టెక్నాలజీ దిగ్గజ సంస్థ జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు భారత్‌లో చిన్నారులపై సోషల్ మీడియా వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వర్చువల్ ప్రపంచంలో అల్గారిథమ్‌ల ఉచ్చులో చిక్కుకుంటున్న పిల్లలను దాని నుంచి కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారులు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లకు పరిమితం కాకుండా పుస్తకాలు చదవడం, ఆటలు, ప్రకృతి వైపు మళ్లాలని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఈ ప్రతిపాదనకు బలాన్నిచ్చేలా ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంట్ 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ కీలక చట్టాన్ని ఆమోదించింది. అంతకుముందే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు బాలలపై ఆంక్షలు విధించగా యూకే, యూఏఈ, మలేషియా వంటి అనేక దేశాలు డిజిటల్ నియంత్రణలకు శ్రీకారం చుట్టాయి. అతిగా స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల చిన్నారుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, డిజిటల్ వ్యసనం పెరగడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే, వెంబు వ్యాఖ్యలపై ఇంటర్నెట్ వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంబు ఆలోచనను పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు సమర్థిస్తుండగా నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. చిన్నారులకు ఆంక్షలు విధించడం సరే.. సమాజంలో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సందేశాలను విచ్చలవిడిగా వ్యాప్తి చేసే ‘వాట్సాప్ అంకుల్స్’ (పెద్దల) సంగతేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం నిషేధాల ద్వారా సమస్యను పరిష్కరించలేమని, చిన్నారులకు డిజిటల్ అక్షరాస్యత నేర్పించడమే సరైన మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే..


