‘డబ్బా ట్రేడింగ్’పై వార్నింగ్‌.. పోలీసులకు ఫిర్యాదు | NSE investor advisory dabba illegal trading services | Sakshi
Sakshi News home page

‘డబ్బా ట్రేడింగ్’పై వార్నింగ్‌.. పోలీసులకు ఫిర్యాదు

Jul 4 2026 10:26 AM | Updated on Jul 4 2026 10:56 AM

NSE investor advisory dabba illegal trading services

దేశీయ స్టాక్ మార్కెట్లో అక్రమ ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కీలక హెచ్చరిక జారీ చేసింది. లెజెండ్రీ ట్రేడర్స్ (Legendry Traders), లెట్స్ ట్రేడ్ ఇండియా (Let's Trade India) పేర్లతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న రెండు సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది.

ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం, లెజెండ్రీ ట్రేడర్స్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా స్టాక్ మార్కెట్ చిట్కాలు అందించడంతో పాటు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ ఖాతాలను నిర్వహించే సేవలను కూడా అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెట్స్ ట్రేడ్ ఇండియా టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లు, అనుబంధ వెబ్‌సైట్లు, 9773687281 మొబైల్ నంబర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.

గ్యారెంటీ లాభాలంటే నమ్మొద్దు

స్టాక్ మార్కెట్లో హామీ లేదా నిర్ధారిత రాబడులు ఇస్తామని ప్రచారం చేసే ఏ వ్యక్తి లేదా సంస్థను నమ్మవద్దని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇటువంటి పథకాలు చట్టవిరుద్ధమని, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి ట్రేడింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.

రిజిస్టర్డ్ బ్రోకర్లేనా? ముందుగా చెక్ చేసుకోండి

ఈ రెండు సంస్థలు ఎన్ఎస్ఈలో నమోదైన స్టాక్ బ్రోకర్లు గానీ, అధీకృత ప్రతినిధులు గానీ కాదని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. కాబట్టి ఏ బ్రోకర్ లేదా సంస్థతోనైనా లావాదేవీలు చేపట్టే ముందు ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌లోని "Know/Locate Your Stock Broker" సదుపాయం ద్వారా వారి నమోదు వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించేకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది.

ఏమిటీ 'డబ్బా ట్రేడింగ్'?

'డబ్బా ట్రేడింగ్' అనేది సెబీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెలుపల జరిగే చట్టవిరుద్ధ, అనియంత్రిత ట్రేడింగ్ విధానం. ఇందులో కొనుగోలు, అమ్మకాల ఒప్పందాలు అధికారిక ఎక్స్ఛేంజీలపై అమలు కాకుండా, డబ్బా ఆపరేటర్లు తమ అంతర్గత వ్యవస్థల్లోనే సెటిల్ చేస్తారు. దీంతో ఈ ట్రేడ్లు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల పర్యవేక్షణకు దూరంగా ఉంటాయి.

ఇలాంటి ట్రేడింగ్‌లో పెట్టుబడిదారులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అధికారిక ఎక్స్ఛేంజీల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా వినియోగించుకోలేరు. అందువల్ల డబ్బా ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని ఎన్ఎస్ఈ మరోసారి స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement