భారత కంపెనీల లాభాలకు రిస్క్‌  | West Asia conflict may dent India Inc profitability by 200 bps | Sakshi
Sakshi News home page

భారత కంపెనీల లాభాలకు రిస్క్‌ 

May 26 2026 5:08 AM | Updated on May 26 2026 8:11 AM

West Asia conflict may dent India Inc profitability by 200 bps

200 బేసిస్‌ పాయింట్లు తగ్గొచ్చు 

మరింతకాలం కొనసాగితే డిమాండ్‌పై ప్రభావం 

క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఏర్పడిన సరఫరా పరమైన అవరోధాలు మరింత కాలం పాటు కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల లాభదాయకత 200 బేసిస్‌ పాయింట్లు (2 శాతం) తగ్గొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. కాకపోతే బలమైన బ్యాలన్స్‌ షీట్లు, దేశీ డిమాండ్‌ స్థిరంగా ఉండడం, ప్రభుత్వ మూలధన వ్యయాల మద్దతుతో భారత కంపెనీలు ఈ సమస్యలను ఎదుర్కొని బలంగా నిలుస్తాయని అంచనా వేసింది. 

34 రంగాల్లోని సంస్థలు ఏ మాత్రం ఒత్తిళ్లను ఎదుర్కోగలవన్న దానిపై క్రిసిల్‌ రేటింగ్స్‌ ఒక అధ్యయనం చేసింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న పశ్చిమాసియా ఘర్షణ దేశీ కంపెనీలు తమ సరఫరా చైన్‌లను తిరిగి సమీక్షించుకోవడం, ధరల ఒత్తిళ్లను అధగమించడం, అధిక ఇంధన, రవాణా వ్యయాలను ఎదుర్కోవడం, కరిగిపోతున్న రూపాయి విలువను తట్టుకుని నిలబడేలా ప్రేరేపిస్తున్నట్టు వివరించింది. సంఘర్షణ ముగిసేందుకు, స్థిరీకరణకు ఎక్కువ కాలం పడితే, సరఫరా సమస్యలతో ద్రవ్యోల్బణం పెరిగిపోయి డిమాండ్‌పై ప్రభావం పడొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సోమశేఖర్‌ వేమూరి పేర్కొన్నారు. 

కనుక ఘర్షణ స్థాయి, అది ఎంత కాలం పాటు కొనసాగుతుంది, చమురు ధరల పెరుగుదల ఎంత కాలం పాటు కొనసాగుతుందన్నది కీలకంగా చూడాల్సి ఉంటుందని.. ఇవన్నీ కంపెనీల క్రెడిట్‌ నాణ్యతను (రుణాలకు సకాలంలో చెల్లింపులు) ప్రభావం చేస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సోమశేఖర్‌ వేమూరి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మూడో నెలలోకి ప్రవేశించడం, ఇంకెంత కాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోవడంతో కంపెనీలపై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు క్రిసిల్‌ రేటింగ్స్‌ ఈ అధ్యయం చేయడం గమనార్హం.  

తొమ్మిది నెలల పాటు సమస్యలే.. 
సరఫరా సమస్యలు తొమ్మిది నెలల పాటు కొనసాగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 110 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. కనీసం 95 డాలర్ల స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఆదాయ వృద్ధి కంటే ఖర్చులను నియంత్రించుకోవడం, లాభదాయకతను కాపాడుకోవడం కంపెనీలకు సవాళ్లుగా క్రిసిల్‌ రేటింగ్స్‌ ఎండీ సుబోధ్‌ రాయ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఎనిమిది రంగాల్లోని కంపెనీల రుణ నాణ్యత ప్రభావితం కావొచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్‌ గార్మెంట్స్, రొయ్యల ప్రాసెసర్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ దారులు రూపాయి విలువ క్షీణతతో లాభపడొచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement