కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు మెటా సంస్థపై ఓక్‌లాండ్‌లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో రాష్ట్రాల తరఫు న్యాయవాదులు దాదాపు 200 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతున్నట్లు తెలిపారు. అయితే.. మెటా దాఖలు చేసిన కోర్టు పత్రంలో రాష్ట్రాలు 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు జరిమానా కోరుతున్నాయని, దీన్ని అసాధారణమైనదిగా అభివర్ణించింది.
2023లో బహుళ రాష్ట్రాల విచారణ అనంతరం నలుగురు అటార్నీ జనరల్స్ ఈ కేసును దాఖలు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యువ వినియోగదారులను ఎక్కువసేపు కట్టిపడేసేందుకు ఇన్ఫినిట్ స్క్రోల్, ఆటోప్లే, లైక్స్ వంటి మానసికంగా ప్రభావితం చేసే ఫీచర్లను మెటా రూపొందించిందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ యాప్‌లు యువతలో ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు పెంచుతున్నాయని తెలిసినప్పటికీ, వాటిని సురక్షితమైనవిగా చిత్రీకరించి మెటా వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అదనంగా.. 13 ఏళ్లలోపు వినియోగదారుల డేటాను అనుమతి లేకుండా సేకరించి చిన్నారుల ఆన్‌లైన్ గోప్యతా చట్టాన్ని (COPPA) ఉల్లంఘించిందని కూడా ఆరోపిస్తున్నారు.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొసేరీ ఈ విచారణలో సాక్ష్యం చెప్పనున్నారు. ఇప్పటికే లాస్ ఏంజిల్స్, న్యూమెక్సికోలలో జరిగిన ఇలాంటి కేసుల్లో జ్యూరీలు మెటాకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి, వాటిపై మెటా అప్పీలు చేయనుంది. సోషల్ మీడియా అడిక్షన్ అనేది అధికారికంగా గుర్తించిన మానసిక వ్యాధి కాదని మెటా వాదిస్తోంది.
ఈ కేసును పరిశ్రమ నిపుణులు సోషల్ మీడియా రంగానికి 'బిగ్ టొబాకో' తరహా కీలక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ఈ విచారణ సుమారు ఆరు వారాల పాటు కొనసాగనుంది.


