లక్నో: అయోధ్య ఆలయ ట్రస్ట్ విరాళాల కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలు, విరాళాల లెక్కింపు విధానం, నిర్మాణ పనుల వ్యయంపై సమగ్ర ఆడిట్‌కు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే, సిట్ అధికారులు గత ఐదేళ్ల ఖాతాలపై రీ-ఆడిట్ చేయనున్నారు.
వివరాల ప్రకారం.. అయోధ్య ట్రస్ట్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, నగదు, విరాళాల స్వీకరణ, ఖర్చుల వివరాలను సిట్ రీ-ఆడిట్ చేయిస్తోంది. పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాలు ఎలా వినియోగించబడ్డాయి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉందా లేదా అనే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సిట్ అధికారులు ముఖ్యంగా.. గత ఐదేళ్ల ట్రస్ట్ ఖాతాలపై ఫోకస్ చేసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన విరాళాలు ఏ రూపంలో వచ్చాయి (నగదు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, డొనేషన్ బాక్స్‌లు) అనే అంశాలను వర్గీకరించి పరిశీలిస్తున్నారు. అలాగే, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాల నమోదు ప్రక్రియ, అకౌంటింగ్ పద్ధతులు, ఆడిట్ రిపోర్టులు సమర్థంగా నిర్వహించబడ్డాయా లేదా అన్నది కూడా దర్యాప్తులో భాగంగా ఉంది.
నిర్మాణ వ్యయాలపై ప్రత్యేక తనిఖీలు
అయోధ్యలో కొనసాగుతున్న రామ మందిర నిర్మాణ పనులకు సంబంధించిన ఖర్చులపై కూడా సిట్ మరోసారి విచారణను ప్రారంభించనుంది. కాంట్రాక్టులు ఎలా కేటాయించబడ్డాయి, నిర్మాణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థ.. ఈ అంశాలన్నింటిపై అధికారులు డేటా సేకరిస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులపై వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. విరాళాలు లెక్కించే విధానం, డొనేషన్ బాక్సుల నిర్వహణ, వాటి ఓపెనింగ్ విధానం వంటి అంశాలపై కూడా సిట్ దృష్టి పెట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాలు కేంద్ర ట్రస్ట్ ఖాతాలకు ఎలా జమయ్యాయి, వాటి రికార్డింగ్‌లో లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అలాగే, ట్రస్ట్ వద్ద ఉన్న నగదు నిల్వలు, వాటి నిర్వహణ, బ్యాంక్ డిపాజిట్లు, వడ్డీ ఆదాయం వంటి అంశాలను కూడా సిట్ పరిశీలిస్తోంది. భారీ మొత్తంలో నగదు నిల్వలు ఎలా నిర్వహించబడ్డాయి అన్నది కీలక అంశంగా మారింది.
సమగ్ర నివేదిక సిద్ధం దిశగా..
మొత్తం ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర నివేదిక తయారు చేయడానికి సిట్ పని ప్రారంభించింది. అవసరమైతే ట్రస్ట్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, అయోధ్య ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై జరుగుతున్న ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


