అమ్మో.. అంత అవినీతా..? | Waltair Division DRM Saurabh Kumar Caught by CBI | Sakshi
Sakshi News home page

అమ్మో.. అంత అవినీతా..?

Sep 17 2026 11:22 AM | Updated on Sep 17 2026 11:59 AM

Waltair Division DRM Saurabh Kumar Caught by CBI

రైల్వే డివిజన్‌ కార్యాలయం, సౌరభ్‌ ప్రసాద్‌

సాక్షి, విశాఖపట్నం: లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయి.. సర్వీసు నుంచి ఉద్వాసనకు గురైన వాల్తేరు మాజీ డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. 2024 నవంబర్‌ 16న కాంట్రాక్టర్ల వద్ద రూ.25 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఈ అవినీతి అధికారి.. విశాఖ కేంద్రంగా భారీ స్థాయిలోనే చేతివాటం ప్రదర్శించినట్లు సీబీఐ తాజా విచారణలో బట్టబయలైంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలోనే ఆయన తన చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఏకంగా 62 శాతం మేర అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేశారు. లంచం కేసులో సీబీఐ తీగ లాగితే ఇప్పుడు అక్రమాస్తుల డొంక కదలడంతో విశాఖ డివిజన్‌లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. ఏకంగా రూ.2.19 కోట్ల అక్రమాస్తుల కేసు నమోదు చేసిన దర్యాప్తు బృందం.. వాల్తేరు డివిజన్‌ వ్యవహారాలపై మళ్లీ డేగకన్ను వేయడంతో కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  

అక్రమార్జన అంతా విశాఖలోనే.. 
2023 జూలైలో వాల్తేరు డీఆర్‌ఎంగా సౌరభ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు సెప్టెంబర్  2021 నుంచి 2023 జూలై వరకూ సెంట్రల్‌ రైల్వేలో చీఫ్‌ రోలింగ్‌ స్టాక్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. లంచం కేసులో చిక్కుకున్న తర్వాత నుంచి సౌరభ్‌ అవినీతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 2021 నుంచి 2025 మధ్య కాలంలోనే ఈయన అక్రమార్జనకు పాల్పడ్డారంటూ దర్యాప్తులో తేటతెల్లమైంది. ముఖ్యంగా.. వాల్తేరు డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అవినీతి తారాస్థాయికి చేరుకుందని గుర్తించింది. అత్యంత కీలక బాధ్యతల్లో ఉంటూ తన అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.2.19 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఇదంతా ఆయన చట్టబద్ధమైన ఆదాయం కంటే 62.04 శాతం అధికమని తాజాగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. ఈ అక్రమార్జన అంతా ప్రధానంగా ఆయన విశాఖ కేంద్రంగా పనిచేసిన కాలంలోనే జరగడం గమనార్హం. 

నాటి లంచం.. నేటి అక్రమాస్తుల కేసు.! 
రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు ముంబైలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో అప్రమత్తమైన రైల్వే బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అత్యవసర నిబంధన రూల్‌ 56(జే)ని ప్రయోగించి ఆయనను తక్షణమే సర్వీస్  నుంచి తొలగించింది. నాటి లంచం కేసు దర్యాప్తులో తీగ లాగితే, ఇప్పుడు ఏకంగా రూ.కోట్ల అక్రమాస్తుల డొంక కదిలిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముంబైలోని చెంబూర్‌లోనూ, వాల్తేరు డీఆర్‌ఎం బంగ్లాలోనూ సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అమెరికన్‌ డాలర్లు, యూరోలు, స్విస్‌ఫ్రాంక్స్, మారిషస్‌ రూపాయలు వంటి విదేశీ కరెన్సీని స్వా«దీనం చేసుకున్నారు. వీటితో పాటు లెక్కల్లోకి రాని భారీ సంఖ్యలో బంగారు నాణేలు, పసిడి, వెండి ఆభరణాలు, పెట్టుబడులకు సంబంధించిన పలు కీలకమైన ఆర్థిక పత్రాలను దర్యాప్తు అధికారులు సీజ్‌ చేశారు. 

పెరిగిన నిఘాతో..విశాఖ డివిజన్‌లో కలకలం 
తాజా పరిణామాలతో విశాఖ డివిజన్‌(పూర్వపు వాల్తేరు)లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. సౌరభ్‌ ప్రసాద్‌ డీఆర్‌ఎంగా ఉన్న సమయంలో మంజూరైన టెండర్లేంటి?, అడ్డదారిలో క్లియర్‌ చేసిన బిల్లులేంటి? సదరు కాంట్రాక్టుల వెనుక ఉన్నదెవరు? అన్న కోణంలో దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. సౌరభ్‌ ప్రసాద్‌తో అంటకాగిన అధికారులపై సీబీఐ నిఘా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో అక్రమాలకు పాల్పడిన వారిలో వణుకు మొదలైంది.   

ఇదీ చదవండి: ఆఫీసులో కుక్కల హల్‌చల్‌.. ట్రెండింగ్‌లో వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement