దిగ్గజ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా ఆమె జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ఎంప్రెస్- ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' పుస్తక ముఖచిత్రాన్ని షేర్ చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. 'మీరు ఎంతో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది' అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ పోస్టును శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.
2023లో వెస్ట్‌ల్యాండ్ బుక్స్ శ్రీదేవి అధికారిక జీవిత చరిత్రను ప్రచురిస్తున్నట్లు ప్రకటించింది. రచయిత ధీరజ్ కుమార్ రచించిన ఈ పుస్తకం శ్రీదేవి సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ఆమె వదిలివెళ్లిన వారసత్వాన్ని తెలియజేయనుంది.
ఒకానొక సమయంలో భారతీయ సినీ పరిశ్రమను ఏలిన శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూశారు. బంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరైన సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. 'మిస్టర్ ఇండియా', 'చాందినీ', 'హిమ్మత్‌వాలా' వంటి చిత్రాలతో ఆమె భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రీదేవి చివరి చిత్రం..
శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం 'మామ్' (2017). ఇది ఆమె కెరీర్‌లో 300వ చిత్రం. దీనికి గాను ఆమెకు మరణానంతరం జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఆమె మరణానంతరం విడుదలైన 'జీరో' (2018) చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించారు.


