breaking news
Profitability Index
-
లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి
న్యూఢిల్లీ: లాభదాయకతకు అనుగుణంగా పెట్టుబడులు, ఉద్యోగుల వేతనాలను పెంచడంపై దృష్టి పెట్టాలని కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. అప్పుడే భారత్ 6.5 శాతం పైగా ఆర్థిక వృద్ధిని నిలకడగా సాధించగలదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన చెప్పారు. పెట్టుబడుల సానుకూల వలయాన్ని వివరిస్తూ, ఇన్వెస్ట్మెంట్లతో సామర్థ్యాలు పెరగడంతో పాటు మరింత అధిక వేతనాలతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇది కుటుంబాలు ఇంకాస్త ఎక్కువ పొదుపు చేసేందుకు దోహదపడుతుందని నాగేశ్వరన్ చెప్పారు. కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటోందని, వచ్చే 25 లేదా 30 ఏళ్ల పాటు ఇదే తీరు కొనసాగితే నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా పురోగమించలేమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య సంపన్న దేశాల్లోనే కనిపిస్తుందే తప్ప భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో ఉండదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ చెప్పారు. 21వ శతాబ్దపు రెండో దశాబ్దంలో భారతీయ ప్రైవేట్ రంగ లాభదాయకత రూ. 7.2 లక్షల కోట్ల నుంచి రూ. 28.7 లక్షల కోట్లకు నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, పెట్టుబడులు మాత్రం మూడు రెట్లే పెరిగాయని ఆయన చెప్పారు. ఇన్ఫ్రాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.. రాబోయే 25 ఏళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యాల పెంపుపై భారత్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, ప్రైవేట్ రంగం ఇటు పెట్టుబడులు అటు ఉద్యోగుల వేతనాల మధ్య సమతూకం ఉండేలా చూసుకోవాలని నాగేశ్వరన్ పేర్కొన్నారు. కుటుంబాల ఆదాయాలు, పొదుపు పెరిగితేనే నిలకడగా వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. పెట్టుబడులతో మరిన్ని ప్రయోజనాలను రాబట్టాలంటే పరిశ్రమలపై రెగ్యులేటరీ భారం తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మధ్య విశ్వసనీయత పెరగాలని నాగేశ్వరన్ చెప్పారు. కొన్ని సార్లు నియంత్రణ సంస్థలపరంగా దేన్ని డీరెగ్యులేట్ చేయాలనే దానిపై స్పష్టత ఉన్నప్పటికీ ఎలా చేయాలనేది సవాలుగా ఉంటుందని ఆయన తెలిపారు. నియంత్రణల తొలగింపు అనేది కొన్ని సందర్భాల్లో అవాంఛితమైన విధంగా దురి్వనియోగానికి కూడా దారి తీసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలు సాధించాలంటే ఇరుపక్షాలు పరస్పరం నమ్మకంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకుండా, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మధ్య కూడా నమ్మకం ఉండాలి. సమిష్టిగా కలిసి పని చేస్తే తప్ప వచ్చే 25 ఏళ్లలో మనం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేం‘ అని నాగేశ్వరన్ చెప్పారు. మరోవైపు, ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నట్లు భారత్ 6.3–6.8 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేసిందని .. రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ప్రభుత్వ పెట్టుబడుల దన్ను, పన్నులపరమైన ఉపశమనం, వడ్డీ రేట్ల తగ్గుదల తదితర సానుకూలాంశాలతో ఇదే స్థాయి వృద్ధి సుదీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్‌ఐల లాభాలు పెరుగుతాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత పుంజుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. నూతన నియంత్రణపరమైన కార్యాచరణ కింద అవి మెరుగైన రేట్లకు రుణాలు ఇచ్చే వెసులుబాటు లాభాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం పెరుగుతున్న వడ్డీ రేట్ల క్రమం.. ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్‌ఐల లాభాలను ప్రభావితం చేయకపోవచ్చని, నిధులపై అవి వెచ్చించే అధిక వ్యయాలను, రుణాలపై అధిక వడ్డీ రేట్ల రూపంలో అధిగమించగలవని పేర్కొంది. దీంతో నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గానే ఉంటాయని తన నివేదికలో అంచనా వేసింది. రుణ రేట్లను నిర్ణయించడంలో పెరిగిన అనుకూలతే వాటి లాభదాయకతకు తోడ్పడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. పెరిగిన రేట్లు.. ఇప్పటికే చాలా వరకు ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు రుణ రేట్లను 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు పెంచినట్టు క్రిసిల్ రేటింగ్స్ డిప్యూటీ చీఫ్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. దీంతో వాటికి పెరిగిన రుణ సమీకరణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు తగినంత వెసులుబాటు ఉందని చెప్పారు. అలాగే, ఆస్తుల నాణ్యత సవాళ్లను ఎదుర్కొనేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువ నిధులను పక్కన పెట్టినందున, అవసరమైతే ఆయా నిధులను కూడా వినియోగించుకోగలవన్నారు. ఆదాయ పరిమితి పెంచడం (రుణ గ్రహీతల), రుణ రేట్లను నిర్ణయించడంలో వచ్చిన వెసులుబాటు వల్ల ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు ప్రస్తుత మార్కెట్లలోనే మరింతగా చొచ్చుకుపోగలవని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే
న్యూఢిల్లీ: పన్ను పరిధిని పెంచడంతో పాటు అప్రకటిత ఆదాయానికి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆర్థికంగా వృద్ధిచెందుతున్న కొన్ని నగరాల్లో లగ్జరీ కార్ల కొనుగోలు, పెట్టుబడులపై వడ్డీ, వ్యక్తిగత వ్యయం, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మూలధన రాబడి (క్యాపిటల్ గెయిన్స్) తదితర లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, కొచ్చి, లక్నో, భోపాల్, గువాహటిల్లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా నిఘా, నేర పరిశోధన కార్యాలయం(డీఐసీఐ)ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. గువాహటిలో షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో భారీగా చేసే వ్యక్తిగత ఖర్చులను, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులను, భవనాల కొనుగోళ్లను అధికారులు విశ్లేషించనున్నారు. బెంగళూరులో కార్పొరేట్ బాండ్లు, సహకార రుణ సంఘాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడులపై వ్యక్తులకు వచ్చే వడ్డీని అక్కడి ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. తమిళనాడులో ఇసుక తవ్వకం, కలప దిగుమతుల్లోకి వచ్చే పెట్టుబడులపై చెన్నైలోని ఐటీ ఉద్యోగులు ఆరా తీయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీబీడీటీ, ఐటీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి.. ఐటీ రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది.