బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, డిజిటల్ వాలెట్ల వినియోగదారుల హక్కులకు మరింత రక్షణ కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 2021 ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా సవరిస్తూ మరింత పారదర్శకమైన, వేగవంతమైన, పునరుద్ధరించిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (ఆర్‌బీ-ఐఓఎస్)ను 2026 జులై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ‘సేవా లోపం’ జరిగితే కస్టమర్లకు లభించే గరిష్ట పరిహారాన్ని ఆర్‌బీఐ భారీగా పెంచడం ఈ కొత్త విధానంలో అత్యంత కీలకమైన అంశం.
రూ.33 లక్షల వరకు పరిహారం..
కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం కస్టమర్లకు లభించే పరిహారాల పరిమితిని గణనీయంగా పెంచారు. పాత నియమాలతో పోలిస్తే పెరిగిన మార్పులు ఇలా ఉన్నాయి.
| పరిహార రకం | మునుపటి పరిమితి (2021 ఫ్రేమ్‌వర్క్) | సవరించిన కొత్త పరిమితి (2026 జూలై 1 నుంచి) |
|---|---|---|
| ఆర్థిక నష్టాలకు గరిష్ట పరిహారం | రూ.20 లక్షలు | రూ.30 లక్షల వరకు |
| మానసిక వేదన, సమయం వృధాకు పరిహారం | రూ.1 లక్ష | రూ.3 లక్షల వరకు |
అంబుడ్స్‌మన్ తీర్పు ఇచ్చే పరిహారానికి పరిమితి ఉన్నప్పటికీ, అంబుడ్స్‌మన్ ముందుకు తీసుకువచ్చే వివాదాల మొత్తం విలువపై ఎలాంటి ద్రవ్య పరిమితి లేదు.
వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్
వినియోగదారులు తమ భౌగోళిక ప్రాంతంతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకునేందుకు వీలుగా ‘వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్’ విధానాన్ని ఆర్‌బీఐ మరింత బలోపేతం చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, షెడ్యూల్డ్ సహకార బ్యాంకులతోపాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (డిజిటల్ వాలెట్లు), పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ఆర్‌బీఐ నోటిఫై చేసిన ఇతర నియంత్రిత సంస్థలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
ఎలాంటి ఫిర్యాదులు చేయవచ్చు?
అనధికారిక ఆన్‌లైన్ లావాదేవీలు, ఏటీఎం, కార్డ్ వివాదాలు, డిజిటల్ పేమెంట్ వైఫల్యాలు, రీఫండ్ చేయడంలో జాప్యం, లోన్ సర్వీసింగ్ సమస్యలు, క్రెడిట్ రిపోర్టులో తప్పులు, రికవరీ ఏజెంట్ల వేధింపులు, ఇతర కస్టమర్ సేవా లోపాలపై ఫిర్యాదు చేయవచ్చు.
బ్యాంకుల అంతర్గత వాణిజ్య నిర్ణయాలు (లోన్ మంజూరు లేదా వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి), కోర్టులు/ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు, అనామక ఫిర్యాదులు, ఉద్యోగి-యజమాని వివాదాలు, పాలసీ నిర్ణయాలు ఈ పరిధిలోకి రావు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
నేరుగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. మొదట సంబంధిత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీకి ఫిర్యాదు సమర్పించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా సదరు సంస్థ స్పందించకపోయినా లేదా వారి ఇచ్చిన పరిష్కారంపై కస్టమర్ అసంతృప్తిగా ఉన్నా ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. బ్యాంకు తుది సమాధానం ఇచ్చిన 90 రోజులలోపు లేదా ప్రతిస్పందన రానట్లయితే నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది.
కోర్టు ఖర్చులు లేవు!
కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా డిప్యూటీ అంబుడ్స్‌మన్ పాత్రను ఆర్‌బీఐ మరింత బలోపేతం చేసింది. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం, నిబంధనలకు లోబడి లేని వాటిని తిరస్కరించడం, ఇరు పక్షాల మధ్య రాజీ కుదర్చడం వంటి కీలక అధికారాలను వారికి అప్పగించారు. అలాగే, ఈ ప్రక్రియ అంతా సరళంగా ఉంటుంది. కస్టమర్లు తమకు తాముగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా వాదనలు వినిపించవచ్చు. దీనికోసం న్యాయవాదుల అవసరం ఉండదు.
అప్పీల్ చేసుకునే అవకాశం
అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పుపై కస్టమర్ లేదా సదరు ఆర్థిక సంస్థ అప్పీల్‌కు వెళ్లవచ్చు. ఆర్‌బీఐ వినియోగదారుల రక్షణ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఇక్కడ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. అయితే, విచారణ సమయంలో సరైన పత్రాలు లేదా సమాచారం అందించడంలో విఫలమైన బ్యాంకులు/నియంత్రిత సంస్థలకు అప్పీల్ చేసుకునే హక్కు ఉండదు.
ఫిర్యాదు దాఖలు చేయడానికి మార్గాలు:
ఆర్‌బీఐ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ (https://cms.rbi.org.in) ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.
ఈమెయిల్ / పోస్ట్: చండీగఢ్‌లోని కేంద్రీకృత స్వీకరణ, ప్రాసెసింగ్ కేంద్రానికి (సీఆర్‌పీసీ) భౌతిక దరఖాస్తును పంపవచ్చు.
టోల్-ఫ్రీ నంబర్: మరిన్ని వివరాలు, మార్గదర్శకత్వం కోసం ఆర్‌బీఐ ప్రత్యేక టోల్-ఫ్రీ నంబర్ 14448 ద్వారా బహుళ భారతీయ భాషల్లో సహాయాన్ని అందిస్తోంది.
ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు


