224 దాటిన మరణాలు
కొలంబియాలో అంతులేని విషాదంగా భూకంప ఘటన
బొగాటా: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో సోమవారం సంభవించిన పెను భూకంపం ధాటికి వేలాది మంది జాడ గల్లంతైంది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల్లో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 224కు పెరిగింది. పశ్చిమ కొలంబియాను చివురుటాకులా వణికించిన పెనుభూకంపం ఘటనలో 3,000 మందికిపైగా జనం జాడ తెలీకుండాపోయిందని రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అంచనావేస్తున్నాయి.
భూకంప ప్రభావిత కాలీ, పెరీరా, ఛోకో, మనిజేల్స్ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు ముమ్మరంగా అన్వేషణ, సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయా ప్రాంతాల మేయర్లు, గవర్నర్లు మంగళవారం ప్రకటించారు. అవిశ్రాంతంగా పనిచేస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడ కోసం వెతుకుతున్నారు.


