breaking news
Ayodhya Scam
-
రీల్స్ రచ్చ.. యోగి సర్కార్‌కు అగ్నిపరీక్ష!?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతున్నారు. 2017లో తొలిసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. 2022లోనూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని యోగి నాయకత్వానికి ప్రజా మద్దతు ఉందని నిరూపించింది. ఇప్పుడు 2027లోనూ అదే విజయ పరంపర కొనసాగించాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఎన్నికల ముంగిట సోషల్ మీడియా ప్రచారాలు కొత్త రాజకీయ చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.రామ మందిరం.. అయోధ్య.. హిందుత్వం.. ఇవన్నీ బీజేపీ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంశాలు. అలాంటి అయోధ్యలోనే భక్తులు ఇచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ వివాదం.. ఇప్పుడు రీల్స్, వీడియోల రూపంలో గ్రామీణ ప్రాంతాలకూ చేరుతోంది.అయితే ఈ చర్చ యోగి ప్రభుత్వంపై నేరుగా ప్రభావం చూపుతుందా? లేదంటే ఇది కేవలం ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశంగానే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఆసక్తికర ప్రశ్నగా మారింది.భక్తి అంశం.. రాజకీయ అస్త్రంగా మారుతుందా?అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు అందించారు. ప్రతి రూపాయి వెనుక భక్తి భావన ఉందని చాలామంది భావించారు. అలాంటి విరాళాల విషయంలో ఆరోపణలు రావడంతో కొందరు భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. “భక్తితో ఇచ్చిన డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి” అనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశంగానే చూస్తున్నారు. దీనికి నేరుగా యోగి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చూడటం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు మాత్రం రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ.. ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చూస్తోంది.మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయంఅయోధ్య అంశంతో పాటు ఉత్తరప్రదేశ్‌లో మరోసారి చర్చకు వచ్చిన విషయం ఉన్నావ్ అత్యాచార కేసు. 2017లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే ఇటీవల ఆయనకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, బెయిల్ ప్రయత్నాలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపాయి. మహిళా భద్రత, న్యాయ వ్యవస్థ, అధికార పార్టీ వైఖరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఈ అంశంపై వస్తున్న రీల్స్.. ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించిన ప్రశ్నలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని యోగి ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ మాత్రం చట్టం తన పని చేసిందని, కోర్టు ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర ఉండదని చెబుతోంది.కుంభమేళ విషాదం కూడా..ఉత్తరప్రదేశ్‌లో మరో కీలక అంశం మహా కుంభమేళ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదం. కోట్లాది మంది భక్తులు పాల్గొన్న ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు, ప్రత్యక్ష దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రశ్నలు వచ్చాయి.అయితే మరోవైపు ఇంత భారీ జన సమూహాన్ని నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని, ఇలాంటి ఘటనలను రాజకీయ కోణంలో మాత్రమే చూడకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ఇలాంటి ఘటనలు సహజంగానే రాజకీయ చర్చలకు దారితీస్తాయి.రీల్స్ యుగంలో మారుతున్న రాజకీయాలుఒకప్పుడు రాజకీయ ప్రచారం సభలు, పత్రికలు, టీవీ చర్చలకే పరిమితమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 30 సెకన్ల వీడియో.. ఒక వైరల్ రీల్.. లక్షల మందికి చేరే శక్తిని కలిగి ఉంది. ప్రభుత్వ విజయాలను చూపించే రీల్స్ ఎంత వేగంగా వ్యాపిస్తాయో.. సమస్యలను చూపించే వీడియోలు కూడా అంతే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.యోగి ప్రభుత్వం రోడ్లు, మౌలిక వసతులు, శాంతిభద్రతలు, పెట్టుబడులపై తన విజయాలను ప్రచారం చేస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, మహిళా భద్రత వంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాయి.ఓటరు నిర్ణయాన్ని రీల్స్ మార్చగలవా?అయితే కేవలం సోషల్ మీడియా ప్రచారాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా? అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది. ఉత్తరప్రదేశ్ వంటి భారీ రాష్ట్రంలో కుల సమీకరణాలు, స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నాయకత్వంపై నమ్మకం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వీడియోతో ఓటరు అభిప్రాయం పూర్తిగా మారిపోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అదే సమయంలో.. ఒక అంశాన్ని నిరంతరం ప్రజల చర్చలో ఉంచే శక్తి సోషల్ మీడియాకు ఉందని అంగీకరిస్తున్నారు.హ్యాట్రిక్ లక్ష్యానికి ముందు సో.మీ. పరీక్షయోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2027 ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న వేళ.. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల భావోద్వేగ అంశాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయోధ్య విరాళాల వివాదం, ఉన్నావ్ కేసు, కుంభమేళ ఘటన వంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు యోగి ప్రభుత్వానికి రాజకీయ నష్టంగా మారాయని చెప్పలేం. కానీ ఎన్నికల వరకు ఈ అంశాలు ఎలా ప్రయాణిస్తాయి? ప్రజల మనసుల్లో ఎలాంటి ముద్ర వేస్తాయి? అన్నదే అసలు పరీక్ష. -
ఒక్క క్షణంలో ఖాతా ఖాళీ..!అసలేం జరిగింది..?
-
అయోధ్య స్కాం.. ట్రస్ట్ నగదు నిల్వలపై స్పెషల్ ఫోకస్
లక్నో: అయోధ్య ఆలయ ట్రస్ట్ విరాళాల కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలు, విరాళాల లెక్కింపు విధానం, నిర్మాణ పనుల వ్యయంపై సమగ్ర ఆడిట్‌కు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే, సిట్ అధికారులు గత ఐదేళ్ల ఖాతాలపై రీ-ఆడిట్ చేయనున్నారు.వివరాల ప్రకారం.. అయోధ్య ట్రస్ట్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, నగదు, విరాళాల స్వీకరణ, ఖర్చుల వివరాలను సిట్ రీ-ఆడిట్ చేయిస్తోంది. పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాలు ఎలా వినియోగించబడ్డాయి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉందా లేదా అనే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సిట్ అధికారులు ముఖ్యంగా.. గత ఐదేళ్ల ట్రస్ట్ ఖాతాలపై ఫోకస్ చేసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన విరాళాలు ఏ రూపంలో వచ్చాయి (నగదు, బ్యాంక్ ట్రాన్స్ఫర్, డొనేషన్ బాక్స్‌లు) అనే అంశాలను వర్గీకరించి పరిశీలిస్తున్నారు. అలాగే, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాల నమోదు ప్రక్రియ, అకౌంటింగ్ పద్ధతులు, ఆడిట్ రిపోర్టులు సమర్థంగా నిర్వహించబడ్డాయా లేదా అన్నది కూడా దర్యాప్తులో భాగంగా ఉంది.నిర్మాణ వ్యయాలపై ప్రత్యేక తనిఖీలుఅయోధ్యలో కొనసాగుతున్న రామ మందిర నిర్మాణ పనులకు సంబంధించిన ఖర్చులపై కూడా సిట్ మరోసారి విచారణను ప్రారంభించనుంది. కాంట్రాక్టులు ఎలా కేటాయించబడ్డాయి, నిర్మాణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థ.. ఈ అంశాలన్నింటిపై అధికారులు డేటా సేకరిస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులపై వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. విరాళాలు లెక్కించే విధానం, డొనేషన్ బాక్సుల నిర్వహణ, వాటి ఓపెనింగ్ విధానం వంటి అంశాలపై కూడా సిట్ దృష్టి పెట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాలు కేంద్ర ట్రస్ట్ ఖాతాలకు ఎలా జమయ్యాయి, వాటి రికార్డింగ్‌లో లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అలాగే, ట్రస్ట్ వద్ద ఉన్న నగదు నిల్వలు, వాటి నిర్వహణ, బ్యాంక్ డిపాజిట్లు, వడ్డీ ఆదాయం వంటి అంశాలను కూడా సిట్ పరిశీలిస్తోంది. భారీ మొత్తంలో నగదు నిల్వలు ఎలా నిర్వహించబడ్డాయి అన్నది కీలక అంశంగా మారింది.సమగ్ర నివేదిక సిద్ధం దిశగా.. మొత్తం ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర నివేదిక తయారు చేయడానికి సిట్ పని ప్రారంభించింది. అవసరమైతే ట్రస్ట్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, అయోధ్య ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై జరుగుతున్న ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘అమిత్‌షా అయోధ్యకు ఎందుకు రాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం వ్యవహారంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రామాలయం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి కూడా స్వామివారిని ఎందుకు దర్శించుకోలేదని ఆయన నిలదీశారు. ఓట్ల కోసం ప్రసంగాల్లో రాముడి పేరు పదేపదే జపించిన నేతలకు గుడికి వెళ్లే తీరిక లేకపోవడం విచిత్రంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాళాల అవకతవకలు, సిట్ విచారణ తీరుపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. రామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి కచ్చితంగా 891 రోజులు గడిచిందని, ఈ కాలంలో అమిత్ షా ఒక్కసారి కూడా అయోధ్య వెళ్లలేదని కేజ్రీవాల్ గణాంకాలతో సహా వివరించారు. అమిత్ షా తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో 42 సార్లకు పైగా రామ మందిరం గురించి మాట్లాడారని గుర్తుచేశారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు సమయం ఉంటుంది కానీ గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకునే తీరికలేదా ? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అయోధ్య విరాళాల చోరీ .. కుంభమేళా టార్గెట్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. ఆలయానికి వచ్చే కానుకల చోరీలో అత్యధిక భాగం విరాళాల చోరి 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను విచారించగా ఈ అంశాలే వెల్లడైనట్లు పేర్కొన్నారు.కుంభమేళానే టార్టెట్?2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని జరిగింది. దీనికి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తుల పోటెత్తారు. ఆ భక్తులు అయోధ్యలోని రామమందిరానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో ఈ సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో ఆలయ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల చోరీకి పాల్పడ్డారు. ఈ కుట్రను నిందితులంతా కలిసే పన్నారని పోలీసులు పేర్కొన్నారు.దోపిడిలో వారిదే సింహభాగంఈ విరాళాల చోరీలో లవ్కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే ఇద్దరు బావమరుదులు అత్యధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. వీరు ఈ దొంగతనాల ద్వారా సంపాదించిన సొమ్ముతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు వీరిద్దరికీ సంబంధించి దాదాపు అర డజనుకు పైగా స్థిరాస్తులను పోలీసులు గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలను లోతుగా పరిశీలించేందుకు అయోధ్య పోలీసులు ఆదాయపు పన్ను శాఖ సహాయం తీసుకుంటున్నారు. అలాగే, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కూడా లేఖ రాయనున్నారు.ఎస్బీఐ (SBI) సిబ్బంది పాత్రపై అనుమానాలుఆలయంలోని విరాళాల లెక్కింపు ప్రక్రియను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం బ్యాంక్ ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. ఆలయంలోని నాలుగు విరాళాల పెట్టెల్లో వచ్చే నగదును లెక్కిస్తారు. ఈ లెక్కింపు బృందంలో 11 మంది బ్యాంక్ సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్ట్ సభ్యులతో కలిపి మొత్తం 14 మంది ఉంటారు. అయితే, ఈ చోరీలో కొందరు ఎస్బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.నిందితులలో ఒకరైన అవినాష్ శుక్లాకు చెందిన 'కౌశల్ పూరి' స్థావరం నుండి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం అవినాష్ శుక్లా సోదరుడైన అభిషేక్ నడుపుతున్న ఒక యోగా కేంద్రం. జూన్ 5న పోలీసులు ఈ యోగా కేంద్రంపై దాడి చేసి భారీగా నగదును రికవరీ చేసినట్లు అక్కడి నిర్వాహకురాలు సీమా తివారీ తెలిపారు. -
అయోధ్య కుంభకోణం.. వీహెచ్‌పీ కీలక వ్యాఖ్యలు
అయోధ్య రామ మందిరంలో వెలుగుచూసిన విరాళాల కుంభకోణం.. మరిన్ని చీకటి విషయాలను వెలుగులోకి తెస్తోంది. భక్తులు సమర్పించే కానుకలు సైతం మాయం చేశారని.. అలాగే గోల్మాల్ జరిగిందన్న విషయం ట్రస్ట్ పెద్దలకు ముందే తెలుసని సిట్ దర్యాప్తు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) స్పందించింది.అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన డొనేషన్ల దుర్వినియోగం ఆరోపణలతో.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరు మసకబారిపోయింది. భక్తులు సమర్పించిన విరాళాలు ఒక ప్లాన్ ప్రకారం దారి మళ్లించబడ్డాయని వచ్చిన ఆరోపణలతో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో ట్రస్ట్‌లో కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.రామ్ జన్మభూమి ఉద్యమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లాయి. అక్కడితోనే మా పాత్ర ముగిసింది. మందిర నిర్మాణం వరకే మా పాత్ర పరిమితమైంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు ట్రస్ట్ బాధ్యతేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే.. చంపత్ రాయ్ వ్యవహారాన్ని వీహెచ్‌పీతో అంటగట్టవద్దని ఆలక్ పరోక్షంగా సూచించారు. ట్రస్ట్‌లో జరిగే నిర్ణయాలకు సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేస్తూ, వ్యక్తిగతంగా ఎవరు చేసిన చర్యలకైనా ట్రస్ట్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.చంపత్ రాయ్ గతంలో విశ్వ హిందూ పరిషత్‌లో సుదీర్ఘంగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే అనుభవంతో తరువాత శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. చంపత్తో పాటు మరికొందరు వీహెచ్‌పీ అనుబంధ నేతలు కూడా ట్రస్ట్ సభ్యులుగా పని చేశారు. అయితే విరాళాల గోల్మాల్ వ్యహారం బయటకు రావడం.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి, సిట్ ప్రాథమిక నివేదిక నేపథ్యంలో చంపత్‌రాయ్ జూన్ 27న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆలయ సిబ్బంది సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఆధారాల ప్రకారం సుమారు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల దుర్వినియోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరెవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.అయితే ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత అది స్వతంత్ర సంస్థగా పనిచేస్తుందని వీహెచ్‌పీ ఇలా ప్రకటించడం కొత్తేం కాదు. తాజాగా వచ్చిన వివాదాల నేపథ్యంలో అదే స్టాండ్‌ను మరోసారి బలంగా పునరుద్ఘాటించింది.రామ్ మందిర ఉద్యమం, జనజాగరణ, భూమి పోరాటం వంటి దశల్లో వీహెచ్‌పీ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లాయి. అందుకే ప్రస్తుతం ఆలయ ఆర్థిక వ్యవహారాలు, విరాళాలు, నిర్వహణలో తమకేం ప్రత్యక్ష పాత్ర లేదని సంస్థ స్పష్టం చేస్తోంది.ఇక ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగిస్తోంది. డొనేషన్ నిధుల వినియోగం, బ్యాంక్ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్, నగదు ప్రవాహం అన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల నమ్మకంతో నిర్మితమైన రామ్ మందిరం చుట్టూ వచ్చిన ఈ వివాదం ఇప్పుడు వీహెచ్‌పీ స్టేట్మెంట్ తర్వాత.. సంస్థాగత బాధ్యతలపైనా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. చంపత్‌రాయ్‌పై ప్రశ్నల వర్షం.. రామ్ మందిరం డొనేషన్ కుంభకోణం దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మాజీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ను రెండు గంటలకు పైగా విచారించింది. భక్తుల విరాళాల సేకరణ, నగదు లెక్కింపు, విలువైన కానుకల భద్రపరిచడం, వాటిని బ్యాంకుల్లో జమ చేసే విధానం వరకు ప్రతి అంశంపై అధికారులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. అయితే డొనేషన్ దుర్వినియోగంలో తనకు ఎలాంటి పాత్ర లేదని చంపత్‌రాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారని, విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడం తన బాధ్యతేనని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. -
రామమందిరం విరాళాల కేసులో కొత్త ట్విస్ట్!
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు అధికారికంగా నమోదు కావడానికి ముందే.. దొంగిలించబడిన నగదులో భారీ మొత్తాన్ని రికవరీ చేసినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పాత్ర, పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించకముందే.. దొంగిలించబడిన నగదులో సుమారు రూ.58 లక్షలను ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది.జూన్ 4వ తేదీన విరాళాల నగదు గల్లంతైన విషయం ట్రస్ట్‌కు తెలిసింది. మరుసటి రోజే అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు, పోలీసులతో కలిసి నిందితుడు అవినాశ్ శుక్లా ఇంటికి వెళ్లి సుమారు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం జూన్ 5 నుంచి 8 మధ్య మిగిలిన మొత్తం నిందితులు బ్యాంకు బదిలీల ద్వారా తిరిగి చెల్లించినట్లు సమాచారం.అయితే ఈ మొత్తం రికవరీ అంతా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే జరగడం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. కేసు బయటకు రావడానికి ముందే నగదు రికవరీ ఎందుకు జరిగింది? అధికారిక ఫిర్యాదు నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? అనే అంశాలపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి.ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి మరికొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఈ వివాదం నేపథ్యంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు విరాళాల నగదు నిర్వహణ, ఉద్యోగుల నియామకాలు, సీసీటీవీ పర్యవేక్షణలో పలు లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.కేసుపై ఇటు రాజకీయంగానూ దుమారం కొనసాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) మాత్రం పారదర్శక దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్‌ను.. నిదానంగా విచారణ జరుపుతానని అంటోంది.ఎఫ్ఐఆర్కు ముందే నగదు రికవరీ జరిగిన వ్యవహారం, దాని వెనుక అనుసరించిన ప్రక్రియపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తుండటంతో.. రామమందిరం విరాళాల కేసు మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది. -
ఆలయ ట్రస్ట్‌కు ముందే తెలుసా?
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల అక్రమాలపై మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఈ వివాదం వెలుగులోకి రాకమునుపే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నిధుల్లో అవకతవకలు జరిగిన విషయం ట్రస్ట్వర్గాలకు తెలుసు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు పోలీసులను నిందితుడు అవినాశ్ ఇంటికి పంపించి నగదు బ్యాగును తెప్పించినట్లు తాజా వీడియోతో బహిర్గతమైంది. ఈ నగదు స్వాధీనంనాటికి ఇంకా పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా నమోదుకాలేదు. జూన్ 5న అవినాశ్ నివాసంలో సోదాలు అనధికారికంగా చేపట్టినట్లు తెలుస్తోంది. విరాళాలు పక్కదారి పట్టిన అంశం జూన్ 7వ తేదీన మాత్రమే బహిర్గతమైంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రామ మందిరానికి అందిన కోట్లాది విరాళాలు పక్కదారి పట్టాయని సంచలన ప్రకటన చేయడం తెల్సిందే. అంతకుముందే, పోలీసులు శుక్లాను కస్టడీలోకి తీసుకోవడంతోపాటు అతడు నోట్ల కట్టలున్న ఓ పెద్ద బ్యాగును మోసుకెళ్తున్నట్లుగా ఉన్న 24 సెకన్ల వీడియో ఒకటి తాజాగా బహిర్గతమైంది. సోదాలు జరిపిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపైనా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ నిఘా, విరాళాలను స్వీకరించే ఉద్యోగుల ఎంపిక, నగదు నిల్వ విధానాల్లో తీవ్ర లోపాలున్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిందని, అందులోని సిబ్బంది అంతా ట్రస్ట్ ఉద్యోగులకు సంబంధించిన వారేనని చెబుతు న్నారు. ఆలయ ట్రస్ట్ జరిపిన భూమి కొనుగోళ్లు, ఆలయ నిర్మాణ టెండర్ల ఖరారు పైనా సిట్ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు దర్యాప్తు నివేదికలను సీఎం యోగికి అందజేస్తోంది.నిందితుల ఇళ్లపై దాడులువిరాళాలను చోరీ చేసిన ఆరోపణలపై అరెస్టయిన 8 మంది నిందితుల నివాసాలపై అయోధ్య పోలీసు బృందాలు ఆదివారం ఏకకాలంలో దాడులు చేపట్టాయి. అయోధ్య కోర్టు నిందితులందరినీ సోమవారం వరకు రిమాండ్‌కు పంపించడం తెల్సిందే. ఆదివారం తనిఖీల సందర్భంగా నిందితుడు మనీశ్ యాదవ్ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో, అధికారులు కుటుంబసభ్యులతో తాళం తీయించి, సోదాలు చేపట్టారు. రామశంకర్ అలియాస్ టిన్ను యాదవ్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. అతడి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. చుట్టుపక్కల వారి నుంచి అతడి ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 79.85 లక్షల నగదు దొరికినట్లు అధికారులు చెప్పారు.స్కార్పియో, ఫామ్‌హౌస్..అయోధ్య విరాళాల చోరీ కేసులో అరెస్టయి న వారిలో అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవ్‌కుశ్ మిశ్రా కీలకంగా ఉన్నారు. మూడేళ్ల క్రితం బ్యాంక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన అనుకల్ప్ మిశ్రా దాతల విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే బృందంలో చేరాడు. ఆ తర్వాత అధికారుల సాయంతో తన బావ లవ్కుశ్ను అదే పనిలో చేర్పించాడు. ఇద్దరూ కలిసి సొత్తును దారి మళ్లించే పనిలో బిజీ అయి పోయారు. అయోధ్యలోని అనుకల్ప్ సొంత గ్రామానికి వెళ్లిన సిట్ట అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలిశా యి. అనుకల్ప్ కొత్తగా పేద్ద ఇల్లు, భూమి, ఖరీదైన వాహనం, ఫామ్‌హౌస్ కొనుగోలు చేసినట్లు తేలింది. లవ్‌కుశ్ మిశ్రా ఖరీదైన బైక్ కొన్నాడు. అనుకల్ప్ మిశ్రా గ్రామంలో ఇటీవల వారం పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించాడు. అందులో భా గంగా మతపెద్దలను రప్పించి, ఉపన్యా సాలు ఇప్పించాడు. కార్యక్రమానికి అయో ధ్య ఆలయ ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
రాముల వారి సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫార్మ్‌హౌస్‌లు?
లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్ స్టైల్‌పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి గ్రామంలో ఈ విషయమై పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో పోలీసులు ఇదివరకే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవకుష్ మిశ్రా ఉన్నారు. అయితే అనుకల్పే మాస్టర్‌మైండ్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అయోధ్య పరిసరాల్లోని ఆయన గ్రామాన్ని సందర్శించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య సమీపంలోని అతని గ్రామమైన బసవాకు పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లారు. ఇతరుల ఇళ్లతో పోలిస్తే అతని ఇల్లు చాలా విభిన్నంగా అత్యంత విలాసవంతమైనదిగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఆ విషయమై వారి ఇంటి పరిసరాల్లోని వ్యక్తులను విచారించగా ఒక్కసారిగా వారి ఆర్థిక స్థితిలో పెనుమార్పులు వచ్చినట్లు తెలిపారు.అంతేకాకుండా అనుకల్ప్ మిశ్రా ఇటీవల గ్రామం వెలుపల ఒక ఫార్మ్‌హౌస్ నిర్మించాడని గత ఏడాది అయోధ్యలో రూ. 65 లక్షలు వెచ్చించి ఒక ఇల్లు కొనుగోలు చేశాడని అతని వద్ద ఇప్పటికే ఒక వాహనం ఉండగా, కొత్తగా స్కొర్పియో ఎస్యూవీ బుక్ చేశాడని పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం వరకు ఆ కుటుంబం తీవ్రమైన "ఆర్థిక ఇబ్బందుల్లో" ఉండేదని, కానీ ఇప్పుడు వారికి ఎటువంటి లోటులేదని ఆర్థికంగా చాలా బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే అనుకల్ప్ ఒక ప్రసిద్ధ మత ప్రవచనకర్త (కథావాచక్) తో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడని అతని బంధువులు తెలిపినట్లు పేర్కొన్నారు.అనుకల్ప్ మిశ్రా నేపథ్యంఒక బ్యాంకు అవుట్సోర్సింగ్ టీమ్‌లో పనిచేసే మిశ్రా, దాదాపు మూడేళ్ల క్రితం రామాలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత అదే బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తన బావ లవకుష్ మిశ్రాను కూడా అదే టీమ్‌లోకి తీసుకువచ్చాడు.అయోధ్యలోని రుదౌలీ ప్రాంతానికి చెందిన లవకుష్ మిశ్రా ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతను కూడా ఇటీవల లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను కొనుగోలు చేసినట్లు పొరుగువారు తెలిపారు. -
అయోధ్య కుంభకోణం: సిట్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు!
భక్తులు భగవంతుడిపై విశ్వాసంతో హుండీలో వేసిన కానుకలనే కొందరు సిబ్బంది కాజేశారు. సీసీ కెమెరాలు ఉన్నా పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ఒకరు కెమెరాకు అడ్డంగా నిలబడితే.. మరొకరు హుండీలోని నగదును, నగలను మాయం చేశారు. అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బయటపెట్టిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 70 సార్లు చోరీలు జరిగినట్లు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా గుర్తించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో బయటపడిన విధానం మరింత విస్మయానికి గురిచేస్తోంది. విరాళాల లెక్కింపు సమయంలో ఒక ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడేవాడు. అదే సమయంలో అతని సహచరులు హుండీలోని నగదును దొంగిలించి తమ దుస్తుల్లో దాచుకునేవారు. అనంతరం ఆ డబ్బును స్నానాల గదిలో దాచిపెట్టి, అనువైన సమయంలో బయటకు తీసుకెళ్లి పరస్పరం పంచుకునేవారని ఎస్ఐటీ గుర్తించింది.ఇంతటితో ఆగలేదు. హుండీల్లో వచ్చిన నగదును బ్యాంకులకు తరలించే సమయంలో కూడా కొంత మొత్తాన్ని పక్కకు మళ్లించి కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. నగదు లెక్కింపు, భద్రపరచడం, బ్యాంకులో జమ చేసే మొత్తం ప్రక్రియలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.నగదుతో పాటు భక్తులు బాలరాముడికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హుండీలో వేసిన చెవిపోగులు, ముక్కుపుడకలు, గాజులు, కాలి గజ్జెలు.. లాంటి విలువైన ఆభరణాల లెక్కల్లో కూడా తేడాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అయితే వీటి విలువ, పరిమాణంపై అధికారులు ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.ఎస్ఐటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా నమోదైన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపించారు. అరెస్టయిన వారిలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు మాజీ డ్రైవర్‌గా పనిచేసిన టిన్నూ యాదవ్ కూడా ఉన్నాడు.ఈ పరిణామాల మధ్య.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోయినా, అరెస్టయిన కొందరు నిందితులు తమ సన్నిహితులేనన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ‘‘ప్రజల విశ్వాసంతో చెలగాటమాడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. దోషులు కఠిన శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయోధ్య రామమందిరం వంటి దేశంలోని అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో విరాళాల భద్రత, పారదర్శకతపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. దర్యాప్తులో మరెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. -
అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా?
న్యూఢిల్లీ: అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్‌తోపాటు మరో సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం రాజీనామా చేసినట్లు తెలిసింది. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వెల్లడించింది. రాజీనామాపై సంప్రదించడానికి ప్రయత్నించగా, వారిద్దరూ అందుబాటులోకి రాలేదు. నిందితుల్లో ఒకడైన రామ్‌శంకర్ యాదవ్ గతంలో చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని అధికారులు చెప్పారు. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదును ఆలయ ఖజానాకు చేర్చకుండా మాయం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదుతో పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. నిందితులు రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, సుభాష్‌చంద్ర శ్రీవాస్తవ, రామశంకర్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్‌ను ‘సిట్’అధికారులు అరెస్టు చేశారు. ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్‌కి అత్యంత సన్నిహితుడైన ఆయన డ్రైవర్ రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. నిందితులపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), అవినీతి నిరోధక చట్టం నిబంధనల ప్రకారం... దొంగతనం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, చోరీసొత్తు దాచడం, నేరపూరిత కుట్ర, ఉమ్మడి ఉద్దేశంతో నేరాలకు పాల్పడడం వంటి అభియోగాలు నమోదు చేశారు. విరాళాలుగా వచ్చిన నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో వీరు పాల్గొనేవారని తెలిపారు. వీరిలో సుభాష్ చంద్ర శ్రీవాస్తవ మిగిలిన వారికి ఇన్చార్జ్గా వ్యవహరించేవారని చెప్పారు. పోలీసు కస్టడీకి నిందితులు 8 మంది నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 29 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా రూ.79.85 లక్షలు స్వా«దీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కె.సి.వర్మ చెప్పారు. అరెస్టయిన వారిలో ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగులని, ఆలయంలో స్వీకరించిన నగదు విరాళాలను లెక్కించే పని కోసం వారిని నియమించారని, వారు బ్యాంకు నుంచి జీతాలు పొందుతున్నారని తెలిపారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దు: యోగి సనాతన విలువలకు, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం హెచ్చరించారు. అయోధ్య ఆలయ గౌరవాన్ని కాపాడటమే తమ కర్తవ్యమని చెప్పారు. ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు పని గట్టుకుని రామభక్తులే లక్ష్యంగా, అయోధ్య ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై సిట్ నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభించామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని అన్నారు. రామజన్మభూమి ఉద్యమానికి, రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు నేడు భక్తుల విశ్వాసాలపై నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. రామాలయంపై దిష్టి పెట్టొద్దని, రాముడి మర్యాదను కాపాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. రూ. కోటికి రసీదు అందలేదు: రౌత్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు శివసేన(ఉద్ధవ్) తరఫున ఇచ్చిన రూ.కోటి విరాళానికి ఇప్పటివరకూ రసీదు అందలేదని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శుక్రవారం ఆరోపించారు. పార్టీ ఇచ్చిన వెండి ఇటుకకు కూడా రసీదు అందలేదన్నారు. విరాళాల చోరీ సొమ్ముతోనే ఎంపీలు, ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. పెద్దలను కాపాడుతున్నారు: కేజ్రీవాల్ రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో పెద్దవాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విరాళాల చోరీతో మహా పాపానికి ఒడిగట్టిన వారికి భగవంతుడు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని వేడుకున్నట్లు తెలిపారు. అయోధ్య పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఒక బూటకమని మండిపడ్డారు. ఇదీ నేపథ్యం అయోధ్య రామాలయానికి అందుతున్న విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఈ నెల 7న మొట్టమొదటిసారి బయటకు వచ్చింది. శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వినతి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 13న ‘సిట్’ ఏర్పాటు చేసింది. ‘సిట్’ 23న ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 25న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ‘సిట్’సిఫారసుల మేరకు పోలీసులు నిందితులను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. తాము అయోధ్య రామాలయ నిర్మాణానికి 200 వెండి ఇటుకలు సమర్పించామని, అందుకు తగిన రసీదులు అందలేదని, ఈ వెండిని ఏ అవసరం కోసం వినియోగించారో తెలపాలని సింధీ సామాజిక వర్గానికి చెందిన సంస్థ ప్రశ్నించింది. -
అయోధ్యను కుదిపేస్తున్న విరాళాల వివాదం.. 8 మందిపై ఎఫ్ఐఆర్
అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలను కాజేశారన్న ఆరోపణల కేసులో ప్రాథమిక నివేదిక సిఫారసు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, రామ్ మందిరంలో సమర్పించిన కానుకలను నిందితులు ఓ పద్ధతి ప్రకారం దొంగిలిస్తున్నారని ఆరోపించారు.సిట్ ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇలాంటి అంశాలే వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ ఆరోపణలు, ప్రాథమిక దర్యాప్తు వివరాల ఆధారంగా ఫిర్యాదుదారు ఎనిమిది మంది పేర్లను పేర్కొంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు ఇవే..జాతీయ మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం.. కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఎనిమిది మంది పేర్లతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.నిందితుల్లో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, మనీష్ యాదవ్, రామాశంకర్ మిశ్రా, రామాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, సుభాష్ చంద్ర, కరుణేశ్ పాండే ఉన్నారు. మరో నిందితుడి పేరు తెలియాల్సి ఉంది. ఇద్దరు నిందితులను డబ్బు స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ఎఫ్ఐఆర్లో ఉద్దేశపూర్వక దొంగతనం, అలవాటుగా దొంగతనాలు చేయడం, దొంగతనానికి సహకరించడం, ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థ ఉద్యోగి నమ్మకద్రోహం చేయడం వంటి ఆరోపణలు కింద చేర్చారు. నిధుల అపహరణ, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన నిబంధనల కింద కూడా కేసు నమోదు చేశారు.ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేసి.. దర్యాప్తు విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో “చిన్న చేపలకే శిక్ష పడుతుంది. పెద్ద చేపలు తప్పించుకుంటాయి” అని ఆరోపించారు.


