కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ! | Kommineni Srinivasa Rao Comments On Chandrababu Class To Collectors In Meeting | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!

Sep 17 2026 11:43 AM | Updated on Sep 17 2026 12:45 PM

Kommineni Srinivasa Rao Comments On Chandrababu Class To Collectors In Meeting

ఏపీలో మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్‌  ఐఏఎస్ అధికారుల సమావేశాలు పెట్టి ఏం సాధిస్తున్నట్లు?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల తరబడి ఇచ్చే స్పీచ్‌లను గమనిస్తే, ఒకసారి అంతా బాగుందని చెబుతారు. మరో సారి కలెక్టర్లు, ఐఏఎస్‌లు సరిగా పనిచేయడం లేదని అంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదలివేస్తుంటారని కూడా ఆయనే చెబుతారు. 12 గంటలపాటు కూర్చోలేరా? అని ప్రశ్నించి అధికారులందరిని ఆశ్చర్యపరుస్తారు. ఏవేవో ర్యాంకులు అంటారు. ఫైళ్ల క్లియరెన్స్ అంటారు. ఒక మంత్రి మొదటి స్థానంలో ఉన్నారంటారు. తదుపరి ఆ మంత్రి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రే మందలిస్తారు. 

సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నామని, లక్షన్నర కోట్లు వ్యయం చేశామని చెబుతారు. అదెలాగో స్కీములవారీగా వివరణ ఇవ్వరు. అందులో నిజం అంత ఎన్నది ప్రజలు లెక్కవేసుకోవాల్సిందే. గత ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి చర్చించరు!అప్పట్లో చంద్రబాబు ప్రకటించిన వివిధ స్కీములకు ఏడాదికి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని ఆనాటి సీఎం జగన్  చెబితే, తమకు సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. ఈ రెండేళ్లలో ఇన్నిసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి కదా! ఎంత మేర సంపాదన సృష్టించింది లెక్కలు చెప్పి ఉండవచ్చు కదా! లేదా తాను చేసిన 3.90 లక్షల కోట్ల అప్పే సంపద అని అనుకోమంటారా!. మరోవైపు పెన్షన్‌దారులలో అనర్హుల పేరుతో ఏరివేయాలని అంటారు. చివరికి పెన్షన్ దారులను తాగుబోతులుగా అభివర్ణిస్తారు. 

మద్యం షాపులను ఇష్టారాజ్యంగా సిండికేట్లకు ఇచ్చి బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెడతారు.  ఎంఆర్‌పీ మించి ధరకు అన్ని చోట్ల అమ్ముతున్నా,చర్యలు ఉండవుకాని, కలెక్టర్ల సదస్సులో మాత్రం హుంకరిస్తుంటారు.ఎన్నికలకు ముందు సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకుంటే తప్పేముందని,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఆయనే హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయి ఉండవచ్చు. డిఎస్సిని బాగా చేశామని అంటారు. అక్రమాలు బయటపడడంతో డిఎస్సి నిర్వహణ అంతా అధికారులే చూసుకున్నారని చెప్పేస్తారు.చంద్రబాబు చెప్పే అనేక అంశాలలో ఒకదానితో మరొకటి పొంతన ఉండదన్న భావన ఉంది.

గత కలెక్టర్ల సమావేశాలలో వచ్చిన సమస్యలే మళ్లీ,మళ్లీ వస్తుంటాయి. అంతా ఏకపాత్రాభినయంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుందని కొందరు అదికారులు వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు అధికారులను ఆయన కావాలని అవమానించేలా మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతోందన్న ప్రచారం ఐఏఎస్ వర్గాలలో జరుగుతోంది.వీరిని స్కూల్ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయడం, తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది.ఎవరి పని తీరైనా నచ్చకపోతే వారిపై చర్య తీసుకోవచ్చు.లైవ్ లో టీవీ ప్రసారాలు జరుగుతున్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితే అదికారులలో నైతిక స్థైర్యం దెబ్బతినదా అన్నది ప్రశ్న. అధికారులు కొందరు సమావేశాలకు రాకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి కదా! మంత్రులు,  ఐఏఎస్ లు అంతా రావల్సిందేనట.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు రాకపోయినా, ఈ సదస్సులకు హాజరుకాకపోయినా ఇలాగే ప్రశ్నిస్తున్నారా అని ఐఏఎస్ లు గుసగుసలాడుకున్నారట. ఐఏఎస్ లు ఈ చెవితో విని ,ఆ చెవితో వదలివేస్తున్నారని చంద్రబాబే చెప్పిన తర్వాత ఈ సదస్సులకు ఉన్న విలువ ఏమిటో అర్ధం అవుతూనే ఉంది.12 గంటలు కూర్చోవాల్సిందేనని సీఎం  ఆదేశిస్తే, బయటకు వెళ్లిన తర్వాత అదికారులు ఏలా ఫీల్ అవుతారో ఊహించుకోపోవచ్చు. ఇదంతా లాఫింగ్ స్టాక్ అవుతుందని గమనించాలి.సుదీర్ఘంగా మాట్లాడడం అలవాటు చేసుకుని గంటల తరబడి ప్రసంగాలు చేస్తే ఎంత ఐఏఎస్ లైనా ఎలా భరించగలుగుతారు? నిజానికి సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందిన ఈ రోజుల్లో రెండు రోజుల పాటు ఇలా కలెక్టర్ల సదస్సులు పెట్టడం అవసరమా?కాదా?అన్న చర్చ ఉంది.

అసలు సమావేశాలు వద్దని ఎవరూ అనరు.కాని అవి అర్ధవంతంగా లేకపోతే రెండు రోజుల ఖర్చు వృధా అవడం తప్ప ఏమీ ఉండదు కదా అన్నది కొందరి అభిప్రాయం. రాజకీయ పాలన చేయాలని  ఐఏఎస్ లకు,ఐపిఎస్ లకు చెప్పిన తర్వాత ఇంక వారు చేసే సాధారణ పాలన ఏమి ఉంటుంది?తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన పనులు చేయడమే కదా రాజకీయ పాలన అంటే!ప్రత్యర్ధి రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఎలాంటి పనులు జరగకూడదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత కలెక్టర్లు నెత్తి,నోరు కొట్టుకోవడం తప్ప ఏమి ఉంటుంది?గంటల తరబడి ఉప్యాసాలు ఇచ్చేసి ,ఎవరైనా అధికారులు సమస్యలు చెప్పబోతే వారిని డబాయిస్తే అవి ఎలా పరిష్కారం అవుతాయి.గత సమావేశంలో కూడా అటవీ శాఖ,పర్యావరణ సమస్యలు వచ్చాయి. దానికి చంద్రబాబు ఇచ్చిన చిట్కా ఏమిటో తెలుసా!కాసేపు అటవీ,పర్యావరణ అధికారులు కళ్లు మూసుకోవాలట.అప్పుడు పనులు చేసుకోవాలట.

 సంబంధిత చట్టాలు చేసింది ఎవరు?వాటిని అమలు చేయవద్దని చెబుతున్నదెవరు? పెన్షన్ల ను,ఇళ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇచ్చేసిందట.సాచ్యురేషన్ మోడ్ లో గత ప్రభుత్వం వివిధ స్కీములను అమలు చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు గుప్పించి,కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత దానిని చంద్రబాబు తప్పుపడుతున్నారు.అది సరికాదని అనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసివేసి ఉండాలి కదా!రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపి స్థానిక ఎన్నికలకు ముందు పెన్షన్లు ఇవ్వడంలోకాని, అనర్హతతో రద్దు చేసే ఆలోచనకాని ఎందుకు చేస్తున్నట్లు?ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తమకు కావల్సినవారికే పెన్షన్ దరఖాస్తులు అప్ లోడ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

అలాగే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పెన్షన్లు రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలట. అదేమిటో అర్ధం కాదు.ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వారు బతుకుతారు. వారిలో అర్హులైనవారికి పెన్షన్లు,ఇళ్లు వంటివాటిని ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల పేరుతో వీటిని తగ్గించాలని చూస్తున్నారా అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.దీనికి ఎల్లో మీడియా పెట్టిన హెడింగ్ ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?దీనిని చంద్రబాబు ఆచరించి చూపారా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.కుటుంబం ఒక యూనిట్ అయితే పెన్షన్లు, ఇళ్లు తదితర అన్నీ స్కీములలో లబ్దిదారులు బాగా తగ్గిపోతారన్నమాట.ప్రస్తుతానికి లబ్దిదారులను యధాతధంగా కొనసాగిస్తామని అంటున్నా,దానికి గ్యారంటీ ఏమి ఉంటుంది. 

కొంతమందికి ఒక విధానం, మరికొందరికి ఇంకో విధానం ఉంటుందా? ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఎలా చెప్పారు?అప్పుడు ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించలేదా?యధా ప్రకారం వైఎస్సార్‌సీపీపైన పరోక్ష విమర్శలు చేయడం, ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్ లను వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ,లేదా మరికొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా అధికారులను పురికొల్పడం కోసం కలెక్టర్ల సమావేశాలు పెట్టాలా? ఇప్పటికే పోలీసు, అధికార యంత్రాంగం ద్వారా అన్ని కుట్రలు చేస్తున్నారు కదా! పైళ్ల క్లియరెన్స్ అంటూ లెక్కలు చెప్పడం ఆయనకు ఎప్పటి నుంచో అలవాటే. దాదాపు ప్రతి రోజు ఆయా జిల్లాలకు వెళ్లి సభలు పెట్టి అధికారులకు ర్యాంకులు ఇస్తున్న చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ర్యాంకులు అంటూ కధ నడపడం దేనికి?. విశేషం ఏమిటంటే చంద్రబాబేమో అన్ని పనులు చేసేయాలని హుకుం జారీ చేస్తుంటారు.

ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?

ఆర్ధిక మంత్రి కేశవ్ ఏమో బడ్జెట్ తో సంబంధం లేకుండా మితిమీరి ప్రతిపాదనలు వస్తుంటే ఒత్తిడి అవుతోందని అంటున్నారు.నిధులు ఇచ్చినా,ఇవ్వకపోయినా పనులు జరగాలంటే అది ఎలా అవుతుంది. చివరికి అసలు విషయం ఏమిటంటే తమది రాజకీయ పాలన కనుక కూటమి నేతలకు అధికారుల వద్దకు వస్తే గౌరవించాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రజలు ఎవరు వచ్చినా, ఏ రాజకీయ పార్టీవారు వచ్చినా మర్యాద ఇవ్వండి అని చెప్పవలసిన చంద్రబాబు ఇలాంటి ప్రసంగాలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం అనిపించదా!అయినా ఆయన తప్పులేదనుకోవాలి.రాజకీయ పాలన చేస్తామని ఆయన చెబుతుంటే జనం నిలదీయనంతకాలం ఇలాంటి నేతలు ఇలాగే పాలన చేస్తారు.

-కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్‌ జర్నలిస్ట్‌,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement