ఐఐటీల్లో భారీగా అధ్యాపకుల కొరత | why faculty positions are vacant across all IITs details inside | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో 38 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ!

Jul 3 2026 4:54 PM | Updated on Jul 3 2026 5:12 PM

why faculty positions are vacant across all IITs details inside

న్యూఢిల్లీ: దేశంలో నాణ్య‌మైన విద్య‌ను అందించే సంస్థలుగా పేరు గాంచిన ఐఐటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ప్ర‌ధాన ఐఐటీలు అన్నింటిలోనూ అధ్యాపకుల కొర‌త ఉంద‌ని తెలుస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో మొత్తం మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో దాదాపు 38 శాతం ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఐదు అధ్యాపక పోస్టులలో దాదాపు రెండు ఖాళీగా ఉన్నాయని 'హిందుస్తాన్ టైమ్స్' వెల్ల‌డించింది. విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ, దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్న సమయంలో ఐఐటీల్లో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

4,804 పోస్టులు ఖాళీ
ఈ ఏడాది జనవరి 30 నాటికి ఐఐటీలలో మంజూరైన 12,498 అధ్యాపక పోస్టుల్లో 4,804 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఐఐటీ పాట్నాలో 54.6 శాతం, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 51.3 శాతం పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. మరో 12 ఐఐటీల్లో మూడింట ఒక వంతుకంటే ఎక్కువ పోస్టులు భర్తీ కాలేదు.

కార‌ణాలు ఇవే
అధ్యాపక పోస్టుల్లో ఖాళీలు భ‌ర్తీకాక‌పోవ‌డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన పోటీ కారణమని ఐఐటీల డైరెక్టర్లు చెబుతున్నారు. ఉత్తమ పీహెచ్‌డీ పట్టభద్రులను ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలు, బహుళజాతి పరిశోధనా సంస్థలు, డీప్‌టెక్ స్టార్టప్‌లు ఆకర్షిస్తున్నాయని వెల్ల‌డించారు. అలాగే ఐఐటీలు అత్యంత కఠినమైన నియామక ప్రమాణాలను పాటిస్తుండటంతో తగిన అభ్యర్థులు దొరికే వరకు పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయని చెప్పారు.

ప్రస్తుతం దేశంలోని ఐఐటీల్లో 1.35 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2028-29 నాటికి మరో 6,500 సీట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అధ్యాపకుల కొరత ఈ విస్తరణ ప్రణాళికలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అక్క‌డే అత్య‌ధిక ఖాళీలు! 
మొదటి తరం ఐఐటీలలో ఐఐటీ ఖరగ్‌పూర్ (51.3%), ఐఐటీ కాన్పూర్ (39%), ఐఐటీ బాంబే (38.4%), ఐఐటీ ఢిల్లీ (38.3%)ల్లో అధిక ఖాళీలు నమోదయ్యాయి. రెండో తరం ఐఐటీలలో ఐఐటీ పట్నా (54.6%), ఐఐటీ మండి (39.9%)ల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మూడో తరం ఐఐటీలలో ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్ (48.4%), ఐఐటీ గోవా (45.8%), ఐఐటీ గువాహటి (42.2%) కూడా అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఐఐటీ ధార్వాడ్‌లో కేవలం 1.07 శాతం ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఐఐటీ పలక్కాడ్ (5.88%), ఐఐటీ రోపర్ (14.35%), ఐఐటీ తిరుపతి (14.38%), ఐఐటీ భిలాయ్ (15.1%) తక్కువ ఖాళీలతో మెరుగైన స్థితిలో ఉన్నాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీలు ఏడాది పొడవునా నియామక ప్రక్రియలు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ గాంధీనగర్ వంటి సంస్థలు ప్రత్యేక నియామక డ్రైవ్‌లు, మిషన్ మోడ్ రిక్రూట్‌మెంట్, అంతర్జాతీయ పరిశోధన భాగస్వామ్యాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లను బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నాయి.

స‌వాళ్లు ఎన్నో...
ప్రతిభావంతులు విదేశాల్లో ఉద్యోగాల‌కు మొగ్గు చూపుతున్నార‌ని, ఫ‌లితంగా త‌మ‌కు నాణ్య‌మైన అభ్య‌ర్థులు దొర‌కం లేద‌ని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్ తెలిపారు.  "అత్యుత్తమ నాణ్యత గల పీహెచ్‌డీ పట్టభద్రుల కొరత కారణంగా ఈ సమస్య కొనసాగుతోంది. చాలా మంది ప్రతిభావంతులు విదేశాల్లో అవకాశాలను ఎంచుకుంటున్నారు" అని ఆయ‌న అన్నారు. అధ్యాప‌కుల ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం స‌వాలుగా మారింద‌ని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమ‌న్ చ‌క్ర‌వ‌ర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. "ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడం మాత్రమే కాదు, వారు అభివృద్ధి చెందేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణాన్ని సృష్టించడం ఇప్పుడు ప్రధాన సవాలు" అని పేర్కొన్నారు.

60 శాతం ఖాళీలు వారివే..
కులాల వారీగా ఖాళీల వివరాలను 9 ఐఐటీలు వెల్ల‌డించాయి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన 888 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో దాదాపు 60 శాతం ఈ వర్గాలకు చెందినవే కావడం గ‌మ‌నార్హం. ఓబీసీ వర్గానికి చెందిన 477 పోస్టులు, సాధారణ వర్గానికి 443, ఎస్సీ 261, ఈడబ్ల్యూఎస్‌ 170, ఎస్టీ 150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది.

చ‌ద‌వండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర‌యాణికులు ఫైర్‌

పారదర్శకత అవసరం
నియామక ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమని ఫ్యాకల్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌కు స్పష్టమైన ప్రమాణాలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి విభాగం తమ సొంత విధానాన్ని అనుసరిస్తుండటంతో ఎంపిక ప్రక్రియ ఒకేవిధంగా సాగ‌డం లేద‌ని వారు అంటున్నారు. ఏదీ ఏమైనా దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీలలో ఇంత భారీ స్థాయిలో అధ్యాపకుల కొరత, విద్యావ్య‌వ‌స్థ‌కు ఏమాత్రం మంచిదికాద‌ని.. ఖాళీల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేయాల‌ని నిపుణులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement