ఒక్క క్షణం ముందు వరకు అదొక సాధారణ ప్రయాణం.. మరుసటి క్షణమే మృత్యువుతో పోరాటం. కళ్లముందే కొండచరియలు విరిగిపడి బైక్‌తో సహా అతడిని లోయవైపు ఈడ్చుకెళ్లాయి. ‘అరే పాపం..’ అని అంతా అనుకునేలోపే.. ఏదో అద్భుతం జరిగినట్లు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చావును కళ్లారా చూసి తిరిగి వచ్చిన ఈ ఉత్కంఠభరిత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈశాన్య భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారడమే కాకుండా.. తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. జూన్ 28న ఓ బైకర్ అత్యంత ఇరుకైన కొండ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే రహదారిపై బురద పేరుకుపోయి, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినా నెమ్మదిగా ముందుకు సాగుతుండగా.. ఒక్కసారిగా కొండచరియ విరిగిపడింది.
ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే.. భారీ మట్టి, రాళ్లతో పాటు బైక్, బైకర్ కూడా లోయవైపు జారిపోయారు. కొన్ని క్షణాల పాటు అతడు మట్టిపెళ్లల మధ్య కనిపించకుండా పోవడంతో అక్కడున్నవారంతా ప్రాణాలు దక్కడం అసాధ్యమేనని భావించారు. కొండచరియలు కిందకు దూసుకెళ్లి అక్కడే ఓ నదిలో చేరడంతో భారీగా దుమ్ము, మట్టి మేఘాలు ఎగిసిపడ్డాయి.
అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లాలోని సీజీ లోయలో ఈ ఘటన చోటుచేసుకుంది.
🇮🇳 Absolutely terrifying footage from India shows a biker being swept away as a massive landslide tears down a mountainside after relentless rain in Arunachal Pradesh.
The landslide also blocked the Siji River.
Against all odds, the biker survived without injuries. A miracle…— Mario Nawfal (@MarioNawfal) June 29, 2026
వీడియో చూసిన నెటిజన్లు "ఇది రెండో జన్మ", "అతడి అదృష్టం అసాధారణం", "లాటరీ టికెట్ కొనాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విధి తన పని చేయాలనుకుంది... అదృష్టం అడ్డొచ్చింది. క్షణాల్లో లోయలోకి జారిపోయిన ఆ బైకర్.. చివరి క్షణంలో చావునే మోసం చేసి సురక్షితంగా బయటపడ్డాడు అని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాల ప్రమాదాల తీవ్రతను గుర్తు చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో.. అధికారులు అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.


