుగుచూసిన విరాళాల కుంభకోణం.. మరిన్ని చీకటి విషయాలను వెలుగులోకి తెస్తోంది. భక్తులు సమర్పించే కానుకలు సైతం మాయం చేశారని.. అలాగే గోల్‌మాల్ జరిగిందన్న విషయం ట్రస్ట్ పెద్దలకు ముందే తెలుసని సిట్ దర్యాప్తు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) స్పందించింది.
అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన డొనేషన్ల దుర్వినియోగం ఆరోపణలతో.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరు మసకబారిపోయింది. భక్తులు సమర్పించిన విరాళాలు ఒక ప్లాన్ ప్రకారం దారి మళ్లించబడ్డాయని వచ్చిన ఆరోపణలతో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో ట్రస్ట్‌లో కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రామ్ జన్మభూమి ఉద్యమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లాయి. అక్కడితోనే మా పాత్ర ముగిసింది. మందిర నిర్మాణం వరకే మా పాత్ర పరిమితమైంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు ట్రస్ట్ బాధ్యతేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే.. చంపత్ రాయ్ వ్యవహారాన్ని వీహెచ్‌పీతో అంటగట్టవద్దని ఆలక్ పరోక్షంగా సూచించారు. ట్రస్ట్‌లో జరిగే నిర్ణయాలకు సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేస్తూ, వ్యక్తిగతంగా ఎవరు చేసిన చర్యలకైనా ట్రస్ట్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

చంపత్ రాయ్ గతంలో విశ్వ హిందూ పరిషత్‌లో సుదీర్ఘంగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే అనుభవంతో తరువాత శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. చంపత్‌తో పాటు మరికొందరు వీహెచ్‌పీ అనుబంధ నేతలు కూడా ట్రస్ట్ సభ్యులుగా పని చేశారు.
అయితే విరాళాల గోల్‌మాల్ వ్యహారం బయటకు రావడం.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి, సిట్ ప్రాథమిక నివేదిక నేపథ్యంలో చంపత్‌రాయ్ జూన్ 27న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆలయ సిబ్బంది సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఆధారాల ప్రకారం సుమారు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల దుర్వినియోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరెవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
అయితే ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత అది స్వతంత్ర సంస్థగా పనిచేస్తుందని వీహెచ్‌పీ ఇలా ప్రకటించడం కొత్తేం కాదు. తాజాగా వచ్చిన వివాదాల నేపథ్యంలో అదే స్టాండ్‌ను మరోసారి బలంగా పునరుద్ఘాటించింది.
రామ్ మందిర ఉద్యమం, జనజాగరణ, భూమి పోరాటం వంటి దశల్లో వీహెచ్‌పీ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లాయి. అందుకే ప్రస్తుతం ఆలయ ఆర్థిక వ్యవహారాలు, విరాళాలు, నిర్వహణలో తమకేం ప్రత్యక్ష పాత్ర లేదని సంస్థ స్పష్టం చేస్తోంది.
ఇక ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగిస్తోంది. డొనేషన్ నిధుల వినియోగం, బ్యాంక్ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్, నగదు ప్రవాహం అన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల నమ్మకంతో నిర్మితమైన రామ్ మందిరం చుట్టూ వచ్చిన ఈ వివాదం ఇప్పుడు వీహెచ్‌పీ స్టేట్‌మెంట్ తర్వాత.. సంస్థాగత బాధ్యతలపైనా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది.

చంపత్‌రాయ్‌పై ప్రశ్నల వర్షం..
రామ్ మందిరం డొనేషన్ కుంభకోణం దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మాజీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్‌ను రెండు గంటలకు పైగా విచారించింది. భక్తుల విరాళాల సేకరణ, నగదు లెక్కింపు, విలువైన కానుకల భద్రపరిచడం, వాటిని బ్యాంకుల్లో జమ చేసే విధానం వరకు ప్రతి అంశంపై అధికారులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. అయితే డొనేషన్ దుర్వినియోగంలో తనకు ఎలాంటి పాత్ర లేదని చంపత్‌రాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారని, విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడం తన బాధ్యతేనని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.


