అయోధ్య ట్రస్ట్‌ చీఫ్‌ రాజీనామా? | Ayodhya Trust Chief to Resig..says Anil Mishra | Sakshi
Sakshi News home page

అయోధ్య ట్రస్ట్‌ చీఫ్‌ రాజీనామా?

Jun 27 2026 4:19 AM | Updated on Jun 29 2026 7:37 AM

Ayodhya Trust Chief to Resig..says Anil Mishra

చంపత్‌ రాయ్‌తో పాటు ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా సైతం రాజీనామా  

విరాళాల అంశంలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ  తప్పుకున్నట్లు ప్రచారం   

ఎనిమిది మంది నిందితుల అరెస్టు  

రూ. 79.85 లక్షలు స్వా«దీనం  
 

న్యూఢిల్లీ: అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చీఫ్‌ చంపత్‌ రాయ్‌తోపాటు మరో సభ్యుడు అనిల్‌ మిశ్రా శుక్రవారం రాజీనామా చేసినట్లు తెలిసింది. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, చంపత్‌ రాయ్, అనిల్‌ మిశ్రా రాజీనామా చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) వెల్లడించింది. రాజీనామాపై  సంప్రదించడానికి ప్రయత్నించగా, వారిద్దరూ అందుబాటులోకి రాలేదు.

 నిందితుల్లో ఒకడైన రామ్‌శంకర్‌ యాదవ్‌ గతంలో చంపత్‌ రాయ్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని అధికారులు చెప్పారు. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదును ఆలయ ఖజానాకు చేర్చకుండా మాయం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు కృష్ణమోహన్‌ ఫిర్యాదుతో పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. 

దీనిపై సమగ్ర విచారణ కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. నిందితులు రామ్‌శంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్నూ యాదవ్, అనుకల్ప్‌ మిశ్రా, అవినాష్‌ శుక్లా, కరుణేష్‌ పాండే, సుభాష్‌చంద్ర శ్రీవాస్తవ, రామశంకర్‌ మిశ్రా, లవకుశ్‌ మిశ్రా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌ను ‘సిట్‌’అధికారులు అరెస్టు చేశారు.

 ట్రస్ట్‌ చీఫ్‌ చంపత్‌ రాయ్‌కి అత్యంత సన్నిహితుడైన ఆయన డ్రైవర్‌ రామ్‌శంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్నూ యాదవ్‌ ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. నిందితులపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), అవినీతి నిరోధక చట్టం నిబంధనల ప్రకారం... దొంగతనం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, చోరీసొత్తు దాచడం, నేరపూరిత కుట్ర, ఉమ్మడి ఉద్దేశంతో నేరాలకు పాల్పడడం వంటి అభియోగాలు నమోదు చేశారు. విరాళాలుగా వచ్చిన నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో వీరు పాల్గొనేవారని తెలిపారు. వీరిలో సుభాష్‌ చంద్ర శ్రీవాస్తవ మిగిలిన వారికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించేవారని చెప్పారు.  

పోలీసు కస్టడీకి నిందితులు  
8 మంది నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 29 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా రూ.79.85 లక్షలు స్వా«దీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్‌ ఆఫీసర్‌ కె.సి.వర్మ చెప్పారు. అరెస్టయిన వారిలో ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగులని, ఆలయంలో స్వీకరించిన నగదు విరాళాలను లెక్కించే పని కోసం వారిని నియమించారని, వారు బ్యాంకు నుంచి జీతాలు పొందుతున్నారని తెలిపారు.  

ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దు: యోగి  
సనాతన విలువలకు, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం హెచ్చరించారు. అయోధ్య ఆలయ గౌరవాన్ని కాపాడటమే తమ కర్తవ్యమని చెప్పారు. ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు పని గట్టుకుని రామభక్తులే లక్ష్యంగా, అయోధ్య ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై సిట్‌ నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభించామని యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని అన్నారు. రామజన్మభూమి ఉద్యమానికి, రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు నేడు భక్తుల విశ్వాసాలపై నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. రామాలయంపై దిష్టి పెట్టొద్దని, రాముడి మర్యాదను కాపాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.  

రూ. కోటికి రసీదు అందలేదు: రౌత్‌ 
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు శివసేన(ఉద్ధవ్‌) తరఫున ఇచ్చిన రూ.కోటి విరాళానికి ఇప్పటివరకూ రసీదు అందలేదని పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం ఆరోపించారు. పార్టీ ఇచ్చిన వెండి ఇటుకకు కూడా రసీదు అందలేదన్నారు. విరాళాల చోరీ సొమ్ముతోనే ఎంపీలు, ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు.  

పెద్దలను కాపాడుతున్నారు: కేజ్రీవాల్‌  
రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో పెద్దవాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. విరాళాల చోరీతో మహా పాపానికి ఒడిగట్టిన వారికి భగవంతుడు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని వేడుకున్నట్లు తెలిపారు. అయోధ్య పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఒక బూటకమని మండిపడ్డారు.  

ఇదీ నేపథ్యం  
అయోధ్య రామాలయానికి అందుతున్న విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఈ నెల 7న మొట్టమొదటిసారి బయటకు వచ్చింది. శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వినతి మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 13న ‘సిట్‌’ ఏర్పాటు చేసింది. ‘సిట్‌’ 23న ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 25న ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, ‘సిట్‌’సిఫారసుల మేరకు పోలీసులు నిందితులను గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. తాము అయోధ్య రామాలయ నిర్మాణానికి 200 వెండి ఇటుకలు సమర్పించామని, అందుకు తగిన రసీదులు అందలేదని, ఈ వెండిని ఏ అవసరం కోసం వినియోగించారో తెలపాలని సింధీ సామాజిక వర్గానికి చెందిన సంస్థ ప్రశ్నించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement