ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే | Sakshi
Sakshi News home page

ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే

Published Thu, Jul 31 2014 12:28 AM

ఖరీదైన కారు కొంటే...ఐటీ కంట్లో పడినట్లే - Sakshi

న్యూఢిల్లీ: పన్ను పరిధిని పెంచడంతో పాటు అప్రకటిత ఆదాయానికి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆర్థికంగా వృద్ధిచెందుతున్న కొన్ని నగరాల్లో లగ్జరీ కార్ల కొనుగోలు, పెట్టుబడులపై వడ్డీ, వ్యక్తిగత వ్యయం, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మూలధన రాబడి (క్యాపిటల్ గెయిన్స్) తదితర లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, కొచ్చి, లక్నో, భోపాల్, గువాహటిల్లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా నిఘా, నేర పరిశోధన కార్యాలయం(డీఐసీఐ)ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది.
 
గువాహటిలో షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో భారీగా చేసే వ్యక్తిగత ఖర్చులను, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులను, భవనాల కొనుగోళ్లను అధికారులు విశ్లేషించనున్నారు. బెంగళూరులో కార్పొరేట్ బాండ్లు, సహకార రుణ సంఘాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడులపై వ్యక్తులకు వచ్చే వడ్డీని అక్కడి ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. తమిళనాడులో ఇసుక తవ్వకం, కలప దిగుమతుల్లోకి వచ్చే పెట్టుబడులపై  చెన్నైలోని ఐటీ ఉద్యోగులు ఆరా తీయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీబీడీటీ, ఐటీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
 
ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి..
ఐటీ రిటర్నుల ఆన్‌లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement