అయోధ్యను కుదిపేస్తున్న విరాళాల వివాదం.. 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌ | Ram mandir donation row FIR against 8 after SIT report | Sakshi
Sakshi News home page

అయోధ్యను కుదిపేస్తున్న విరాళాల వివాదం.. 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌

Jun 26 2026 12:00 AM | Updated on Jun 29 2026 7:37 AM

Ram mandir donation row FIR against 8 after SIT report

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలను కాజేశారన్న ఆరోపణల కేసులో ప్రాథమిక నివేదిక సిఫారసు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, రామ్ మందిరంలో సమర్పించిన కానుకలను నిందితులు ఓ పద్ధతి ప్రకారం దొంగిలిస్తున్నారని ఆరోపించారు.

సిట్‌ ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇలాంటి అంశాలే వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ ఆరోపణలు, ప్రాథమిక దర్యాప్తు వివరాల ఆధారంగా ఫిర్యాదుదారు ఎనిమిది మంది పేర్లను పేర్కొంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

ఎఫ్ఐఆర్‌లో ఉన్న పేర్లు ఇవే..
జాతీయ మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం.. కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది మంది పేర్లతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

నిందితుల్లో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, మనీష్ యాదవ్, రామాశంకర్ మిశ్రా, రామాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, సుభాష్ చంద్ర, కరుణేశ్ పాండే ఉన్నారు. మరో నిందితుడి పేరు తెలియాల్సి ఉంది. ఇద్దరు నిందితులను డబ్బు స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఎఫ్ఐఆర్‌లో ఉద్దేశపూర్వక దొంగతనం, అలవాటుగా దొంగతనాలు చేయడం, దొంగతనానికి సహకరించడం, ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థ ఉద్యోగి నమ్మకద్రోహం చేయడం వంటి ఆరోపణలు కింద చేర్చారు. నిధుల అపహరణ, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన నిబంధనల కింద కూడా కేసు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేసి.. దర్యాప్తు విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో “చిన్న చేపలకే శిక్ష పడుతుంది. పెద్ద చేపలు తప్పించుకుంటాయి” అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement