అరుణాచల్‌లో జలప్రళయం.. ముగ్గురు గల్లంతు | Arunachal Floods Landslides Cut Off Highways 3 Missing | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌లో జలప్రళయం.. ముగ్గురు గల్లంతు

Jun 24 2026 1:21 PM | Updated on Jun 24 2026 1:28 PM

Arunachal Floods Landslides Cut Off Highways 3 Missing

ఈటానగర్‌: అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బుధవారం నాటికి తీవ్ర రూపం దాల్చాయి. వీటి ఫలితంగా సంభవించిన   వరదలు, విరిగిపడుతున్న కొండచరియల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కేయీ పన్యోర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

ముగ్గురు గల్లంతు.. నీట మునిగిన ఇళ్లు
కేయీ పన్యోర్ జిల్లా యాజాలి పరిధిలోని పూసా సమీపంలో గల నీప్కో ప్రాజెక్ట్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ఒక రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. దీంతో వరద నీరు ఒక్కసారిగా నివాస ప్రాంతాల్లోకి దూసుకెళ్లడంతో కాలనీ పరిసరాల్లోని కనీసం 18 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అదనపు డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తోంది.

రంగంలోకి రక్షణ బృందాలు
పరిస్థితి తీవ్రతను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమవగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలను కూడా అలర్ట్ చేశారు. యాజాలి పరిధిలోని అందుబాటులో ఉన్న రిజర్వ్ సిబ్బందిని, వాహనాలను అత్యవసర సేవల కోసం మొబిలైజ్ చేశారు. స్థానిక మాజీ సైనికులు కూడా ఈ సహాయక చర్యల్లో భాగస్వామ్యమయ్యారు.
 

మూసుకుపోయిన రహదారులు.. డ్యామ్ గేట్లు ఎత్తివేత
కొండచరియలు విరిగిపడటంతో పొటిన్, హోజ్ సమీపంలోని జాతీయ రహదారి మూడు చోట్ల పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా మట్టి, శిథిలాలు రోడ్డుపై పేరుకుపోవడంతో వందలాది మంది ప్రయాణికులు నడిరోడ్డుపై చిక్కుకుపోయారు. రోడ్లను క్లియర్ చేయడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. మరోవైపు, నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో నీప్కో సంస్థ ముందస్తు జాగ్రత్తగా రంగనాడి డ్యామ్ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. రక్షణ దృష్ట్యా విద్యుత్ ఉత్పాదనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement