E20తో మైలేజీ తగ్గిందా?: సర్వేలో సంచలన విషయాలు! | Petrol Vehicle Owners Call E20 Rollout Ineffective or Disastrous, Claims Survey | Sakshi
Sakshi News home page

E20తో మైలేజీ తగ్గిందా?: సర్వేలో సంచలన విషయాలు!

Jul 6 2026 8:53 AM | Updated on Jul 6 2026 12:21 PM

Petrol Vehicle Owners Call E20 Rollout Ineffective or Disastrous, Claims Survey

దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగానే E20 పెట్రోల్‌ (20 శాతం ఇథనాల్‌, 80 శాతం పెట్రోల్‌) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే.. ఈ నిర్ణయం పాత పెట్రోల్‌ వాహనాల యజమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల లోకల్‌సర్కిల్స్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22,567 మంది పెట్రోల్‌ వాహన యజమానులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది E20 పెట్రోల్‌ అమలు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ E20 అమలు విధానాన్ని తప్పుబట్టారు. 42 శాతం మంది ఈ విధానాన్ని విపత్తుగా అభివర్ణించారు. కొంతమంది మాత్రమే ప్రభుత్వ చర్యలను మెచ్చుకున్నారు.

2023కు ముందు తయారైన పెట్రోల్‌ వాహనాలను వినియోగిస్తున్న యజమానుల్లో 66 శాతం మంది E20 పెట్రోల్‌ వాడిన తర్వాత తమ వాహనాల మైలేజీ 10 శాతం కంటే ఎక్కువ తగ్గిందని తెలిపారు. ఇథనాల్‌ శక్తి సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే.. తక్కువగా ఉండటంతో, అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాత వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది తమ వాహనాల్లో విడిభాగాలు అరిగిపోవడం, మరమ్మతుల అవసరం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఇథనాల్‌కు అనుకూలంగా రూపొందించని పాత ఫ్యూయల్‌ పైపులు, రబ్బరు సీల్స్‌, గ్యాస్కెట్లు, ఫ్యూయల్‌ పంప్‌ వంటి భాగాలపై ప్రభావం పడే అవకాశముందని ఆటోమొబైల్‌ నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో 2023 ఏప్రిల్‌కు ముందు తయారైన చాలా పెట్రోల్‌ వాహనాలు E10 (10 శాతం ఇథనాల్‌) మిశ్రమానికి అనుగుణంగా ఉన్నాయి. 2025 ఏప్రిల్‌ తర్వాత తయారైన వాహనాలే పూర్తిగా E20కు అనుకూలంగా తయారవుతున్నాయి. కాబటి ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న కోట్లాది పాత వాహనాల యజమానులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని సర్వే సూచిస్తోంది.

సర్వేలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. 2023కు ముందు తయారైన వాహనాల యజమానుల్లో 31 శాతం మంది, ధర ఎక్కువైనా E0 (ఇథనాల్‌ లేని పెట్రోల్‌) లేదా E10 పెట్రోల్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంటే దానినే ఎంచుకుంటామని తెలిపారు. అంటే.. ప్రజలు ఇథనాల్‌ మిశ్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించడం కాదు. తమ వాహనానికి సరిపోయే ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement