40ఏళ్లుగా సినిమా, బుల్లితెర రంగాల్లో రాణిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి కిటు గిద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. బాలీవుడ్‌లో స్పష్టమైన నిబంధనలు లేవని.. అది అసలు నిజమైన ఇండస్ట్రీ కాదని వ్యాఖ్యానించారు.
‘పదేళ్లు పనిచేసిన నటికి మరో పదేళ్లు హుందాగా జీవించే అవకాశం ఉండాలి. కానీ మన దగ్గర ( బాలీవుడ్‌లో) అలాంటి పరిస్థితి లేదు. నటీనటులకు ఒకేసారి పారితోషికం చెల్లించి, సినిమాపై ఉన్న అన్ని హక్కులను నిర్మాతలే ఉంచుకుంటారు. వయసు పెరిగిన మహిళలకు ఇండస్ట్రీలో సరైన పాత్రలు రావడంలేదు. టెలివిజన్‌లో 30 ఏళ్లు దాటిన మహిళలను అమ్మమ్మ పాత్రల్లో చూపించడం విచిత్రంగా ఉంది. ముఖంపై వృద్ధాప్యం ఛాయలు లేకపోయినా అలాంటి పాత్రలే ఇస్తున్నారు’ అని అన్నారు.
1980,90 కాలంలో బుల్లితెర, సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిటు గిద్వానీ. ‘హోళీ’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘ఎయిర్ హోస్టెస్’, ‘స్వాభిమాన్’, ‘శక్తిమాన్’ వంటి సిరియాల్లో నటించారు. ‘ఫ్యాషన్’, ‘ధోబీ ఘాట్’ ‘జానే తు యా జానే నా’ వంటి చిత్రాల్లోనూ నటించారు.


