మహారాష్ట్రను శాసిస్తున్న ‘షుగర్ సామ్రాజ్యం’ | Why Maharashtra Opposition Avoids the Ethanol Blending Debate | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రను శాసిస్తున్న ‘షుగర్ సామ్రాజ్యం’

Jul 2 2026 7:28 AM | Updated on Jul 2 2026 7:42 AM

Why Maharashtra Opposition Avoids the Ethanol Blending Debate

మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉందనేది కేవలం ఎన్నికల ముంగిట కనిపించే ముచ్చట మాత్రమే.. తెరవెనుక మాత్రం అందరిదీ ఒకటే వ్యాపార సామ్రాజ్యం.. అదే చక్కెర మిల్లులు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం) వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతకంటే పెద్ద ఆయుధం దొరకకపోయినా ప్రతిపక్షాలు ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి? ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న ‘షుగర్ ఫ్యాక్టరీ’ కనెక్షన్ ఏంటి? మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఆ చక్కెర సామ్రాజ్యం గురించిన పూర్తి వివరాలు..

పాలిటిక్స్ కాదు.. ఇది ఇథనాల్ బిజినెస్
మహారాష్ట్రలో రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ, చక్కెర వ్యాపారంలో మాత్రం నాయకులంతా భాగస్వాములే. ఒకప్పుడు కేవలం పంచదార ఉత్పత్తికే పరిమితమైన ఈ షుగర్ మిల్లులు, ఇప్పుడు ఆధునిక ‘బయో-రిఫైనరీలు’గా మారిపోయాయి. చెరకు నుండి చక్కెర మాత్రమే కాకుండా, గ్రీన్ ఫ్యూయల్ అయిన ఇథనాల్‌ను తయారు చేస్తూ ఈ మిల్లులు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్ బ్లెండింగ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో ఈ వ్యాపారానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. అందుకే, ప్రజా సమస్యగా మారిన ఈ అంశంపై ఏ ఒక్క విపక్ష నేత కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు.

బీజేపీ నేతల చక్కెర సామ్రాజ్యం
దేశంలోనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నాగపూర్‌లో మూడు చక్కెర మిల్లులు కలిగిన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత సుభాష్ దేశ్‌ముఖ్ సోలాపూర్‌లో మూడు మిల్లులున్న ‘లోకమంగళ్ గ్రూప్’ను నడుపుతున్నారు. వీరితో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, హరిభావూ బగాడే, బబన్‌రావ్ పాచ్‌పుతే వంటి దిగ్గజాలు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ అతుల్ భోసలే (యశ్వంత్రావ్ మోహితే కృష్ణ మిల్స్), మనోజ్ ఘోర్పడే, అభిమన్యు పవార్ వంటి బీజేపీ నాయకులకు ఈ చక్కెర పరిశ్రమలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.

శరద్ పవార్, అజిత్ పవార్‌ల హవా
ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని రెండు గ్రూపుల నేతలను పరిశీలిస్తే, మహారాష్ట్ర షుగర్ బెల్ట్‌పై వీరి పట్టు అంతా ఇంతా కాదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు శ్రీ అంబాలికా షుగర్ (అహ్మద్ నగర్), దౌండ్ షుగర్ (పూణే), జరందేశ్వర్ షుగర్ మిల్స్ (సతారా) వంటి భారీ ప్రైవేట్ మిల్లులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన సోదరుడు రాజేంద్ర పవార్ ‘బారామతి ఆగ్రో’ అధ్యక్షుడిగా ఇందాపూర్, కన్నడ ప్రాంతాల్లో మిల్లులను నడుపుతున్నారు. స్వయంగా శరద్ పవార్ ‘వసంతదాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్’ అధ్యక్షుడిగా ఉంటూ ఈ మొత్తం పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే-పాటిల్, హసన్ ముష్రిఫ్, రాజేష్ తోపే, ధనంజయ్ ముండే వంటి ఎన్‌సీపీ కీలక నేతలందరికీ సొంతంగా మిల్లులు ఉన్నాయి.

కాంగ్రెస్, శివసేనల హస్తం కూడా ఇందులోనే
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ స్థాపించిన లాతూర్‌లోని జాగృతి షుగర్, మంజ్రా శేత్కరీ మిల్లులను ప్రస్తుతం అమిత్ దేశ్‌ముఖ్, దిలీప్‌రావ్ దేశ్‌ముఖ్ పర్యవేక్షిస్తున్నారు. సాంగ్లీలో పతంగ్‌రావ్ కదమ్ స్థాపించిన సోనహీరా సహకారి మిల్లును ఆయన కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, సతేజ్ పాటిల్, విశ్వజీత్ కదమ్ వంటి కాంగ్రెస్ ప్రముఖులకు ఈ వ్యాపారాలు ఉన్నాయి. అలాగే శివసేనకు చెందిన శంభూరాజ్ దేశాయ్ (బాలాసాహెబ్ దేశాయ్ షుగర్ ఫ్యాక్టరీ), విజయ్ శివతారే (స్వామి సమర్థ్ షుగర్) లాంటి నేతలు కూడా ఇందులో భాగస్వాములే.

గ్రామీణ ఓటు బ్యాంక్‌కు ఇదే కీలకం
ఈ చక్కెర మిల్లుల నెట్‌వర్క్ కేవలం లాభాలు ఆర్జించే వ్యాపారం మాత్రమే కాదు, మహారాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో పట్టు సాధించడానికి ప్రధాన వనరు. ఈ మిల్లుల ద్వారానే నాయకులు స్థానిక రైతులను, జిల్లా సహకార బ్యాంకులను, విరివిగా నడిచే డైరీ సొసైటీలను తమ గుప్పిట్లో ఉంచుకుంటారు. తద్వారా ఎన్నికల్లో భారీగా ఓట్లను, నిధులను సమీకరించుకోగలుగుతారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి కూటమికి చెందిన నాయకుల మిల్లులకు రూ.487 కోట్ల మార్జిన్ ఫండ్‌ను కేటాయించడం, రాజకీయాలకు-చక్కెర పరిశ్రమకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని స్పష్టం చేస్తోంది.

మౌనమే నీ నైజమా విపక్షమా?
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఇంజన్ల సామర్థ్యం తగ్గడం, మైలేజీ సమస్యలు రావడం వంటి ఎన్నో సాంకేతిక, ఆర్థిక లోపాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నా ప్రతిపక్షాలు ఎందుకు వీధి పోరాటాలు చేయడం లేదు? మహాయుతి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాకపోయినా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? సమాధానం స్పష్టం.. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మహారాష్ట్రలోని టాప్ లీడర్లందరి ప్రయోజనాలు ఈ ఇథనాల్ పరిశ్రమతో ముడిపడి ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సరళా భట్ కేసు: కశ్మీర్ ‘రియల్’ ఫైల్స్ రీ ఓపెన్!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement