ఉప్పల్ నల్లచెరువు
ఆక్రమణల తొలగింపు.. కాలువల నిర్మాణం.. సమగ్ర అభివృద్ధి కారణంగా ఉప్పల్ నల్లచెరువు మళ్లీ జీవం పోసుకుంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా చేపట్టిన చర్యలు ఫలించాయి.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుకు భారీగా నీరు చేరి కళకళలాడుతోంది. 10 ఎకరాలకుపైగా ఆక్రమణలు, భారీ మొత్తంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలను, పూడికను తొలగించిన హైడ్రా చెరువును 70 ఎకరాలకు విస్తరించింది. రూ.20 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. వరద నీరు పారేల కాలువలు నిర్మించింది.
ఫలితంగా ఈ ఏడాది చెరువు ఎగువన ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన మెయిన్ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు, చెరువు సమీప కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. - సాక్షి, హైదరాబాద్


